Many domestic mutual funds likely to put in Rs 150- Rs 1000 crore each in LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడతాయని తెలుస్తోంది. ఎస్‌బీఐ, ఆదిత్యా బిర్లా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ వంటి మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు కనీసం రూ.150 నుంచి రూ.1000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక 70 లక్షల వరకు రిటైల్‌ అప్లికేషన్లు వస్తాయని అంటున్నారు. గతేడాది భారత ఈక్విటీ మార్కెట్లలో నమోదైన ఇష్యూలతో పోలిస్తే సగటున ఐదు రెట్లు ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందట.


సింగపూర్‌ జీఐసీ, నార్జెస్‌ బ్యాంక్‌, నార్వే సెంట్రల్‌ బ్యాంక్‌, బీఎన్‌పీ పారిబస్‌ సైతం ఎల్‌ఐసీ షేర్ల కొనుగోలులో పాల్గొనేందుకు అంగీకరించాయని తెలిసింది. 'ఆ ఇన్వెస్టర్లంతా యాంకర్‌, మెయిన్‌ బుక్స్‌లోకి వస్తారు' అని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి. బుధవారం ఎల్‌ఐసీ ఇష్యూ మొదలవ్వగానే రిటైల్‌ అప్లికేషన్లు భారీగా వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే ప్రైస్‌ బ్యాండును బట్టి రూ.8,603-9068 కోట్ల వరకు బిడ్లు రానున్నాయని తెలుస్తోంది. సంపన్నులు, రిటైల్‌ బిడ్లు కలిపి కేటాయించిన దానికన్నా రెట్టింపు దరఖాస్తులు వస్తాయని అనుకుంటున్నారు.


'ఇష్యూలో సగం సబ్‌స్క్రిప్షన్లు మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ వంటి రాష్ట్రలున్న పశ్చిమ భారత దేశం నుంచే వస్తాయని అంచనా' అని ఎగ్జిక్యూటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు అంటున్నారు. ఐసీఐసీఐ సెక్యూరిటీ, జేఎం ఫైనాన్షియల్‌, కొటక్‌ వంటి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు దేశవ్యాప్తంగా ముంబయి, దిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. ఇక ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, సిటీ గ్రూప్‌, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలూ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు పనిచేశాయి.


గతేడాది 51 కంపెనీలు ఐపీవోల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.11 లక్షల కోట్లు సమీకరించాయి. ప్రైమ్‌ డేటాబేస్‌ ప్రకారం యావరేజ్‌ రిటైల్‌ సబ్‌స్క్రిప్షన్లు రూ.14.07 లక్షలుగా ఉన్నాయి. రిటైల్‌ అప్లికేషన్లు FY20లో 6.88 లక్షలు, FY21లో 12.73 లక్షలుగా ఉన్నాయి.


LICలో 3.5 శాతం వాటా విక్రయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.21,000 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. మే 4న మొదలయ్యే ఇష్యూ 9న ముగుస్తుంది. భారత్‌ స్టాక్‌మార్కెట్లలో అతిపెద్ద ఇష్యూ ఇదే కావడం గమనార్హం. ఐపీవోకు దరఖాస్తు చేసేవారు కొన్ని కీలక వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.


సబ్‌స్క్రిప్షన్‌ తేదీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ 2022, మే4, బుధవారం మొదలవుతుంది. మే 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రైస్‌ బ్యాండ్‌ : ఎల్‌ఐసీ షేర్ల ధర రూ.902 - 949గా నిర్ణయించారు. ఒక్కో షేరు ఫేస్‌ వాల్యూ రూ.10గా ఉండనుంది. పాలసీ హోల్డర్లకు  రూ.60, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు.