Personal Loan Interest Rates Hike: దాదాపు ఏడాదిన్నర కాలంగా రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేట్‌లో (RBI Repo Rate) ఎలాంటి మార్పు చేయలేదు. అయినప్పటికీ, బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి, లోన్ తీసుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. దేశంలో, ఇప్పటికే అన్ని రకాల బ్యాంక్ లోన్లపై గరిష్ట వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. ఇటీవల, కొన్ని బ్యాంకులు కొన్ని రకాల రుణాలపై, ముఖ్యంగా పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్లను పోటీ పడి పెంచాయి.
వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్‌లు
దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) మొదలుకొని ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), కోటక్ మహీంద్రా (Kotak Mahindra Bank) బ్యాంక్ వంటి కీలక సంస్థలు వ్యక్తిగత రుణ ఖర్చులను ఖరీదుగా మార్చాయి. ఈ ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఇటీవల, పర్సనల్ లోన్ రేట్లను 30 బేసిస్ పాయింట్ల (bps) నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచాయి. అంటే, నాలుగు అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుల వ్యక్తిగత రుణాలు ఇప్పుడు 0.30 శాతం నుంచి 0.50 శాతం వరకు పెరిగాయి.
ప్రారంభ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయ్..
దేశంలో అతి పెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను 0.40 శాతం పెంచింది. ఇప్పుడు, ఈ బ్యాంకులో వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు 10.75 శాతం నుంచి ప్రారంభమవుతుంది. యాక్సిస్ బ్యాంక్, తాను జారీ చేసే వ్యక్తిగత రుణాలపై ప్రారంభ వడ్డీ రేటును 10.49 శాతం నుంచి 10.99 శాతానికి పెంచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రారంభ వడ్డీ రేటు 10.50 శాతం నుంచి 10.80 శాతానికి చేరింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ పర్సనల్ లోన్‌పై కనిష్ట వడ్డీ రేటు 10.50 శాతం నుంచి 10.99 శాతానికి పెరిగింది.
రెపో రేట్ స్థిరంగా ఉన్నా ఎందుకీ పెరుగుదల?
రిజర్వ్ బ్యాంక్, ఒకటిన్నర సంవత్సరాలుగా రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు, మరికొన్ని నెలల్లో దేశంలో వడ్డీ రేట్లు తగ్గడం ప్రారంభం అవుతుందన్నన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గాల్సింది పోయి ఎలా పెరుగుతున్నాయి అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీనికి సమాధానం కూడా కేంద్ర బ్యాంక్ దగ్గరే ఉంది. రిజర్వ్ బ్యాంక్ చేసిన నియంత్రణ పరమైన మార్పుల కారణంగా వివిధ బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.
కారణం ఇదే..
రిజర్వ్ బ్యాంక్, దేశంలోని బ్యాంక్‌లు ఇచ్చే వ్యక్తిగత రుణాల విషయంలో రిస్క్ వెయిటేజీని పెంచింది. ఇంతకు ముందు పర్సనల్ లోన్ రిస్క్ వెయిటింగ్ రేటు 100 శాతంగా ఉండేది. 2023 నవంబర్ నుంచి కేంద్ర బ్యాంక్ దీనిని 125 శాతానికి పెంచింది. దీనివల్ల, బ్యాంక్‌లపై భారం పెరిగింది. బ్యాంకులు, ఈ భారాన్ని తాము భరించకుండా, లోన్ కోసం వచ్చే కస్టమర్లపైకి నెడుతున్నాయి. ఈ కారణంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ వ్యక్తిగత రుణాలు మరింత ఖరీదుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు, వడ్డీ రేట్లను పెంచే బ్యాంకుల జాబితా కూడా పెద్దది కావచ్చు.
మరో ఆసక్తికర కథనం: యూపీఐ ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారా? ఈ లిమిట్ దాటితే ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి