SCSS Calculator: 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న (సీనియర్‌ సిటిజన్లు) వ్యక్తుల కోసం, పోస్టాఫీస్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Savings Scheme లేదా SCSS). సీనియర్‌ సిటిజన్ల వయస్సుకు గౌరవం ఇస్తూ, వారికి కొన్ని అదనపు మినహాయింపులు & ప్రయోజనాలను ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి, ఈ స్కీమ్‌లో జమ చేసే డబ్బు పూర్తిగా సురక్షితం.


ఒక సీనియర్‌ సిటిజన్‌ SCSSలో ఎంత జమ చేయవచ్చు, ఎంత ఆదాయం సంపాదించొచ్చు? ఆదాయ పన్ను ప్రయోజనాలేంటి?. 


సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి 10 కీలక విషయాలు:


వడ్డీ రేటు
2024 ఏప్రిల్-జూన్ కాలానికి ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు సంవత్సరానికి 8.2%. ఈ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం) సమీక్షిస్తుంది.


వడ్డీ ఆదాయం
ప్రస్తుత వడ్డీ రేటు 8.2% ప్రకారం, గరిష్టంగా 30 లక్షల రూపాయల పెట్టుబడి మీద త్రైమాసికానికి రూ. 61,500, ఏడాదికి రూ. 2,46,000, ఐదు సంవత్సరాలకు రూ.12,30,000 వడ్డీ లభిస్తుంది.


వడ్డీ చెల్లింపు
SCSS వడ్డీని త్రైమాసికానికి ఒకసారి చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలల చివరి వరకు ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీని లెక్కిస్తారు. ఈ మొత్తాన్ని ఏప్రిల్, జులై, అక్టోబర్, జనవరి 1వ తేదీన ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ ఖాతాదారు ఆ డబ్బును తీసుకోకపోతే, దానిపై అదనపు వడ్డీ ఇవ్వరు. అంటే, చక్రవడ్డీ ప్రయోజనం ఉండదు.


ఎవరు అర్హులు?
60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తయినా SCSS ఖాతాను తెరవడానికి అర్హుడు. అయితే, విశ్రాంత ఉద్యోగుల విషయంలో కొంత వెసులుబాటు ఉంది. 55-60 సంవత్సరాల మధ్య వయస్సు గల రిటైర్డ్ సివిల్ ఉద్యోగులు; 50-60 సంవత్సరాల మధ్య వయస్సు గల రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు ఈ ఖాతా ఓపెన్‌ చేయవచ్చు. వీళ్లు, పదవీ విరమణ ప్రయోజనాలు పొందిన ఒక నెలలోపు ఖాతా తెరవాలి. జీవిత భాగస్వామి కలిసి జాయింట్‌ అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేయవచ్చు.


కనిష్ట, గరిష్ట డిపాజిట్ పరిమితి
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కనీస డిపాజిట్ రూ. 1,000/-. వెయ్యి గుణకాల చొప్పున డిపాజిట్ చేయవచ్చు. ఒక ఖాతాలో ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలి. ప్రస్తుత నిబంధన ప్రకారం గరిష్ట పరిమితి రూ. 30 లక్షలు. అదనపు డిపాజిట్ చేసినా, వెంటనే డిపాజిటర్‌కు తిరిగి చెల్లిస్తారు.


పన్ను ప్రయోజనాలు
SCSSలో పెట్టుబడులకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో, అన్ని SCSS ఖాతాల్లో మొత్తం వడ్డీ రూ. 50 వేలు దాటితే, TDSతో పాటు వడ్డీపై పన్ను చెల్లించాలి. అయితే, ఫామ్ 15G/15H సమర్పిస్తే TDS కట్‌ కాదు, పెరిగిన వడ్డీ నిర్దేశిత పరిమితిని మించదు.


ఖాతా పొడిగింపు
మెచ్యూరిటీ తేదీ నుంచి మరో 3 సంవత్సరాల పాటు ఖాతాను పొడిగించవచ్చు. దీనిపై ప్రస్తుత రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. ఇలా, మూడు సంవత్సరాల చొప్పున ఎన్నిసార్లయినా పొడిగించవచ్చు.


మెచ్యూరిటీ &  ముగింపు
డిపాజిట్‌ తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత తర్వాత ఖాతా మూసివేయవచ్చు. ఖాతాదారు మరణించిన సందర్భంలో, కొన్ని నిబంధనల ప్రకారం ఖాతా కొనసాగించవచ్చు. లేకపోతే, నామినీ లేదా చట్టప్రకారం అర్హత కలిగిన వారసులకు ఖాతాలో డబ్బు అందజేస్తారు.


వెంటనే మూసేస్తే?
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ వద్దనుకుంటే, ఆ ఖాతాను ఏ సమయంలోనైనా క్లోజ్‌ చేయవచ్చు. ఒక సంవత్సరంలోపు మూసేస్తే వడ్డీ చెల్లించరు, అప్పటికే వడ్డీ చెల్లించివుంటే అసలు నుంచి కట్‌ చేస్తారు. ఒకటి నుండి రెండు సంవత్సరాల మధ్య 1.5% వడ్డీ, రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య 1% వడ్డీ తగ్గిస్తారు.


ఖాతా ఎలా తెరవాలి?
పాన్‌, ఆధార్, ఫోటో వంటి కేవైసీ ఫామ్స్‌తో ఖాతా ప్రారంభించొచ్చు. ఒక వ్యక్తికి ఎన్ని SCSS ఖాతాలైనా ఉండొచ్చు. కానీ, అన్ని ఖాతాల్లో మొత్తం డిపాజిట్ రూ. 30 లక్షలకు మించకూడదు.


మరో ఆసక్తికర కథనం: ఈ ఎఫ్‌డీలపై తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు, గ్యారెంటీగా!