Benifits Of A Gold Loan: మన రోజువారీ జీవన ప్రయాణంలో ఆకస్మిక అనారోగ్యం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురుకావచ్చు. అలాంటి సందర్భాల్లో, అప్పటి వరకు సేవ్ చేసిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు అవసరం కావచ్చు. ప్రాణాలను రక్షించే వైద్యం కోసం నిధులను ఏర్పాటు చేయడం సవాలుగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో, అవసమైన డబ్బును అతి వేగంగా గోల్డ్ లోన్ సమకూరుస్తుంది, ప్రాణాలను నిలబెడుతుంది.
అకస్మాత్తుగా ఎదురయ్యే వైద్య పరిస్థితి మాత్రమే కాదు.. వ్యాపార విస్తరణ అవకాశాన్ని అందుకోవడం లేదా ఉన్నత చదువుల ఖర్చులు వంటివాటి వల్ల కూడా కొన్నిసార్లు ఊహించని ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. ఇంట్లో ఉన్న బంగారం వంటి అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని అనూహ్య పరిస్థితుల నుంచి గట్టెక్కడం వివేకుల లక్షణం. బంగారంలో పెట్టుబడి కోసం ఆదాయంలో కొంత భాగాన్ని పక్కన పెట్టడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అత్యవసర సమయాల్లోనే బాగా అర్ధమవుతుంది.
గోల్డ్ లోన్ ప్రయోజనాలు:
గిజిబిజి లేని ప్రక్రియ: గోల్డ్ లోన్ తీసుకునే ప్రక్రియ పూర్తిగా సరళంగా ఉంటుంది. అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం అవుతుంది. ఇతర లోన్‌ల మాదిరిగా ఆదాయ రుజువు, ఇతర పత్రాలు అవసరం లేదు.
తక్షణం డబ్బు: బంగారు రుణం తక్షణమే విడుదల అవుతుంది. వాల్యుయేషన్ పని పూర్తయిన తర్వాత వెంటనే లోన్ శాంక్షన్ జరుగుతుంది.
క్రెడిట్ స్కోరు అవసరం లేదు: రుణగ్రహీత బంగారాన్ని తాకట్టు పెడతాడు కాబట్టి ఇది సెక్యూర్డ్ లోన్. వాస్తవానికి, తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు బంగారు రుణం ఉత్తమ ఎంపిక.
తక్కువ ఛార్జీలు: గోల్డ్ లోన్‌కు ప్రి-పేమెంట్ ఛార్జీలు ఉండవు. తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. కాబట్టి, ఇతర లోన్‌ల కంటే ఎప్పుడూ ఇవి చౌకగా ఉంటాయి.
పెద్ద మొత్తంలో లోన్: ఇతర బ్యాంక్ రుణాల్లో, లోన్ మొత్తంపై డాక్యుమెంటేషన్ & లోన్ ప్రాసెసింగ్ వంటివి ప్రభావితం చేస్తాయి. దీనికి అలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా వ్యాపార పెట్టుబడి లేదా వైద్య అత్యవసర పరిస్థితి కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఏర్పాటు చేసేందుకు గోల్డ్ లోన్ వేగంగా పని చేస్తుంది. రుణదాతలు బంగారం మార్కెట్ విలువ ఆధారంగా గరిష్ట మొత్తాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
రీపేమెంట్‌కు అనుకూలం: బంగారంపై రుణం తిరిగి చెల్లించడం కూడా రుణగ్రహీతకు సౌలభ్యంగా ఉంటుంది. ప్రతి రుణగ్రహీత అవసరాలకు సరిపోయేలా రుణదాతల దగ్గర రకరకాల స్కీమ్‌లు ఉన్నాయి.
సురక్షితం: రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత, తాకట్టు పెట్టిన బంగారం సురక్షితంగా తిరిగి వస్తుంది. అప్పటి వరకు మీ బంగారం బ్యాంక్ లాకర్‌లో భద్రంగా ఉంటుంది.
పర్పస్‌తో పని లేదు: రుణగ్రహీత గోల్డ్ లోన్‌ను ఎందుకు తీసుకుంటున్నాడనే విషయంపై ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేవు. రుణగ్రహీత ఆ డబ్బును వ్యాపారం కోసం లేదా ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు.
నేటి డిజిటల్ ప్రపంచంలో బంగారు రుణం మరింత సౌకర్యవంతంగా మారింది. ఇప్పుడు రుణగ్రహీతలు దరఖాస్తు, రుణం మంజూరు, వడ్డీ చెల్లింపు, లోన్ పూర్తిగా చెల్లింపు వంటివాటి కోసం బ్యాంక్ బ్రాంచికి వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు మీ ఇంటి దగ్గరకే వచ్చి గోల్డ్ లోన్ సేవను అందిస్తున్నాయి. కాబట్టి ఊహించని ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు అధైర్య పడొద్దు, బాధ పడొద్దు. అవసరమైన సమయాల్లో డబ్బును సమకూర్చడంలో బంగారు రుణం అత్యంత అనుకూలమైన & వేగవంతమైన మార్గం. అయితే, లోన్ అగ్రిమెంట్ మీద సంతకం చేసే ముందు అన్ని నిబంధనలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌లో మళ్లీ 'గోల్డ్ రష్, సిల్వర్ షైనింగ్' - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ