PPF Interest Rate: నష్టభయం లేని రాబడి కోసం ఇన్వెస్టర్లు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF)లో పెట్టుబడి పెడుతుంటారు. సురక్షితమే కాకుండా రాబడిపై పన్నులేమీ ఉండవు కాబట్టి ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. పదేళ్లుగా పీపీఎఫ్‌ వడ్డీరేట్లు క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. డిపాజిట్‌ పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు పెరగడం ఊరట కలిగించే విషయమే అయినా 2013 నుంచి 2022 మధ్యన పీపీఎఫ్‌ వడ్డీరేటు మొత్తంగా 1.7 శాతం తగ్గి 8.88% నుంచి 7.1 శాతానికి చేరుకుంది.


కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు పీపీఎఫ్‌ వడ్డీరేట్లను సవరిస్తుంది. 2022-23 ఏడాదిలో వచ్చే త్రైమాసికం వడ్డీరేటును డిసెంబర్లో నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో 2013 నుంచి ఈ పదేళ్లలో పీపీఎఫ్‌ వడ్డీరేట్లు ఎలా మారాయో చూద్దాం!


2013లో పీపీఎఫ్‌ వడ్డీరేటు: 01.04.2012 నుంచి 31.03.2013 మధ్య పీపీఎఫ్‌ వడ్డీరేటు 8.8 శాతంగా ఉంది. పెట్టుబడి పరిమితి ఏడాదికి లక్ష రూపాయలుగా ఉండేది.


2014లో పీపీఎఫ్‌ వడ్డీరేటు: 01.04.2013 నుంచి 31.03.2014 మధ్య పీపీఎఫ్‌ వడ్డీరేటు 8.7 శాతంగా ఉంది.  పెట్టుబడి పరిమితి ఏడాదికి లక్ష రూపాయలే. 01.04.2014 నుంచి 31.03.2016 మధ్య వడ్డీ 8.7 శాతమే ఉన్నా పరిమితిని ఏడాదికి లక్షన్నరకు పెంచారు.


2015, 2016లో పీపీఎఫ్‌ వడ్డీరేటు: 01.04.2016 నుంచి 30.09.2016 వరకు పీపీఎఫ్‌ వడ్డీరేటును 8.1 శాతానికి సవరించారు. పెట్టుబడి పరిమితి యథావిధిగా ఏడాదికి రూ.లక్షన్నరగానే ఉంది.


2017లో పీపీఎఫ్‌ వడ్డీరేటు: 01.10.2016 నుంచి 31.03.2017 వరకు పీపీఎఫ్‌ వడ్డీరేటు 8 శాతానికి తగ్గింది. 01.04.2017  నుంచి 30.06.2017 మధ్యన 7.9 శాతానికి తగ్గించారు. 01.07.2017 నుంచి 30.09.2017 మధ్య 7.8 శాతానికి సవరించారు. పెట్టుబడి పరిమితి ఏడాదికి లక్షన్నరగానే ఉంది.


2018లో పీపీఎఫ్‌ వడ్డీరేటు: 01.01.2018 నుంచి 30.09.2018 వరకు పీపీఎఫ్‌ వడ్డీరేటు 7.6 శాతానికి తగ్గించేశారు. పెట్టుబడి పరిమితి ఏడాదికి రూ.1.50 లక్షలు.


2019లో పీపీఎఫ్‌ వడ్డీరేటు: 01.10.2018 నుంచి 30.06.2019 వరకు పీపీఎఫ్‌ వడ్డీరేటు మళ్లీ 8 శాతానికి పెంచారు. పెట్టుబడి పరిమితి ఏడాదికి రూ.1.50 లక్షలు.


2020లో పీపీఎఫ్‌ వడ్డీరేటు: 01.07.2019 నుంచి 31.03.2020 వరకు పీపీఎఫ్‌ వడ్డీరేటును మళ్లీ 7.9 శాతానికి తగ్గించేశారు. పెట్టుబడి పరిమితి ఏడాదికి రూ.లక్షన్నర.


2021, 2022లో పీపీఎఫ్‌ వడ్డీరేటు: ఈ రెండేళ్లలో పీపీఎఫ్‌ వడ్డీరేటులో చాలా కోత విధించారు. 01.04.2020 నుంచి పీపీఎఫ్‌ వడ్డీరేటు 7.1 శాతంగానే ఉంది. పెట్టుబడి పరిమితి ఏడాదికి రూ.లక్షన్నర.