NPS PRAN:


ఎన్‌పీఎస్‌కు (NPS) సంబంధించి పింఛన్ల నియంత్రణ, అభివృద్ధి సంస్థ (PFRDA) కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు క్లెయిమ్‌ చేసినప్పటికీ నెలరోజుల్లో బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అవ్వని నిధులను తిరిగి అదే ప్రాన్‌ (PRAN)తో పెట్టుబడి పెడతామని ప్రకటించింది.


విత్‌డ్రా చేసినా క్లెయిమ్‌ అవ్వని ఈ సొమ్మును ఎన్‌పీఎస్‌ చందాదారులు (NPS Subscribers) తిరిగి పొందేందుకు పీఎఫ్ఆర్‌డీఏ అనుమతి ఇచ్చింది. సంబంధిత పత్రాలను నింపి నోడల్‌ అధికారులు, పాయింట్‌ ఆఫ్‌ ప్రజెన్స్‌ (POP), ఏపీవై సర్వీస్‌ ప్రొవైడర్లు, సీఆర్‌ఏలు, ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ల్లో అవసరమైన వారికి సమర్పించాలని సూచించింది. బ్యాంకు ఖాతా లేదా బ్యాంకు ఖాతా సంఖ్య (Bank Account) సరిగ్గా లేకపోవడంతో బదిలీ అవ్వని డబ్బులను ఎన్‌పీఎస్టీ (NPST) వద్ద క్లెయిమ్‌ చేసుకోవాలని వెల్లడించింది.


బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల క్లెయిమ్‌ చేసిన సొమ్ము ఎన్‌పీఎస్‌ చందాదారుల ఖాతాల్లో జమవ్వని సందర్భాలను గుర్తించామని పీఎఫ్‌ఆర్డీఏ తెలిపింది. ఈ మేరకు 2023, జనవరి 7న ఉత్తర్వులు జారీ చేసింది. 'ఎన్‌పీఎస్‌ చందాదారులు ఫ్రీ లుక్‌ టైమ్‌లో ఆన్యూటీని రద్దు చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దాంతో ఆన్యూటీని కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన డబ్బు సరికొత్త ఏఎస్‌పీని ఎంచుకొనేంత వరకు తిరిగి ఎన్‌పీఎస్‌ వ్యవస్థలోకే వస్తోంది. ఇలాంటి నిధులను క్లెయిమ్‌ చేయని విత్‌డ్రా డబ్బుగా పరిగణిస్తున్నాం. ఇవి చందాదారులకు ఎలాంటి పెట్టుబడి రాబడి అందించవు' అని వెల్లడించింది.


క్లెయిమ్‌ చేయని విత్‌డ్రా డబ్బును ఎన్‌పీఎస్‌ చందాదారులు తిరిగి పొందేందుకు పీఎఫ్ఆర్డీఏ ఓ కొత్త ప్రక్రియను ప్రవేశపెడుతోంది. డిజిటల్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన 'మై విత్‌డ్రావల్‌ మాడ్యూల్‌'ను రూపొందిస్తోంది. ఇందులో లబ్ధిదారుడి వివరాలు ఎంటర్‌ చేస్తే ప్రాన్‌, బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుల వివరాలు తెలుస్తాయి. బ్యాంకు ఖాతా సాక్ష్యాలను అప్‌లోడ్‌ చేసే ఆప్షన్‌ వస్తుంది. చందాదారుడి కోరిక మేరకు కొత్త ఏఎస్‌పీని ఎంచుకొనే సౌకర్యం ఉంటుంది.


'క్లెయిమ్‌ చేయని విత్‌డ్రా డబ్బును పొందాలంటే ఎన్‌పీఎస్‌ చందాదారులు సరైన వివరాలు ఇవ్వాలి. ఎన్‌పీఎస్‌ ఖాతాతో అనుసంధానించిన బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఇవ్వాలి. అప్పుడే సరైన సమయానికి డబ్బులు పొందొచ్చు. అలాగే ముగింపు ప్రక్రియను చేపట్టే ముందు కస్టమర్‌ అకౌంట్‌ చైతన్యంగా ఉందో లేదో ఏపీవైలు గమనించాలి' అని పీఎఫ్ఆర్డీఏ తెలిపింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.