No More Penal Interest:


సర్దుబాటు అయితే ఎవరూ అప్పులు చేయరు! ఎటూ పాలుపోని పరిస్థితుల్లోనే చాలామంది బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారు. సాధారణంగా సమయానికే నెలసరి వాయిదాలు కట్టేస్తారు. వేతనం ఆలస్యంగా జమవ్వడం, ఆరోగ్యం సమస్యలు రావడం, ఇతర కష్టాలతో ఎప్పుడో ఓసారి గడువులోపు వాయిదా చెల్లించలేరు! అలాంటప్పుడు బ్యాంకులు వేసే వడ్డీకి మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది! ఒక్కసారికే ఇంత బాదేయాలా అంటూ కస్టమర్లు వాపోతుంటారు!


ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న వినియోగదారుల ఇబ్బందులు తొలగించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు నడుం బిగించింది. జరిమానా రూపంలో ఇకపై భారీ వడ్డీ వసూలు చేయకూడదని బ్యాంకులను ఆదేశించింది. అధిక వడ్డీరేటు బదులు కనీస రుసుము వసూలు చేయాలని సూచించింది. ఇప్పటికే ముసాయిదాను రూపొందించే పనిలో పడింది. ఫలితంగా కస్టమర్ల నమ్మకం పెరుగుతుందని, మెరుగైన రుసుము వసూళ్ల ప్రక్రియ మొదలవుతుందని విశ్లేషకులు అంటున్నారు.


'సరైన సమయంలో నెలసరి వాయిదాలు చెల్లించేందుకు, రుణ క్రమశిక్షణను పెంపొందించేందుకు జరిమానాగా అదనపు వడ్డీ వసూలు చేస్తారు. అయితే అలాంటి రుసుములు మరీ అతిగా ఉండటం న్యాయం కాదు. ఆ డబ్బును లాభదాయకతలో భాగంగా ఉపయోగించొద్దు' అని ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్ష సందర్భంగా తెలిపింది. 'ఇలాంటి సందర్భాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అతిగా వడ్డీ బాదేస్తున్నారని ఉన్నతస్థాయి సమీక్షల్లో తేలింది. ఫలితంగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి' అని పేర్కొంది. దండనార్హం వేసే వడ్డీ స్థానంలో రుసుము వసూలు చేయాలని ఆదేశించింది.


'ఇకపై అప్పులు తీసుకున్న వినియోగదారులు నెలసరి వాయిదాలు ఆలస్యంగా చెల్లించినా, రుణ ఒప్పందానికి, బ్యాంకు నిబంధనలను విరుద్ధంగా నడుచుకున్నా పెనల్‌ ఇంట్రెస్ట్‌ వసూలు చేయకూడదు. బదులుగా పారదర్శక విధానంలో రుసుములు వసూలు చేయాలి' అని ఆర్బీఐ వివరించింది.


Also Read: క్లెయిమ్‌ చేసినా బదిలీ అవ్వని NPS డబ్బును ఏం చేస్తున్నారో తెలుసా? పీఎఫ్‌ఆర్డీఏ కీలక అప్‌డేట్‌!


ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో రుణ గ్రహీతలకు మేలు జరుగుతుందని బ్యాంకింగ్‌, న్యాయ నిపుణులు అంటున్నారు. 'రుణాల చెల్లింపులు ఆలస్యమైనప్పుడు అమలు చేసే వడ్డీలపై నియంత్రణ తీసుకురావడం గొప్ప విషయం. అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకే తరహా రుసుములు వసూలు చేస్తే కస్టమర్లకు మేలు జరుగుతుంది' అని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్ ఛైర్మన్‌ ఏకే గోయెల్‌ అన్నారు.


బ్యాంకులు వేస్తున్న అధిక వడ్డీలను సవాల్‌ చేస్తూ వినియోగదారులు కోర్టుల్లో వేసిన చాలా కేసులు పెండిగులో ఉన్నాయని సుప్రీం కోర్టు న్యాయవాది తుషార్‌ అగర్వాల్‌ అంటున్నారు. శిక్షగా వసూలు చేస్తున్న వడ్డీ నిబంధనల్లో సంక్లిష్టత ఉండటాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్నారు.