7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! మోదీ సర్కార్ అతి త్వరలోనే వీరికి దీపావళి గిఫ్ట్ అందించనుంది. ఏడో వేతన కమిషన్ ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ (DA), పింఛన్‌దారులకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) ప్రకటించనుందని తెలిసింది. ఇప్పటికైతే అధికారికంగా చెప్పలేదు గానీ సెప్టెంబర్ చివరి వారంలో ప్రకటిస్తారని సమాచారం.
ప్రస్తుతం ఉద్యోగులకు 34 శాతం డీఏ అమలు చేస్తున్నారు. సెప్టెంబర్లో మరో 4 శాతం పెంచి మొత్తం 38 శాతానికి చేరుస్తారని అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. అందులో చర్చించాక డీఏ రేటును ప్రకటిస్తారు.
DA ఎందుకిస్తారంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం డీఏను చెల్లిస్తుంది. ఇది ఉద్యోగులు, పింఛన్‌దారులకు వర్తిస్తుంది. ఏడో వేతన కమిషన్ (7th Pay Commission) ప్రకారం డీఏను ఏటా రెండుసార్లు పెంచుతారు. జనవరి, జులైలో వీటిని అమలు చేస్తారు. ఉద్యోగి పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టీ డీఏ పెరుగుదలలో తేడాలు ఉంటాయి. రూరల్, సెమీ అర్బన్‌తో పోలిస్తే అర్బన్ ఉద్యోగులకు ఎక్కువ డీఏ వస్తుంది.
డీఏ ఎలా లెక్కిస్తారంటే?
బేసిక్ సాలరీని బట్టి డియర్‌నెస్ అలవెన్స్‌ను గణిస్తారు. ఇందుకోసం అఖిల భారత వినియోగ ధరల సూచీ (AICPI)ని ప్రామాణికంగా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే (చివరి 12 నెలల ఏఐసీపీఐ (బేస్ ఇయర్ 2001-100) సగటు - 115.76)/115.76)*100 ప్రకారం ఇస్తారు. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు (చివరి మూడు నెలల ఏఐసీపీఐ (బేస్ ఇయర్ 2016=100) సగటు - 126.33)/126.33)*100 ప్రకారం లెక్కిస్తారు.
ఎంత జీతం పెరుగుతుంది?
ఇప్పుడు బేసిక్ సాలరీలో డీఏ 34 శాతంగా ఉంది. 4 శాతం పెంచితే 38 శాతానికి చేరుతుంది. ఒక వ్యక్తికి రూ.35,000 బేసిక్ సాలరీ అయితే రూ.11,900 డీఏ ఉంటుంది. సవరించే నాలుగు శాతం కలిపితే డీఏ రూ.13,300కు పెరుగుతుంది. అంటే నెలకు రూ.1400 వరకు అదనంగా వస్తుందని అంచనా. ఈ పెరిగిన డీఏతో ద్రవ్యోల్బణం ప్రభావం ఉద్యోగులపై తగ్గుతుందన్నమాట.