RBI hikes repo rate FD investors to benefit from rate hike : పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి (Inflation) అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) కఠిన చర్యలు తీసుకుంది! కీలక వడ్డీరేట్లను సవరించింది. అత్యవసర భేటీలో రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రేట్ల పెంపు వల్ల కొందరికి భారం పెరగ్గా కొందరికి మేలు జరగనుంది.


ప్రస్తుతం 4 శాతంగా ఉన్న పాలసీ రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో ఈ క్షణం నుంచే రెపో రేటు 4.40 శాతానికి పెరిగింది. స్టాండింగ్‌ డిపాజిట్‌ ఫెసిలిటీ (SDF) రేటు 4.15 శాతం, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిటిలీ రేట్‌ (MSDF), బ్యాంకు రేటు 4.56 శాతంగా ఉన్నాయి. క్యాష్ రిజర్వు రేషియో (CRR)ను ఆర్బీఐ 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.5 శాతానికి చేర్చింది. 2018, ఆగస్టు 1 తర్వాత వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి.


వృద్ధికి ఊతమిస్తూ, ద్రవ్యోల్బణాన్ని టార్గెట్‌ రేంజులోనే ఉంచాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ శక్తికాంత దాస్‌ (Shaktikanta das) తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ 40 ఏళ్ల గరిష్ఠమైన 8.5 శాతానికి చేరుకుంది. దాంతో యూఎస్‌ ఫెడ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లను పెంచింది. భారత్‌లోనూ సీపీఐ ప్రకారం ఇన్‌ఫ్లేషన్‌ 6.95 శాతానికి పెరగడంతో వడ్డీరేట్లను సవరించారు. దీని వల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ దారులకు కొంత మేలు జరగనుంది.


ఏ FD చేస్తే ఎంత లాభం?


ఆర్బీఐ రెపో రేటు పెంచడం వల్ల మొదట స్వల్ప కాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (Short Term FD) వడ్డీరేట్లు పెరుగుతాయి. ఆర్బీఐ ఎప్పుడు రెపో రేటు పెంచినా మొదట స్వల్ప, మధ్య కాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీరేట్లు పెరుగుతాయి. ఆ తర్వాత దీర్ఘ కాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు (Long Term FD) పెరుగుతాయి. ఇప్పట్లో ఎవరైనా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకుంటే ఒక ప్లాన్‌ ప్రకారం చేయడం మంచిది. మొదట స్వల్ప కాలానికి అంటే ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. అప్పుడు పెరిగిన వడ్డీరేట్లు వర్తిస్తాయి. వడ్డీరేట్ల సైకిల్‌ కొంత ఆలస్యంగా లాంగ్‌టర్మ్‌ ఎఫ్‌డీలకు వర్తిస్తాయి కాబట్టి ఓ ఏడాది ఆగి వాటి వైపు వెళ్తే వడ్డీ ప్రయోజనం దక్కుతుంది.