Personal Finance Habits: ఆర్థిక భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే, వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం చాలా కీలకం. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. ఆ డబ్బును ఎలా కేటాయిస్తున్నారు, ఎలా ఆదా చేస్తున్నారు, ఎలా పెంచుకుంటున్నారన్నది కూడా ముఖ్యమే. కుటుంబానికి సంబంధించిన ప్రస్తుత అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు కూడా నెరవేరేలా ప్లాన్స్ ఉండాలి.
ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకోగల వ్యక్తులకు ఈ ఐదు తెలివైన అలవాట్లు ఉంటాయి. వీటిని కొత్తగా అలవాటు చేసుకున్న వ్యక్తులు కూడా ఆర్థిక జీవితంలో విజయం సాధిస్తారు.
తెలివైన ఆర్థిక అలవాట్లు (Wise Finance Habits)
1. 50/20/20/10 రూల్
50/20/20/10 రూల్‌ను ఫాలో కావడం మీ ఆర్థిక తెలివికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రూల్ ప్రకారం... మీ ఆదాయంలో 50 శాతాన్ని అద్దె, కిరాణా, యుటిలిటీస్, రవాణా వంటి ప్రాథమిక అవసరాల కోసం ఖర్చు చేయాలి. 20 శాతం వ్యక్తిగత సంరక్షణ, డైనింగ్, హాబీలు, వినోదం, వ్యక్తిగత అభివృద్ధి వంటి విచక్షణతో కూడిన ఖర్చులకు వెళుతుంది. పదవీ విరమణ, ఇల్లు కొనడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపు రూపంలో 20 శాతం కేటాయించాలి. మెడికల్ బిల్లులు, వాహనం మరమ్మతులు, ఉద్యోగ నష్టం వంటి అకస్మాత్ ఖర్చులకు మీరు సిద్ధంగా ఉండడం కోసం మిగిలిన 10 శాతం మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌లో జమ చేయాలి. ఈ రూల్ మీ ప్రస్తుత అవసరాలు తీర్చడంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులకూ అనుమతిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మీ పొదుపును తాకకుండా ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది.
2. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి
దీర్ఘకాలంలో సంపద పెంచుకోవడానికి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి (Invest in Stock Market) ఒక శక్తిమంతమైన మార్గం. గత 5 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్ సగటు రాబడి 11.33 శాతం (ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు 7.28 శాతం), గత 10 సంవత్సరాలలో ఇది 12.39 శాతం (ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు 9.48 శాతం), గత 20 సంవత్సరాల్లో ఇది 9.75 శాతం (ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు 7.03 శాతం), గత 30 ఏళ్లలో ఇది 9.90 శాతంగా (ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు 7.22 శాతం) ఉంది. రియల్ ఎస్టేట్ మీద ఆసక్తి ఉన్నవాళ్లు REITలలో పెట్టుబడి పెట్టవచ్చు.
3. నైపుణ్యాలు & వ్యక్తిగత అభివృద్ధి
మీ వ్యక్తిగత వృద్ధికి (Self-Development) వ్యయం చేయడాన్ని ఖర్చుగా చూడకూడదు, అది కీలకమైన పెట్టుబడి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ధృవపత్రాలు సంపాదించడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడం వంటివి మీ సంపాదన సామర్థ్యాన్ని పెంచుతాయి. ఉదాహరణకు, డిజిటల్ నైపుణ్యాలు అప్‌గ్రేడ్ చేయడం, కొత్త భాషను నేర్చుకోవడం వంటి వాటి వల్ల కొత్త కెరీర్ అవకాశాలు & ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దీంతోపాటు, మీ మానసిక & శారీరక ఆరోగ్యం కోసం వ్యయం చేయడం కూడా ఒక పెట్టుబడిగానే చూడాలి.
4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఫోకస్
ఆధునిక సాంకేతికత, ప్రజల ఆర్థిక నిర్వహణను గతంలో కంటే సులభంగా మార్చింది. AI-ఆధారిత టూల్స్ మీ ఖర్చులను ట్రాక్ చేయగలవు, పొదుపు సామర్థ్యాన్ని పెంచగలవు. మీ లక్ష్యాలు, రిస్క్ తీసుకోగల సామర్థ్యం ఆధారంగా తగిన పెట్టుబడి సలహాలు అందించగలవు.
5. ఆర్థిక ప్రణాళిక సమీక్ష
ప్రజల అలవాట్లు ఆర్థిక లక్ష్యాలు కాలానుగణంగా మారుతుంటాయి. కాబట్టి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీ బడ్జెట్, పొదుపులు, పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించడం తెలివైన అలవాటు.
ప్రపంచంలో ధనికులుగా ఫేమస్ అయిన వ్యక్తులందరికీ ఈ 5 అలవాట్లు ఉన్నాయన్నది మార్కెట్ నిపుణులు చెప్పే మాట.
మరో ఆసక్తికర కథనం: డబ్బులు సంపాదించే ట్రిక్ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్ ఎవరూ మీకు చెప్పి ఉండరు!