Tax Saving Tips Options: 2023-24 బడ్జెట్‌లో, కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. ఇది, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం. ఇది కొత్త పన్ను విధానం. ఇందులో వివిధ సెక్షన్ల కింద డిడక్షన్స్‌ ఉండవు. మీ ఆదాయం రూ. 7 లక్షలు దాటితే, స్లాబ్‌ విధానం ప్రకారం ఆదాయ పన్ను చెల్లించాలి. 


అయితే, మీరు పాత ఆదాయ పన్నును ఫాలో అయితే డిడక్షన్స్‌ ఉంటాయి. ఈ విధానంలో, ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద (Tax Saving under Section 80C) రూ. 1.5 లక్షల వరకు వార్షిక మినహాయింపును కేంద్రం ఇస్తోంది, దీని గురించి చాలా మందికి తెలుసు.


ఆదాయపు పన్ను సెక్షన్ 80C కాకుండా, ఆదాయ పన్ను ఆదా కోసం మరికొన్ని ఇతర సెక్షన్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా మీరు లక్షల రూపాయల వరకు పన్నును ఆదా చేయవచ్చు. వాటిలో కొన్ని ఆప్షన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


జాతీయ పింఛను పథకం ‍‌(National Pension System లేదా NPS)
మీరు NPS పథకం కింద పెట్టుబడి పెడితే, సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అంటే మీ వార్షిక ఆదాయపు పన్ను రూ. 50,000 కంటే ఎక్కువ వస్తే, మీరు దీని కింద రూ. 50,000 తగ్గింపును తీసుకోవచ్చు.


ఆరోగ్య బీమా ప్రీమియం
ఆదాయపు పన్ను సెక్షన్ 80D కింద, మీరు ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ. 25 వేల నుంచి రూ. 1 లక్ష వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పన్ను చెల్లింపుదార్లు రూ. 25,000 ప్రీమియం మీద పన్ను రాయితీని పొందవచ్చు. ఇది కాకుండా, తల్లిదండ్రుల పేరు మీద మీరు కట్టే ప్రీమియంపైనా రూ. 25 వేల పన్ను మినహాయింపు తీసుకోవచ్చు.


గృహ రుణంపై పన్ను మినహాయింపు
మీరు ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, మీరు రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆ ఇంటిని మీ సొంత ఉపయోగం కోసం ఉండాలి.


పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీపై రాయితీ
సేవింగ్స్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసే వాళ్లు ఆదాయపు పన్ను సెక్షన్ 80TTA ప్రకారం రూ. 10,000 వార్షిక వడ్డీపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాలకు ఈ సెక్షన్‌ వర్తిస్తుంది. మరోవైపు, ఎక్కువ పొదుపు ఖాతాలను కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లకు, 80TTB కింద రూ. 50,000 వార్షిక వడ్డీ ఆదాయం వరకు పన్ను ఉండదు.


స్వచ్ఛంద సేవ సంస్థలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు
ఛారిటబుల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ లేదా స్వచ్ఛంద సేవ సంస్థలకు మీరు ఇచ్చే విరాళాల మీద కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 80CCC కింద, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన మొత్తాన్ని మినహాయింపుగా మీరు క్లెయిమ్ చేయవచ్చు. మీరు రూ. 200 కంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చిన విరాళాల మీద ఆదాయ పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.