PM Kisan Beneficiary Status Check: చాలామంది చిన్న, సన్నకారు రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద సుమారు 8 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.16 వేల కోట్లకు పైగా నగదు బదిలీ చేసింది.


పీఎం కిసాన్‌ యోజనకు అర్హత ఉన్నా ఇప్పటికీ రూ.2000 తీసుకోని రైతులు చాలా మందే ఉన్నారు. ఇదే సమయంలో కొంతమంది రైతులు వెబ్‌సైట్‌లో నగదు బదిలీ స్టేటస్‌ తెలుసుకోలేక పోతున్నామని ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే పీఎం కిసాన్ యోజన వెబ్‌సైట్‌లో కీలక మార్పులు చేశారు. అవేంటో తెలుసుకొంటే స్టేటస్ చెక్‌ చేసుకోవడం సులభం అవుతుంది.


ఇకపై లబ్ధిదారులు తమ స్టేటస్‌ తనిఖీ చేసుకొనేందుకు కేవలం ఆధార్ కార్డు సరిపోదు. ఆధార్‌తో అనుసంధానించిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ అవసరం. ఇది కాకుండా పీఎం కిసాన్ 12వ విడతలో రూ.2000 ఇంకా కొంతమంది రైతుల బ్యాంకు ఖాతాలకు చేరలేదు. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారు కేవైసీ, భూమి రికార్డుల తనిఖీ వంటివి త్వరగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.


మొబైల్‌ నంబర్‌ కీలకం


పీఎం కిసాన్‌ యోజనలో అవినీతి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. కేవైసీని తప్పనిసరి చేసింది. భూమి రికార్డుల ధృవీకరణ, పోర్టల్‌లో స్థితిని తనిఖీ ప్రక్రియను మార్చింది. ఇక నుంచి ప్రధానమంత్రి కిసాన్ యోజనలో రైతుల మొబైల్ నంబర్ కీలకంగా మారింది. లబ్ధిదారులు తమ స్టేటస్‌ తెలుసుకోవడానికి PM కిసాన్ అధికారిక పోర్టల్‌లో ఆధార్ నంబర్‌ను చూపించాల్సిన అవసరం లేదు. అనుసంధానం చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ ఉంటే చాలు.


స్టేటస్‌ తెలుసుకొనే ప్రక్రియ


పీఎం కిసాన్ 12వ విడత నగదు బదిలీ స్టేటస్‌ తెలుసుకోవడానికి pmkisan.gov.inకి లాగిన్‌ అవ్వాలి. 
ఇప్పుడు కుడి వైపు ఉన్న బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
తర్వాత వెబ్ పేజీ రాగానే రైతు తన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.
PM కిసాన్ లబ్ధిదారులు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ మరచిపోతే 'మీ రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోండి' లింక్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి. 
ఇప్పుడు గెట్ ఓటీపీపై క్లిక్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని వెబ్‌సైట్‌లో నమోదు చేయండి.
గెట్ డిటెయిల్‌పై క్లిక్ చేశాక పీఎం కిసాన్ లబ్ధిదారుని సమాచారం స్క్రీన్‌పై వస్తుంది.