Budget 2023: 


ఇంతకీ కొత్త పన్ను విధానం వల్ల మనకు లాభమేనా? సగటు పన్ను చెల్లింపుదారుడికి మేలు జరిగిందా? కొత్త పన్ను శ్లాబుల వల్ల సామాన్యుడిపై పన్ను భారం తగ్గిందా? రూ.7 లక్షలకు మించి ఆదాయం ఉంటే ఏ పన్ను విధానం బాగుంటుంది? ఎలాంటి తిరకాసులు, కనికట్టు లేకుండానే మోదీ సర్కారు వ్యక్తిగత ఆదాయ పన్నును హేతుబద్ధీకరించిందా?


- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టాక చాలా మందిలో కలిగిన సందేహాలివి!


భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఇతర సమస్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. భారత్‌ ఇందుకు మినహాయింపేమీ కాదు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనవద్దే కాస్త తక్కువగా ఉంది. ఏదేమైనా పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని ఆదాయపన్ను భారం తగ్గించాలని అంతా డిమాండ్‌ చేశారు. సెక్షన్‌ 80సీ పరిమితి పెంచాలని, జీవిత బీమా ప్రీమియం వంటి మినహాయింపులను అందులోంచి తీసేసి మరో సెక్షన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వీటితో పాటు స్టాండర్డ్‌ డిడక్షన్‌ (Standard Deduction) పెంచాలని సూచించారు.


ప్రభుత్వం సగటు పన్ను చెల్లింపుదారుడిని దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు చేసింది. ఇందులో మొదటిది కొత్త పన్ను విధానాన్ని(New Tax Regim) డీఫాల్ట్‌గా చేయడం. ఈ వ్యవస్థను మరింత సరళంగా మార్చడం రెండోది. రూ.7 లక్షల వరకు పన్ను లేకపోవడం మూడోది. అదనంగా మరో రూ.50వేలు స్టాండర్డ్‌ డిడక్షన్‌ కల్పించడం వల్ల మొత్తంగా రూ.7.50 లక్షల వరకు పన్నులేమీ ఉండవు. ఇదే విధానంలో పన్ను శ్లాబులను (Income Tax Slabs) మార్చారు. రూ.3 లక్షల వరకు జీరో టాక్స్‌. రూ.3-6 లక్షలకు 5 శాతం, రూ.6-9 లక్షలకు 10 శాతం, రూ.9-12 లక్షలకు 15 శాతం, రూ.12-15 లక్షలకు 20 శాతం, రూ.15 లక్షలు మించితే 30 శాతం పన్ను లెక్కిస్తారు.


చాలామంది రూ.7 లక్షల వరకు పన్నులేమీ లేవనడంతో హ్యాపీగా ఫీలయ్యారు. మరికొందరు పాత విధానంలో మినహాయింపులతో అసలు పన్నులేమీ కట్టకుండానే ఉండొచ్చు కదా! ఇందులో ఏముంది గొప్ప! అన్నట్టుగా మాట్లాడారు. అయితే ప్రభుత్వం ఇక్కడే చిన్న కనికట్టు ప్రదర్శించింది! గరిష్ఠ పన్ను మినహాయింపులు కలుపుకుంటే పాత విధానంలో ఎంత పన్ను చెల్లిస్తారో కొత్త విధానంలో అసలు డిడక్షన్లేమీ చూపకుండానే అంతే పన్ను కొట్టొచ్చు. అంటే ప్రభుత్వం ఈ రెండు పన్ను విధానాల్లో చెల్లించాల్సిన పన్నును బ్రేక్‌ ఈవెన్‌ (Tax Break Even) చేసింది.


ఉదాహరణకు రూ.7.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి పాత విధానంలో రూ.2.5 లక్షలు గరిష్ఠంగా మినహాయింపులు చూపొచ్చు. అంటే కచ్చితంగా చూపాల్సిందే. రూ.10 లక్షల ఆదాయ వర్గాలు రూ.3 లక్షల వరకు గరిష్ఠ మినహాయింపు పొందితే కట్టాల్సిన పన్ను రూ.54,600. కొత్త దాంట్లో ఏవీ చూపించకున్నా కట్టేది రూ.54,600. ఇక రూ.12.5 లక్షలు, రూ.15 లక్షలు, రూ.20 లక్షల వర్గాల గరిష్ఠ మినహాయింపులు వరుసగా రూ.2,62,000, రూ.4,08,000, రూ.4.25,000. వీటన్నిటినీ ఉపయోగించుకుంటే పాత విధానంలో కట్టే పన్ను వరుసగా రూ.93,000, రూ.1,45,000, రూ.2.96,000. విచిత్రంగా ఇవేవీ చూపకున్నా కొత్త విధానంలో చెల్లించేదీ అంతే మొత్తం.


ఈ రెండు పన్ను విధానాల్లో ఏది ఎంచుకోవాలో ఇలా నిర్ణయించుకోవడం మంచిది. పాత విధానంలో సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 మినహాయింపు (Section 80c) వస్తుంది. పాఠశాల ఫీజులు, ఈపీఎఫ్‌, పీపీఎఫ్, సుకన్య, ఐదేళ్ల పోస్టాఫీసు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌, జీవిత బీమా ప్రీమియం, యులిప్స్‌, ఇంటి రుణం అసలు చెల్లింపు, స్టాంప్‌ డ్యూటీలు ఇందులో వర్తిస్తాయి. సెక్షన్‌ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియం రూ.25,000, పెద్దోళ్లకు రూ.50,000, ఎన్‌పీఎస్‌ కింద రూ.50,000, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000, ఇంటి రుణం వడ్డీ రూ.2,00,000 మినహాయించుకోవచ్చు. అంటే గరిష్ఠంగా రూ.4,75,000. మీ మూల వేతనాన్ని బట్టి హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అప్పుడు ఇంటిలోన్‌, వడ్డీ మినహాయింపు రాదని గుర్తుంచుకోవాలి.


సంక్లిష్టమైన పన్ను విధానం వల్ల ఇప్పటి వరకు చాలా మంది పన్ను ఆదాయ ఆర్థిక సాధనాల కొనుగోలును బలవంతంగా చేసేవాళ్లు. ఉదాహరణకు ఇష్టం లేకున్నా, ఆర్థికంగా భారమైన బ్యాంకులో హోమ్‌ లోన్‌ తీసుకున్నవాళ్లే ఎక్కువ. అయిష్టంగానే లెక్కకు మించి జీవిత బీమాలు తీసుకుంటున్నారు. ఏమాత్రం అవగాహన లేకుండా మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. తమ ఇంటి అవసరాలు తీరకున్నా ఒత్తిడితోనే సేవింగ్స్‌ చేస్తున్నారు. కొత్త విధానం వల్ల ఇలాంటి ఒత్తిళ్లకు తెరపడుతుంది. స్వచ్ఛందంగా రిటర్నులు పెరుగుతాయి. అంతేకాకుండా తమ ఆదాయంలో సగటున 5-8 శాతం పన్ను చెల్లించేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నట్టు సర్వేల ద్వారా తెలుస్తోంది.


ఒక చిన్న ఉదాహరణతో ఈ కథనం ముగిద్దాం. ఒక వ్యక్తి ఆదాయం సంవత్సరానికి రూ.10 లక్షలు అనుకుంటే వాళ్లు రూ.4.75 లక్షల వరకు గరిష్ఠంగా మినహాయింపులు క్లెయిమ్‌ చేయొచ్చు. అంటే సెక్షన్‌ 80సీలో రూ.150,000 ఆదా చేయాలి. మీ ఈపీఎఫ్‌ ఇందులోకే వస్తుందన్న సంగతి మర్చిపోవద్దు. ఇంటి లోన్‌ తీసుకొని ఉండాలి. దానికి రూ.2 లక్షలు మినహాయింపు చూపాలి. ఆరోగ్య బీమాలు తీసుకోవాలి. ఇంకా పైన చెప్పివన్నీ ఉపయోగించుకోవాలి. లోన్‌ తీసుకుంటే హెచ్‌ఆర్‌ఏ (HRA) క్లెయిమ్‌ చేయలేం. ఇవన్నీ చూపిస్తే మీరు చెల్లించాల్సిన పన్ను రూ.18,200. కొత్త విధానంలోని రూ.54,600తో పోలిస్తే రూ.36,400 ఆదా అవుతున్నాయి. మీ మినహాయింపులు రూ.2 లక్షలు దాటకపోతే మీరు ఏకంగా రూ.75,400 పన్ను కట్టాలి. అలాంటప్పుడు కొత్తది ఎంచుకుంటే రూ.20,800 ఆదా అవుతాయి. పైగా కొత్త విధానంలో ఎన్‌పీఎస్‌ డిడక్షన్‌ ఒకటి ఉంది. మీ బేసిక్‌, డీఏ వేతనంలో 10 శాతం మీ కంపెనీ చేతే ఎన్‌పీఎస్‌లో జమ చేయిస్తే ఆ మేరకు అదనపు మినహాయింపు వస్తుంది.