Employees Pension Scheme Update: EPFO సభ్యులకు అతి పెద్ద ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకువచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌కు ఆరు నెలల కంటే తక్కువ సమయం కాంట్రిబ్యూట్‌ చేసినప్పటికీ డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీనికోసం, "స్కీమ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్" 1995 (EPS 95) నిబంధనలను సవరించింది. ఈ సవరణ ఫలితంగా, ఆరు నెలల కంటే తక్కువ కాలం పాటు చందా కట్టిన సభ్యులు కూడా ఉపసంహరణ ప్రయోజనాన్ని (Withdrawal Benefit) పొందుతారు. ఇప్పటి వరకు, కనీసం ఆరు నెలల పాటు EPSకి కాంట్రిబ్యూట్ చేయాలనే నియమం ఉంది. ఈ కఠిన నియమాన్ని మార్చడం వల్ల సుమారు 7 లక్షల EPS మెంబర్లకు ప్రయోజనం కలుగుతుంది.


ఆరు నెలల కంటే తక్కువ సమయం చందా కట్టి EPS స్కీమ్‌ నుంచి ఎగ్జిట్‌ అయిన వాళ్లు, ఇప్పుడు, తాము కట్టిన డబ్బులను వెనక్కు తీసుకోవచ్చు.


EPFO సభ్యుడిగా ఉన్న ఉద్యోగి తన మూల వేతనంలో 12% మొత్తాన్ని EPFOలో జమ చేయాలి. ఆ కంపెనీ యాజమాన్యం కూడా అంతే మొత్తంలో డబ్బును జమ చేస్తుంది. ఉద్యోగి జమ చేసిన 12% మొత్తం ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాలోకి వెళ్తుంది. యజమాన్యం ఇచ్చే 12% కాంట్రిబ్యూషన్‌లో.. 8.33% ఉద్యోగుల పింఛను పథకం (EPS) ఖాతాలోకి, మిగిలిన 3.67% ఉద్యోగి EPF ఖాతాలోకి వెళ్తుంది.


పింఛను పొందేందుకు కనీసం 10 సంవత్సరాల పాటు EPSకు కాంట్రిబ్యూట్‌ చేయాలన్న రూల్‌ ఉన్నప్పటికీ, లక్షలాది మంది సభ్యులు ఈ పథకం నుంచి మధ్యలోనే బయటకు వచ్చేశారని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాంటి సభ్యులందరికీ, పథకం నిబంధనల ప్రకారం, డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షల విత్‌డ్రా బెనిఫిట్‌ క్లెయిమ్‌లను పరిష్కరించారు.


ఇప్పటి వరకు, సర్వీస్‌లో పూర్తి చేసిన సంవత్సరాలు & EPSకి కాంట్రిబ్యూట్‌ చేసిన మొత్తం ఆధారంగా విత్‌డ్రా బెనిఫిట్‌ను లెక్కించేవాళ్లు. 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు EPSకు సహకారం అందించిన సభ్యులు మాత్రమే ఈ బెనిఫిట్‌ పొందేవాళ్లు. ఆరు నెలల కంటే తక్కువ కాలం పాటు చందా కట్టి, ఆ తర్వాత స్కీమ్ నుంచి నిష్క్రమించిన సభ్యులు తమ డబ్బును వెనక్కు తీసుకోవడానికి వీలుండేది కాదు. చాలా మంది క్లెయిమ్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేవి, వాళ్లంతా తమ కష్టార్జితాన్ని వదిలేసుకునే వాళ్లు.


కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం... 2023-24లో 7 లక్షల విత్‌డ్రా క్లెయిమ్ అప్లికేషన్లు రిజెక్ట్‌ అయ్యాయి. కనీసం ఆరు నెలల కాంట్రిబ్యూషన్‌ లేని కారణంగా రిజెక్ట్‌ అయిన అప్లికేషన్లు కూడా ఉందులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో, 14 జూన్ 2024 నాటికి 58 ఏళ్లు నిండని EPS సభ్యులందరూ కూడా డబ్బు విత్‌డ్రా చేసుకునే ప్రయోజనానికి అర్హత పొందుతారు.


కేంద్ర ప్రభుత్వం టేబుల్ Dని కూడా సవరించింది. ఇప్పటి నుంచి, సర్వీస్‌లో పూర్తి చేసిన నెలలు, EPSకు అందించిన సహకారం ఆధారంగా ఉపసంహరణ ప్రయోజనాన్ని లెక్కిస్తారు. దీనివల్ల, ఉపసంహరణ ప్రయోజనాల్లో న్యాయం కనిపిస్తుంది. ఈ సవరణతో 23 లక్షల మందికి పైగా ఈపీఎస్ సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది, తగిన మొత్తంలో డబ్బును తిరిగి పొందే వీలు కల్పిస్తుంది. 


ఉదాహరణకు... ఒక సభ్యుడు రూ.15,000 నెల జీతంతో 2 సంవత్సరాల 5 నెలల పాటు పని చేసి EPSకి విరాళం ఇస్తే, గత నిబంధనల ప్రకారం అతను రూ.29,850 విత్‌డ్రా బెనిఫిట్‌ పొందుతాడు. కొత్త నిబంధన ప్రకారం, ఈ ప్రయోజనం రూ.36,000 అవుతుంది.


మరో ఆసక్తికర కథనం: రూ.1200 పెరిగిన 100 గ్రాముల గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి