Term Insurance: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది, ఈ ఆర్థిక సంవత్సరానికి మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి నెల ముగింపుతోనే 2023-24 పైనాన్షియల్‌ ఇయర్‌ కూడా ముగుస్తుంది. ఆ తర్వాత, ఏప్రిల్ 01 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభం అవుతుంది.


టాక్స్‌ పేయర్లకు ‍‌(Taxpayers) ఇది చాలా కీలక సమయం. ముఖ్యంగా, ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదార్లకు, పన్ను ఆదా చేయడానికి ఇదే చివరి అవకాశం. పన్ను భారం పడకుండా ఉండాలంటే, అందుబాటులో ఉన్న ఆప్షన్లలో మార్చి 31లోపు పెట్టుబడులు పెట్టాలి. పన్ను ఆదా చేయడంలో, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ‍‌(Section 80C) చాలా ఉపయోగపడుతుంది. ఈ సెక్షన్ కింద, పన్ను చెల్లింపుదార్లు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. సెక్షన్ 80C కిందకు వచ్చే పెట్టుబడుల్లో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఒకటి. చాలా మంది పన్ను చెల్లింపుదార్లు, సెక్షన్‌ 80C కింద మినహాయింపు కోసం టర్మ్ పాలసీ కొనుగోలు చేస్తున్నారు. 


అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఎక్కువ మంది పన్ను చెల్లింపుదార్లు తరచుగా చేస్తున్న 3 తప్పుల గురించి జీరోధ (Zerodha) వివరించింది.


కవరేజ్‌ లెక్కింపులో లోపం
జీరోధ ప్రకారం, ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ లెక్కించడంలో టాక్స్‌పేయర్లు మొదటి తప్పు చేస్తున్నారు. తమ వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు ఎక్కువ కవరేజ్‌ తీసుకోవాలన్న కొండగుర్తును గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇది వర్తించదు. ప్రతి వ్యక్తి లేదా కుటుంబానికి సొంత అవసరాలు & బాధ్యతలు ఉంటాయి. మిగిలిన వారి కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. ఈ కారణంగా.. టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు.. తన వయస్సు, తనపై ఆధారపడ్డ వ్యక్తులు, టెన్యూర్‌, ఖర్చులు, రుణం, అద్దె, పిల్లల విద్యా ఖర్చులు మొదలైనవాటిని కూడా పన్ను చెల్లింపుదారు పరిగణనలోకి తీసుకోవాలి.


ఇన్వెస్ట్‌మెంట్ కోసం తప్పుడు సమాచారం
డెత్ బెనిఫిట్స్‌తో పాటు పెట్టుబడిపై రాబడి ప్రయోజనాలను అందించే ఎండోమెంట్ పాలసీ (Endowment policy) లేదా యులిప్‌ను (ULIP) కొనుగోలు చేయమని సేల్స్‌మెన్ మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. పన్ను చెల్లింపుదార్లు అలాంటి ప్లాన్‌లను కొనుగోలు చేయకూడాదు. సాధారణ ప్లాన్‌లతో పోలిస్తే ఇవి చాలా ఖరీదైనవి. పెట్టుబడి పెరిగే కొద్దీ దానికి తగ్గట్లుగా రాబడి లేదా మరణ ప్రయోజనం అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి, ఒక సాధారణ ప్లాన్‌ను కొనుగోలు చేసి, మిగిలిన డబ్బును వేరే చోట పెట్టుబడి పెట్టడం మంచిది.


అనవసరంగా సుదీర్ఘ కాలం ఎంపిక
చనిపోయే వరకు బీమా పథకం కొనసాగాలని చాలామంది అనుకుంటున్నారు. ఇది కూడా సరికాదు. మీకు 60 లేదా 70 ఏళ్లు వచ్చేసరికే మీపై ఆధారపడిన వాళ్లు ఆర్థికంగా స్థిరపడతారు. వాళ్లు తమను మాత్రమే కాకుండా, మిమ్మల్ని కూడా  జాగ్రత్తగా చూసుకోగలరు. దీనర్థం.. అవసరం లేకుండా సుదీర్ఘ కాలం కోసం ప్లాన్‌ తీసుకుని, అదనంగా ఖర్చు చేయడం సమంజసం కాదు.


మరో ఆసక్తికర కథనం: బ్యాంకుల్లో 5 రోజుల పని విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన