New ITR forms: 


కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ 2023-23 అసెస్‌మెంట్‌ ఏడాదికి (Assesment Year) గాను ఆదాయపన్ను రిటర్ను పత్రాలను (ITR Forms) నోటిఫై చేసింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసే ఏడాదికి ఐటీఆర్‌ (ITR) దాఖలు చేసేందుకు ఈ పత్రాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే వీటిలో స్వల్ప మార్పులు చేపట్టింది. ఇకపై క్రిప్టో లేదా వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌, షేర్ల ట్రేడింగ్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.


'గతేడాదితో పోలిస్తే ఐటీఆర్‌ పత్రాల్లో పెద్ద మార్పులేమీ చేయలేదు. అయితే పన్ను చెల్లింపుదారులు సులభంగా రిటర్నులు సమర్పించేలా ఉంటాయి. ఆదాయ పన్ను చట్టం సవరించడంతో కనీస మార్పులు చేయాల్సి వచ్చింది' అని సీబీడీటీ (CBDT) ప్రకటించింది. ఏడు ఐటీ రిటర్ను పత్రాలు ఉండగా వీటిలో ఆరింటిని కలిపి 'ఉమ్మడి ఐటీఆర్‌ పత్రాలు' (Common ITR Forms) విడుదల చేయాలని పన్నులు శాఖ నవంబర్లో ప్రతిపాదించింది. ప్రజలు, పన్ను చెల్లింపుదారుల నుంచి సూచనలు స్వీకరించింది. ప్రస్తుతం దీనిపై స్పందించలేదు.


అసెస్‌మెంట్‌ ఇయర్‌ ఆరంభం నుంచీ వివరాలు నింపేలా ప్రస్తుతం నోటిఫై చేసిన ఐటీఆర్‌ పత్రాలు ఉన్నాయని నిపుణులు, టాక్స్‌ ప్రాక్టీషనర్లు అంటున్నారు. 'ఐటీఆర్‌ను ముందుగా నోటిఫై చేయడం ఆరోగ్యకరమైన ఆర్థిక అలవాటు. పన్ను చెల్లింపుదారులు ముందుగానే పన్నులు చెల్లించేందుకు ఇది సాయపడుతుంది' అని టీవోఐఎల్‌ నాలెడ్జ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శైలేంద్ర కుమార్‌ అన్నారు. 'ఎక్కువ మార్పులు చేయకపోవడం వల్ల పన్ను చెల్లింపుదారులు, ప్రొఫెషనల్స్‌కు గొప్ప ఉపశమనం' అని ఆయన అన్నారు.


'ఈ ఏడాది ప్రభుత్వం చాలా ముందుగానే ఐటీఆర్‌ పత్రాలను నోటిఫై చేసింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు సవరణలు చేపట్టేందుకు తగిన సమయం దొరుకుతుంది' అని టాక్స్‌ కనెక్ట్‌ అడ్వైజరీ కన్సల్టెన్సీ ప్రతినిధి వివేక్‌ జలాన్‌ అన్నారు.


Also Read: సెక్షన్ 80C మాత్రమే కాదు, ఇవి కూడా పన్ను ఆదా మార్గాలే - ₹4 లక్షల వరకు మిగులు


Also Read: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!


Also Read: రూ.9 లక్షల ఆదాయానికి రూ.45వేలు, రూ.15 లక్షలకు రూ.1.5 లక్షలే టాక్స్‌!


గతేడాది ఆదాయ పన్ను చట్టంలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. 2022, ఏప్రిల్‌ 1 నుంచి వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌పై పన్నులు వేశారు. జులై 1 నుంచి రూ.10వేలు దాటేసిన క్రిప్టో కరెన్సీ (Crypto Currency), నాన్ ఫంగీబుల్‌ టోకెన్లపై ఒక శాతం టీడీఎస్‌ కోత విధిస్తున్నారు. 'ఈ మార్పులన్నీ ఐటీఆర్‌ పత్రాల్లో ప్రతిబింబిస్తున్నాయి. వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌పై ఆదాయాన్ని ప్రకటించేందుకు ఐటీఆర్‌2, ఐటీఆర్‌3, ఐటీఆర్‌5, ఐటీఆర్‌6లో ప్రత్యేక విభాగం ఇచ్చారు' అని జలాన్‌ వెల్లడించారు.


ఈక్విటీ మార్కెట్లలో ట్రేడింగ్‌ (Share Market Trading) చేస్తుంటే ఆ ఆదాయాన్ని అదనంగా చూపించాలి. 'ఒకవేళ మీరు ట్రేడింగ్‌ బిజినెస్‌లో ఉంటే మొత్తం ట్రేడింగ్‌ను ఐటీఆర్‌ 3, ఐటీఆర్‌ 5, ఐటీఆర్‌ 6 పత్రాల్లో ఇంట్రాడే ట్రేడింగ్‌, డెలివరీ ఆధారిత ట్రేడింగ్‌ను వేర్వేరుగా చూపించాల్సి ఉంటుంది' అని జలాన్‌ అన్నారు.