SBI Loan Rate Hike: దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గట్టి ప్రయత్నాలు చేస్తోంది, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు సార్లు వడ్డీ రేట్లు పెంచింది. 2022 మే నెల నుంచి వడ్డీ రేట్ల పెంపు ప్రారంభమైంది. తాజాగా, 2023 ఫిబ్రవరి 8న, రెపో రేటును మరో 0.25 శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్‌బీఐ. దీంతో కలిపి, రెపో రేటును మొత్తంగా 2.50 శాతం పెంచి, 6.50 శాతానికి చేర్చింది.
తాజా పెంపు (ఫిబ్రవరి 8, 2023 నాటి పెంపు) తర్వాత RBI రెపో రేటు మారడంతో, దానికి అనుగుణంగా దేశంలోని చాలా బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచాయి. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) పేరు కూడా ఈ జాబితాలోకి చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును (MCLR) 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు తర్వాత SBI గృహ రుణం, కారు రుణం, విద్యా రుణం తదితరాల నెలవారీ చెల్లింపుల (EMIs) మొత్తం పెరుగుతుంది. స్టేట్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు (SBI Interest Rates) ఫిబ్రవరి 15, 2023 నుంచి, అంటే నేటి నుంచి అమలులోకి వచ్చాయి.
SBI కొత్త MCLR ఎంత?
వివిధ కాలాల MCLRను 0.10 శాతం మేర SBI పెంచింది. దీంతో...
ఒక రోజు రుణాలపై (ఓవర్‌నైట్ లోన్స్) వడ్డీ 7.85 శాతం నుంచి 7.95 శాతానికి పెరిగింది.
ఒక నెల రుణాలపై వడీ 8.00 శాతం నుంచి 8.10 శాతానికి పెరిగింది.
3 నెలల MLCR 8.00 నుంచి నుండి 8.10 శాతానికి చేరింది.
6 నెలల MLCR 8.30 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది.
1 సంవత్సరం MLCR 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది.
2 సంవత్సరాల MLCR 8.50 శాతం నుంచి 8.60 శాతానికి చేరింది.
3 సంవత్సరాల MLCR 8.60 నుంచి 8.70 శాతానికి పెరిగింది.
రుణలపై వడ్డీ రేటు పెంచిన PNB
దేశంలోని రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank Loan Rate Hike) కూడా తన రెపో లింక్డ్ లెండింగ్ రేటును (RLLR) 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పుడు అది 9.00 శాతం నుంచి 9.25 శాతానికి పెరిగింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 9, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా MCLR
MCLR పెంపు ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు పెరిగాయి. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం... MCLRను 5 బేసిస్ పాయింట్లు లేదా 0.05 శాతం పెంచింది. ఇది, ఫిబ్రవరి 12, 2023 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పెంపు తర్వాత, వివిధ కాలాల రుణాల మీద బ్యాంకు MCLR 7.9 నుంచి 8.55 వరకు ఉంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర MCLR
ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా నిధుల ఉపాంత వ్యయ ఆధారిత రుణ రేటును (MCLR) పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 13, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత, వివిధ కాల వ్యవధుల రుణాలపై ఈ బ్యాంక్ 7.50 శాతం నుంచి 8.40 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది.