No Festive Offers: ఈ దసరా, దీపావళికి పెద్దగా ఆఫర్లు వచ్చేలా కనిపించడం లేదు! ప్రజలు నిత్యావసర సరుకులకు ఎక్కువే ఖర్చు పెట్టాల్సి రావొచ్చని సమాచారం. ముడి వనరులు, క్రూడ్, పామాయిల్, కమోడిటీ ధరలు తగ్గినా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయడానికి ఎఫ్ఎంసీజీ కంపెనీలు మొగ్గు చూపడం లేదు. ఇప్పుడున్న సరకు మొత్తం అయిపోతే గానీ ధరల తగ్గింపు, ఆఫర్లపై దృష్టి పెట్టబోమని అంటున్నాయి. అయితే కొంత రాయితీతో పాటు ప్యాకెట్ సైజు, సరకుల పరిమాణం పెంచుతాయని తెలుస్తోంది.
కరోనా మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల కొన్ని నెలలుగా కమోడిటీ ధరలు ఆకాశాన్ని అంటాయి. పామ్‌ఆయిల్, క్రూడాయిల్ ధరలు మోయలేనంత భారంగా మారాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. కొంత కాలంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పామ్‌ఆయిల్ ధర భారీగా పతనమైంది. ఆ మేరకు తగ్గింపు కంపెనీలు ఇవ్వడం లేదు. కొంత రాయితీ కల్పించి వేచిచూసే ధోరణితో ఉన్నాయి.
'ఇన్‌పుట్ ధరలు గతేడాది కన్నా ఎక్కువగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఇంకా పర్యవేక్షణ స్థాయిలోనే ఉంది' అని ఐటీసీ ఫుడ్స్ ప్రతినిధి హేమంత్ మల్లిక్ అంటున్నారు. 'ఒకవేళ ముడి సరకుల ధరలు చల్లబడితే వినియోగదారులకు ఆఫర్లు ఇస్తుండొచ్చు. కానీ మేమైతే అలా జరుగుతుందని అంచనా వేయడం లేదు' అని ఆయన పేర్కొన్నారు.
పెద్ద కంపెనీలు తగ్గిస్తేనే చిన్న సంస్థలు ధరలు తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది. మార్కెట్లో కీ ప్లేయర్ హిందుస్థాన్ యునీలివర్ ఇప్పటి వరకు ధరలను తగ్గించలేదు. పండుగల సీజన్ కావడంతో సబ్బులు, డిటర్జెంట్ల పరిమాణం పెంచొచ్చని ఇన్‌సైడర్ల సమాచారం. రష్యా యుద్ధం వల్ల పామ్, క్రూడాయిల్‌లో 25-50 శాతం వరకు దిద్దుబాటు కనిపించింది. గత రెండు నెలలుగా వీటి ధరలు తగ్గాయి. పప్పు ధాన్యాల మీదా అంతే. టోకు ధరల స్థాయిలో ధరలు తగ్గినప్పటికీ రిటైల్ కస్టమర్‌కు మాత్రం ఆ లబ్ధి బదిలీ అవ్వడం లేదు.
గత నెల్లో వంట నూనెల ధరలు లీటర్‌కు రూ.10-15 వరకు తగ్గాయి. ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవడంతో చివరి 4 నెలల్లో రూ.15-25 వరకు తగ్గాయి. బియ్యం, గోధుమల ధరలైతే తగ్గించలేదు. ఒకవేళ మార్కెట్లో మరింత స్థిరత్వం వస్తే బియ్యం, గోధుమలు, పిండి, మైదాపై తగ్గింపు ఉండొచ్చని అదానీ విల్మార్ సీఈవో అంగ్షు మల్లిక్ అంటున్నారు. రిటైలర్లు మొదట పాత ఎమ్మార్పీ సరుకు అమ్మేందుకు మొగ్గు చూపడం వల్ల వినియోగదారులకు లబ్ధి చేరడం లేదని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోషియేషన్ డైరెక్టర్ బీవీ మెహతా అన్నారు. పెరిగిన ధరలకు కొనుగోలు చేసిన ముడి సరుకులు అమ్ముడైతే కానీ తగ్గింపు రేట్లకు ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్టులు అమ్మబోరని సమాచారం.