EPF Dues Default: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) భారతదేశ సామాజిక భద్రత వ్యవస్థకు మూలస్తంభం. పదవీ విరమణ తర్వాత, ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వానికి ఇది ఆధారం. "ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అండ్‌ మిసెలీనియస్‌ ప్రొవిజన్స్‌ యాక్ట్‌" (Employees' Provident Funds and Miscellaneous Provisions Act) 1952 ప్రకారం, ఉద్యోగులు & యజమాన్యం ఇద్దరూ తప్పనిసరిగా ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12 శాతానికి సమానమైన మొత్తాన్ని EPF ఖాతాకు జమ చేయాలి. ఎంప్లాయర్‌ చెల్లించే డబ్బులోనే కొంత భాగం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌ (EPS)లోకి చేరుతుంది. అయితే, కంపెనీ ఈ కాంట్రిబ్యూషన్స్‌ను డిఫాల్ట్ చేస్తే ఉద్యోగి ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది.


మీ యాజమాన్యం EPF చెల్లింపులు మిస్‌ చేస్తుంటే, ఆ సమస్యను పరిష్కరించడానికి మీరు పాటించాల్సిన స్టెప్స్‌:


స్టెప్‌ 1: డిఫాల్ట్‌ను ధృవీకరించుకోండి


ఏదైనా చర్య తీసుకునే ముందు, కంపెనీ నుంచి కాంట్రిబ్యూషన్స్‌ మిస్ అయ్యాయో, లేదో నిర్ధారించుకోండి. దీనికోసం...


EPF పాస్‌బుక్: విరాళాల్లో ఏవైనా అవకతవకలు జరిగాయేమో గుర్తించడానికి EPFO ​​పోర్టల్ ద్వారా మీ EPF పాస్‌బుక్‌ని తనిఖీ చేయండి.


శాలరీ స్లిప్: మీ శాలరీ స్లిప్‌లోని EPF తగ్గింపులను మీ పాస్‌బుక్ రికార్డులతో సరిపోల్చండి.


EPFOతో ధృవీకరణ: వ్యత్యాసాలు కనిపిస్తే, మీ స్థానిక EPFO ​​కార్యాలయాన్ని సంప్రదించండి లేదా EPFO ​​పోర్టల్ ద్వారా ఆ విషయాన్ని నిర్ధారించండి.


స్టెప్‌ 2: మీ యాజమాన్యాన్ని సంప్రదించడం


మొదట, సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి మీ యాజమాన్యాన్ని కలవండి.


వివరణ కోరండి: పరిపాలన లేదా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యం జరిగిందేమో తెలుసుకోవడానికి HR లేదా పేరోల్ డిపార్ట్‌మెంట్‌తో మాట్లాడండి.


రాతపూర్వక అభ్యర్థన: మౌఖిక సంభాషణ విఫలమైతే, ఏయే నెలల్లో డబ్బు జమ కాలేదో వివరిస్తూ & తగిన పరిష్కారాన్ని అభ్యర్థిస్తూ అధికారిక లేఖ లేదా ఇ-మెయిల్‌ పంపిండి.



స్టెప్‌ 3: EPFOకి వెళ్లండి


మీ అభ్యర్థనకు యాజమాన్యం ప్రతిస్పందించకపోతే, మీరు సీరియస్‌గా రియాక్ట్‌ కావచ్చు.


ఫిర్యాదుల పరిష్కార పోర్టల్: EPFO ​​ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి, మీ ఫిర్యాదు స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయండి.


EPFO ప్రాంతీయ కార్యాలయం: మీ శాలరీ స్లిప్పులు, పాస్‌బుక్ స్టేట్‌మెంట్‌ వంటి అవసరమైన ఆధారాలతో స్థానిక EPFO ​​కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్‌ ఇవ్వండి.


స్టెప్‌ 4: చట్టపరమైన చర్యలు


డిఫాల్ట్‌ను అలవాటుగా మార్చుకున్న కంపెనీని కోర్టు మెట్లు ఎక్కించండి.


లేబర్ కోర్టు: ఉద్యోగి పట్ల చట్టబద్ధమైన బాధ్యతలు పాటించనందుకు EPF చట్టం కింద కంపెనీపై కేసు నమోదు చేయండి.


వినియోగదారుల న్యాయస్థానం: EPF అనేది సామాజిక భద్రతలో ఒక కోణం కాబట్టి, మీరు వినియోగదారుల కోర్టు ద్వారా కూడా పరిహారం పొందొచ్చు.


యాజమాన్యానికి జరిమానా: ఎగవేతదారులు జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా అనుభవించాల్సి వస్తుంది. ఈ పెనాల్టీ మొత్తం బకాయిల్లో 37% వరకు ఉంటుంది.


స్టెప్‌ 5: EPF సెటిల్‌మెంట్‌


బకాయిలను తిరిగి పొందేందుకు ఉద్యోగులకు ఉన్న మార్గాలు:


ఆలస్యాలపై వడ్డీ: చెల్లింపుల్లో ఆలస్యం జరిగినప్పటికీ EPF బ్యాలెన్స్‌పై వడ్డీ వచ్చేలా EPFO చూసుకుంటుంది.


విత్‌డ్రా ప్రక్రియ: మీరు మీ ఈపీఎఫ్‌ ఖాతా నుంచి కొంత డబ్బు తీసుకోవాలనుకుంటే, దీనిని ప్రాసెస్‌ చేయడానికి ముందు బకాయిలను తప్పనిసరిగా క్లియర్ చేయాలి.


ఖాతా బదిలీ: ఉద్యోగం మారుతున్నట్లయితే, మీ కొత్త EPF ఖాతా బకాయిలను కూడా బదిలీ చేయండి.


ముందు జాగ్రత్త చర్యలు


నిరంతర పర్యవేక్షణ: కంపెనీ సహకారాలను ట్రాక్ చేయడానికి EPFO ​​పోర్టల్ లేదా యాప్‌ని తరచూ ఉపయోగించండి.


రిక్వెస్ట్ స్టేట్‌మెంట్‌: ఉద్యోగం నుంచి నిష్క్రమించేటప్పుడు కంపెనీ నుంచి EPF కంట్రిబ్యూషన్ స్టేట్‌మెంట్‌లు పొందండి.


మీ హక్కులు తెలుసుకోండి: ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి EPF నియమాలను తెలుసుకోండి.


క్రమబద్ధమైన పర్యవేక్షణ, సత్వర చర్య, మీ హక్కులను అర్థం చేసుకోవడం ద్వారా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుకు భద్రత కల్పించవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ