SBI SMS Charges: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మొబైల్ ఫండ్ బదిలీలపై ఎస్  ఎమ్ ఎస్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. యూఎస్‌ఎస్‌డి సేవలను ఉపయోగించి వినియోగదారులు ఇప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు చేసుకోవచ్చని ఎస్బీఐ తెలిపింది. 


“మొబైల్ ఫండ్ బదిలీలపై ఇప్పుడు SMS ఛార్జీలు రద్దు చేయబడ్డాయి. వినియోగదారులు ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సౌకర్యవంతంగా లావాదేవీలు చేసుకోవచ్చు’’ అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. డబ్బు పంపడం, తీసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మినీ స్టేట్ మెంట్, యూపీఐ పిన్ మార్చడం వంటివి కూడా ఖర్చు లేకుండా పొందవచ్చని తెలిపింది. 


యూఎస్ ఎస్ డీ అంటే ఏంటి?


USSD లేదా అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా.. సాధారణంగా టాక్ టైమ్ బ్యాలెన్స్‌లు లేదా ఖాతా సమాచారాన్ని తనిఖీ చేయడానికి ఇంకా మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగిస్తారు.  ఫీచర్ ఫోన్‌లలో ఈ సర్వీస్ పనిచేస్తుంది. దేశంలోని 1 బిలియన్ మొబైల్ ఫోన్ వినియోగదారులలో 65% కంటే ఎక్కువ మంది ఫీచర్ ఫోన్‌లు వాడుతున్నారు. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వారికి ప్రయోజనం కలిగిస్తంది. 


అలాగే ఎస్బీఐ బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 70 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెరుగుదలతో సవరించిన రేటు 13.45 శాతం అవుతుంది. ఇది సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ బేస్ రేటు కూాడా 8.7 శాతానికి పెంచింది. దీనివలన రుణగ్రహీతలకు EMI మొత్తం పెరుగుతుంది. బ్యాంక్ BPLR మరియు బేస్ రేటు రెండింటినీ త్రైమాసిక ప్రాతిపదికన సవరిస్తుంది. ఎస్‌బీఐ రుణ రేట్ల సవరణను రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులు అనుసరించే అవకాశం ఉంది.


ఆర్బీఐ రెపో రేటుతో పాటు పెంపు


గత నెలలోనే ఎస్బీఐ పలు టెన్యూర్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు సాధారణంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లు- ఎంసీఎల్ఆర్ రేట్లను పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తాయి. ఇందులో నిధుల సమీకరణ కోసం పెరుగుతున్న ఖర్చులు, నిర్వహణ ఖర్చులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటాయి. 2016 నుంచి ఎంసీఎల్ఆర్‌ను అన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు అనుసరిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్లను ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ అనుసంధాన రేటును పునరుద్ధరించింది. అయినా.. ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న ఇంటి రుణాలు ఫ్లోటింగ్ రేటు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేట్- ఎంసీఎల్ఆర్ కి లేదా ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటుకి లేదా బేస్ రేటుకి లింకై ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆర్బీఐ రెపో రేటు పెంచిన ప్రతి సందర్భంలోనూ ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు పెరుగుతుంది.


ఎస్బీఐలో ఎంసీఎల్ఆర్ రేట్లు ఎలా ఉన్నాయి


ఎస్బీఐ బ్యాంకులో ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 7.35 శాతంగా ఉంది. ఇది ఒకటి, మూడు నెలల వరకు కూడా 7.35 శాతంగానే ఉంది. ఆరు నెలల వరకు అయితే 7.65 శాతంగా వసూలు చేస్తోంది. ఏడాదికి 7.7 శాతం, రెండేళ్లకు 7.9 శాతం, మూడేళ్లకు 8 శాతం ఎంసీఎల్ఆర్ రేటును ఎస్బీఐ వసూలు చేస్తోంది.