RBI hikes repo rate Loan EMIs set to go up for borrowers: ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచగానే అంతా కంగారు పడిపోయారు! స్టాక్‌ మార్కెట్లోనైతే అమ్మకాల వెల్లువ కొనసాగింది. ఒక్క గంటలోనే బెంచ్‌ మార్క్‌ సూచీలు కుప్పకూలాయి. వాస్తవంగా పెరుగుతున్న ధరాభారం నుంచి ఎకానమీని రక్షించాలంటే రెపో రేటును పెంచడమే ఆర్బీఐ ముందున్న కర్తవ్యం! 30 ఏళ్ల గరిష్ఠానికి ఇన్‌ప్లేషన్‌ పెరగడంతో అమెరికా ఫెడ్‌ సైతం ఇదే దారిలో నడిచింది. ధరల భారం కన్నా గ్రోత్‌కే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చింది.


ఎవరికి మేలు?


రెపో రేటును పెంచడం వల్ల ఎఫ్‌డీ ఇన్వెస్టర్లకు లాభమే కలుగుతోంది. స్వల్ప కాలం నుంచి మొదలై మధ్య, దీర్ఘ కాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు వడ్డీ ప్రయోజనం లభించనుంది. ఇక కొందరికి మాత్రమే రెపో రేట్ల ప్రభావం ప్రతికూలంగా ఉంది. బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని నెలవారీ వాయిదాలు (EMI) చెల్లిస్తున్న వారికే ఈ భారం పడనుంది. అందులోనూ అందరిపైనా ఈ ఒత్తిడి లేదు. కేవలం ఫ్లోటింగ్‌ ఇంట్రెస్ట్‌ రేటుకు (Floating Interest Rates) ఇంటి రుణాలు (Home loan) తీసుకున్న వారిపైనే ఈఎంఐ భారం పెరగనుంది. మిగతా రుణాలకు వడ్డీ రేట్ల పెంపు భారం లేదు.


కార్‌, పర్సనల్‌ లోనైతే నో టెన్షన్‌!


బ్యాంకుల నుంచి ఫిక్స్‌డ్‌ ఇంట్రెస్టు రేటుకు రుణాలు తీసుకున్న కస్టమర్లకు రెపోరేటు పెంపు భారం పడటం లేదు. అంటే ఇప్పటికే పర్సనల్‌, వెహికిల్‌ రుణాలు తీసుకున్న వారికి ఈ పెంపుతో సంబంధం లేదు. ఎంత వడ్డీకి రుణం తీసుకున్నారో అది తీరేంత వరకు అదే వడ్డీరేటును చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు 8 శాతానికి రూ.300,000 వ్యక్తిగత రుణం తీసుకున్నారని అనుకుందాం. ఇప్పుడు మీరు ఎంత ఈఎంఐ చెల్లిస్తున్నారో ఇక మీదటే అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొత్తగా తీసుకొనే వారికి కొత్త వడ్డీరేట్లు అమలు అవుతాయి.


హోమ్‌ లోన్‌ ఈఎంఐ ఎంత పెరుగుతుంది?


రెపో రేట్ల పెంపు భారం పడేది మాత్రం ఇంటి రుణాలు తీసుకున్న కస్టమర్లకే! ఎందుకంటే వీరిలో ఎక్కువ మంది ఫ్లోటింగ్‌ ఇంట్రెస్ట్ రేటుకే రుణాలు తీసుకున్నారు. 2019, అక్టోబర్ తర్వాత ఫ్లోటింగ్‌ వడ్డీ రేటుకు తీసుకున్న రుణాలు ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌కు అనుసంధానం అయ్యాయి. అంటే ఆర్బీఐ రెపో రేటు పెంచితే వడ్డీ భారం పెరుగుతుంది. రెపో రేటు తగ్గితే వడ్డీ భారం, కట్టాల్సిన ఈఎంఐ తగ్గుతుంది. ఉదాహరణకు ఒక బ్యాంకులో మీరు రూ.30,00,000 ఇంటి రుణం తీసుకున్నారు. 20 సంవత్సరాల కాలపరిమితికి 6.8 శాతం వడ్డీరేటుతో తీసుకున్నారు. దీని ప్రకారం మీరు ప్రతి నెల రూ.22,900 ఈఎంఐ కడుతుంటారు. కొత్తగా వడ్డీరేటు 40 బేసిస్‌ పాయింట్లు పెరగడంతో 6.8 శాతంగా ఉన్న వడ్డీరేటు 7.2కు పెరుగుతుంది. అంటే కొత్త ఈఎంఐ రూ.23,620 కట్టాల్సి వస్తుంది. రూ.720 భారం పడుతుంది.


ఎక్కువ వడ్డీ కడుతుంటే?


గతంలోనూ ఇలా రెపో రేట్లు పెంచినప్పుడు బ్యాంకులు ఇంటి రుణాల ఈఎంఐలను పెంచేవి కావు. బదులుగా కాల పరిమితిని పెంచేవి. దీనివల్ల ప్రస్తుతం వడ్డీ పెరగనట్టు అనిపించినా కట్టాల్సిన కాల పరిమితి పెరుగుతుంది. దీంతో కస్టమర్లకే నష్టం. ఒకవేళ మీరు ఇప్పుడున్న ఫ్లోటింగ్‌ వడ్డీరేటు కన్నా ఎక్కువ వడ్డీరేటు కడుతుంటే దానిని ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌ మార్క్‌ రేటు (EBR)కు మార్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.