Budget 2023: మధ్య తరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఇకపై రూ.9 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లు కేవలం రూ.45వేలు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. ఇంకా పన్ను విధానాల్లో ఎలాంటి మార్పులు చేశారంటే!


కొత్త ఆదాయ పన్ను విధానంలో భారీ మొత్తంలో జీతం అందుకుంటున్న వారికీ మోదీ సర్కారు తక్కువ పన్ను అమలు చేస్తోంది. ఇకపై ఏడాదికి రూ.9 లక్షల ఆదాయం పొందుతున్న వారు కేవలం రూ.45,000 చెల్లిస్తే చాలు. అంటే వారి మొత్తం ఆదాయంలో ఇది 5 శాతమే అన్నమాట. ఇప్పటి వరకు చెల్లిస్తున్న రూ.60,000 పన్నులో 25 శాతం భారం తగ్గింది.



ఏడాదికి రూ.15 లక్షల ఆదాయం పొందుతున్న వ్యక్తులు వచ్చే ఏడాది నుంచి రూ.1.5 లక్షలు పన్ను చెల్లిస్తే చాలు. అంటే వారి మొత్తం ఆదాయంలో ఇది కేవలం 10 శాతం. అంతకు ముందు రూ.1,87,500 చెల్లించాల్సి వచ్చేంది. అంటే ఇందులో 20 శాతం భారం తగ్గింది.


అధిక వేతనాలు పొందుతున్న వారికీ మరో ప్రయోజనం కల్పించారు. వేతన జీవులు, పింఛన్‌దారులు, కుటుంబ పింఛన్‌దారులకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచారు. రూ.15.5 లక్షల వార్షిక వేతనం పొందుతున్న వారికి రూ.52,500 ప్రయోజనం కల్పిస్తున్నారు.


ఇకపై కొత్తదే!


ఇకపై సరికొత్త పన్ను విధానానికే తొలి ప్రాధాన్యమని నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వారికి పడే పన్ను 'సున్నా' అని ప్రకటించారు. పన్నుల హేతుబద్దీకరణ చేపడతున్నామని వెల్లడించారు. పన్ను మదింపు ప్రక్రియను 93 నుంచి 16 రోజులకు తగ్గించామన్నారు. వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి ఐదు కీలక ప్రకటనలు చేశారు.


రూ.7 లక్షల వరకు 'సున్నా' పన్ను


ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానాల్లో రూ.5 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త విధానంలో ఆ రిబేటు పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. అంటే ఆమేరకు ఆదాయం ఆర్జిస్తున్నవాళ్లు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.


ఆదాయ శ్లాబుల మార్పు


ఒకప్పుడు ఆరుగా ఉన్న ఆదాయ పన్ను శ్లాబులును ఇప్పుడు ఐదుకు తగ్గించారు. రూ.2.5 లక్షల శ్లాబును ఎత్తేశారు. ఇకపై రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.3 లక్షల నుంచే పన్ను మదింపు మొదలవుతుంది. రూ.3-6 లక్షల వరకు 5 శాతం, రూ.6-9 లక్షల వరకు 10 శాతం, రూ.9-12 లక్షల వరకు 15 శాతం, రూ.12-15 లక్షల వరకు 20 శాతం,రూ.15 లక్షలు మించితే 30 శాతం పన్ను రేట్లు వర్తిస్తాయి.


** ప్రకటించిన పన్ను శ్లాబులు, మినహాయింపులు వచ్చే ఆర్థిక ఏడాది నుంచి అమలవుతాయని తెలిసింది.