NPS Vatsalya Yojana: పెన్షన్‌ పథకాలు పెద్దవాళ్ల కోసం మాత్రమే కాదు, చిన్న పిల్లల కోసం కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రైవేట్‌ కంపెనీలు ఈ తరహా పథకాలను ఇప్పటికే మార్కెట్‌కి తెచ్చాయి. వాటికి పోటీగా, NPSలోనూ (National Pension System) కొత్త స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తోంది. 


ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను సమర్పిస్తూ, ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు, ఆ ప్రకటనను అమలు చేసే టైమ్‌ వచ్చుంది. కేంద్ర ఆర్థిక మంత్రి, ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని 18 సెప్టెంబర్ 2024న (బుధవారం) ప్రారంభించబోతున్నారు. ఈ స్కీమ్‌లో సభ్యత్వం పొందేందుకు దీని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను మంత్రి లాంచ్‌ చేస్తారు. అదే అకేషన్‌లో, ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేస్తారు. ఈ పథకంలో చేరిన మైనర్ (18 ఏళ్ల వయస్సు లోపు వాళ్లు) చందాదార్లకు శాశ్వత పదవీ విరమణ ఖాతా నంబర్‌ను (Permanent Retirement Account Number లేదా "ప్రాన్‌") కూడా ఆర్థిక మంత్రి అందిస్తారు. 


75 నగరాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు
బుధవారం, ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 75 నగరాల్లో నిర్వహిస్తారు. ప్రధాన కార్యక్రమాన్ని న్యూదిల్లీలో నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల ప్రజలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొనవచ్చు.


 






NPS వాత్సల్య పథకం స్పెషాలిటీ ఏంటి?
NPS వాత్సల్య పథకం కింద, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం వారి చిన్నతనం నుంచే పెన్షన్ ఖాతాలో పెట్టుబడిని ప్రారంభించొచ్చు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇన్వెస్ట్‌మెంట్‌ స్టార్ట్‌ చేయడం వల్ల, దానిని దీర్ఘకాలం పాటు కొనసాగించే అవకాశం వస్తుంది. ఫలితంగా, ఆ పిల్లలు పెద్దవాళ్లై, రిటైర్‌ అయ్యేనాటికి ఊహించనంత మొత్తంలో కార్పస్‌ (పెద్ద మొత్తంలో డబ్బు) ఆ ఖాతాలో పోగవుతుంది. ఇప్పటివరకు, NPSలో పెట్టుబడులకు మేజర్లకు మాత్రమే అనుమతి ఉండేది. 


తల్లిదండ్రులు లేదా సంరక్షులు పిల్లల పేరు మీద NPS వాత్సల్య అకౌంట్‌ను ఓపెన్‌ చేయొచ్చు. సంవత్సరానికి రూ. 1,000 పెట్టుబడి కూడా పెట్టొచ్చు. కాబట్టి, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా దీనిని భరించగలవు. పిల్లలకు 18 ఏళ్ల వయస్సు వచ్చిన (మేజర్లు అయ్యాక) తర్వాత, NPS వాత్సల్య ఖాతా సాధారణ NPS ఖాతాగా మారుతుంది. ఇప్పటికే ఉన్న రూల్సే దానికీ వర్తిస్తాయి.


NPS వాత్సల్య పథకాన్ని 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA) నిర్వహిస్తుంది. 


మరో ఆసక్తికర కథనం:  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ Vs బిగ్ బిలియన్ డేస్, దేనిలో బెస్ట్‌ ఆఫర్స్‌ దొరుకుతాయ్‌?