Financial Tips for 2024: కొత్త సంవత్సరం వస్తుంటే, మనలో చాలా మంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాకింగ్‌కు వెళతాం, రోజూ జిమ్ చేస్తాం, మందు & సిగరెట్లు మానేస్తాం అని ప్రతిజ్ఞలు చేస్తారు. వీటిని కచ్చితంగా పాటించినవాళ్లు ఆరోగ్యపరంగా లాభపడతారు.
కొత్త సంవత్సరంలో కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకుని స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే డబ్బు విషయంలోనూ సౌండ్ పార్టీగా నిలుస్తారు. 2024 కోసం తీసుకునే ఆర్థిక నిర్ణయాలతో మీ ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
2024 కోసం 14 ఫైనాన్షియల్ టిప్స్ (14 Financial Tips for 2024):
1. క్రెడిట్ రిపోర్ట్‌ను చెక్ చేయాలి: మీ ఇంటి బడ్జెట్‌ను క్రమం తప్పకుండా సమీక్షించినట్లే, మీ క్రెడిట్ రిపోర్ట్‌ను కూడా తరచూ చెక్ చేయాలి. ఇది ఒక తెలివైన ఆర్థిక అలవాటు. దీనివల్ల, మీ క్రెడిట్ రికార్డ్ గాడి తప్పకుండా ఉంటుంది. పేటీఎం, గూగుల్‌పే వంటివి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్‌ను అందిస్తున్నాయి.
2. కంపెనీ అందించే ఆర్థిక ప్రయోజనాలు మిస్ కావద్దు: కంపెనీ ద్వారా అందే బెనిఫిట్స్ ప్యాకేజీల ద్వారా మీ డబ్బు, పెట్టుబడులను సులభంగా పెంచుకోవచ్చు.
3. అనవసరమైన సబ్‌స్క్రిప్షన్లను తొలగించండి: అవసరం లేకున్నా చాలా సబ్‌స్క్రిప్షన్లను కొందరు కంటిన్యూ చేస్తుంటారు, లేదా సబ్‌స్క్రైబ్ చేసుకున్న విషయాన్ని కూడా మరిచిపోతుంటారు. ఆటో-డెబిట్ ద్వారా, ఆ ఫ్లాట్‌ఫామ్స్ నెలనెలా మీ డబ్బును హారతి కర్పూరంలా కరిగించేస్తుంటాయి. అనవసరమైన సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేసుకుంటే నెలనెలా చాలా డబ్బు మిగుల్చుకోవచ్చు.
4. క్యాష్-బ్యాక్ క్రెడిట్ కార్డ్ వాడండి, డెబిట్ కార్డ్ వద్దు: చాలా క్రెడిట్ కార్డ్స్ మీద క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, ఉచిత బీమా వంటి ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి కొనుగోళ్ల విషయంలో దాదాపుగా ఇలాంటి క్రెడిట్ కార్డులను ఉపయోగించండి.
5. క్రెడిట్ కార్డ్‌ల అధిక వడ్డీలను తప్పించండి: చాలా క్రెడిట్ కార్డ్‌లను దగ్గర పెట్టుకుని, వాటి బిల్లులు కట్టలేక అవస్థలు పడొద్దు. ఆ అప్పులన్నీ రీఫైనాన్స్ చేయడం లేదా ఒకే అప్పుగా మార్చడం గురించి ఆలోచించండి. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది.
6. బీమా కవరేజీ సమీక్ష: మీ జీవిత బీమా, ఇంటి బీమా వంటి వాటిని ఏటా పునఃసమీక్షించి, తగిన మార్పులు చేయాలి. దీనికోసం నిపుణులను సంప్రదించండి.
7. రుణాల కోసం ముందుస్తుగా సిద్ధం: కొత్త సంవత్సరంలో మీరు ఒక ఇంటిని కొనాలని లేదా లోన్ తీసుకోవాలని చూస్తుంటే... మీ కొనుగోలు శక్తిని తెలుసుకోవడం, EMIలు సెట్ చేయడం, మిగిలిన డబ్బుతో ఇంటిని నడపడానికి ముందు నుంచే ప్రిపేర్డ్‌గా ఉండాలి.
8. ఆర్థిక వివరాలన్నీ మీ గుప్పెట్లో ఉండాలి: మీ ఫైనాన్షియల్ ప్లాన్ సక్రమంగా నెరవేరాలంటే, ముందుగా ఆ అంశాలకు సంబంధించిన అన్ని వివరాలు మీకు తెలిసి ఉండాలి. ప్రస్తుత కాలంలో, సమాచారం ఒక సంపద.
9. తగ్గి జీవించడం నేర్చుకోండి: మీ స్థోమతకు మించి కాదు, తగ్గి జీవించడం అలవాటు చేసుకోండి. అలవాట్లు మార్చుకోండి. దీనివల్ల ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు మీ మీద ఒత్తిడి తగ్గుతుంది. మీ లక్ష్యాల వైపు పయనం నల్లేరు మీద నడక అవుతుంది.
10. రిటైర్మెంట్ అకౌంట్లకు ఎక్కువ మొత్తం: ఈ ఖాతాల్లో సంపద పెరగాలంటే, మీ రిటైర్మెంట్ అవసరాలకు సరిపోయే పెట్టుబడులు ఎంచుకోవడం కీలకం. నిర్ణయాలు తీసుకునే ముందు పెట్టుబడి నిపుణులతో మాట్లాడండి.
11. మీ భాగస్వామితో కలిసి ప్లాన్ చేయండి: మీ ఆర్థిక లక్ష్యాల గురించి మీ భాగస్వామితో చర్చించండి. దాని ఆధారంగా మీ ఇద్దరి జీవితాలు, ప్రాధాన్యతల్లో మార్పులు చేసుకోండి. ఆర్థిక విషయాల గురించి నిజాయితీగా ఉండటం వల్ల ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది.
12. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడం: దేశంలో ధరలు, ద్రవ్యోల్బణం పెరిగి ఇంటి బడ్జెట్ మారిపోతోంది. ఆ ఖర్చులకు తగ్గట్లుగా ఇన్వెస్ట్‌మెంట్స్, సేవింగ్స్ ఉండాలి. ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి ఇచ్చే ఇన్‌స్ట్రుమెంట్స్‌లోనే మీ సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండాలని గుర్తుంచుకోండి.
13. వడ్డీ రేట్లను ట్రాక్ చేయండి: 2024లో మన దేశంలో రెపో రేట్ క్రమంగా తగ్గుతుందని మార్కెట్ భావిస్తోంది. దీనికి తగ్గట్లుగానే లోన్ & డిపాజిట్ రేట్లు తగ్గుతాయి. దీనికి తగ్గట్లుగా లోన్ లేదా డిపాజిట్ ప్లాన్స్ ఉండాలి.
14. ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి: పొదుపు, పెట్టుబడులతో పాటు ఊహించని ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని కేటాయించాలి. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే, అత్యవసర సమయాల్లో పొదుపు, పెట్టుబడులను విత్‌డ్రా చేయాల్సి వస్తుంది, ఆర్థిక లక్ష్యాల దూరం పెరుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: హైదరాబాద్‌లో 30 శాతం ఆదాయం ఇంటి ఈఎంఐకే - భాగ్యనగరంలో జాగా కొనాలంటే చుక్కలే!