Smart Strategy for Monthly Income: చాలామంది ఉద్యోగం లేదా వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగం/వ్యాపారం బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత, అప్పటి వరకు పోగు చేసిన పొదుపు నుంచి నెలవారీ స్థిరమైన ఆదాయాన్ని ఎలా పొందాలో గుర్తించలేరు. నిజానికి ఇదొక క్లిస్టమైన సవాలు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సీనియర్ సేవింగ్స్ స్కీమ్‌లు వంటి పాపులర్‌ ఆప్షన్స్‌ ఉన్నప్పటికీ, వాటి పరిమితులు వాటికి ఉంటాయి. వడ్డీ రాబడి తక్కువగా ఉంటుంది. 


వాస్తవానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సీనియర్ సేవింగ్స్ స్కీమ్‌ వంటివి సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. అయినప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని, దీర్ఘకాలం పాటు సుఖంగా బతకడానికి అవసమైన రాబడిని అవి ఇవ్వకపోవచ్చు. ఇక్కడే "సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్" అక్కరకొస్తుంది.


నెలవారీ ఆదాయం కోసం తెలివైన వ్యూహం
మ్యూచువల్ ఫండ్స్‌లో మనం తరచూ వినే 'సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌'కు (SIP) రివర్స్‌లో ఉంటుంది సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ (SWP). రిటైరైన వ్యక్తులకు సరిపడా డబ్బును అందించగల స్మార్ట్‌ స్ట్రాటెజీగా ఇది పని చేస్తుంది. 


SWP అంటే? (What is Systematic Withdrawal Plan)
SIPలో నెలనెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తూ, దీర్ఘకాలంలో సంపద సృష్టిస్తారు. SWPలో, ముందుగానే పెద్ద మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. ఆ లంప్సమ్‌ నుంచి ప్రతి నెలా లేదా 3 నెలలకు ఒకసారి లేదా ఒక నిర్ణీత సమయంలో నిర్ణీత మొత్తాన్ని విత్‌డ్రా చేస్తారు. ఈ విధంగా, పదవీ విరమణ చేసిన వాళ్లు తమ అవసరాలకు సరిపడేంత డబ్బును స్థిరంగా వచ్చేలా ప్లాన్‌ చేయొచ్చు. ఇన్వెస్టర్‌ తీసుకోగా మిగిలిన డబ్బు మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడిగా కొనసాగుతుంది, స్టాక్‌ మార్కెట్‌తో పాటు పెరుగుతుంది. అంటే, నెలనెలా/నిర్ణీత సమయానికి డబ్బు రావడంతో పాటు మూలధనం కూడా పెరుగుతూనే ఉంటుంది. తద్వారా, పెట్టుబడికి రక్షణ లభిస్తుంది. పదవీ విరమణ కోసమే కాదు, ఏ వయస్సులో ఉన్న వ్యక్తులైనా ఈ వ్యూహాన్ని ఫాలో కావచ్చు. అయితే, పదవీ విరమణ చేసిన వారి జీవన వ్యయాలను కవర్ చేయడానికి స్థిరమైన ఆదాయం అవసరం కాబట్టి, ఇది వాళ్లకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.


SWP ముఖ్య ప్రయోజనాల్లో ఫ్లెక్సిబిలిటీ ఒకటి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఏటా మీ విత్‌డ్రా మొత్తాలను సర్దుబాటు చేయొచ్చు. ఉదాహరణకు... మీరు నెలకు రూ. 25,000 విత్‌డ్రా చేస్తూ, విత్‌డ్రా ప్రతి సంవత్సరం 3% చొప్పున పెంచుకుంటూ వెళ్లాలంటే.. 6% వార్షిక రాబడి ఇవ్వగల మ్యూచువల్‌ ఫండ్స్‌లో రూ.70 లక్షలు పెట్టుబడి పెట్టాలి.


ఒకవేళ, మీరు ఎంచుకున్న ఫండ్స్‌ సంవత్సరానికి 8% రాబడి ఇస్తే, మీకు రూ.51 లక్షల పెట్టుబడి చాలు. 10% రాబడి ఉన్నప్పుడు రూ.41 లక్షలు మాత్రమే అవసరమవుతాయి. ఈ ప్లాన్‌ ప్రకారం, మీ పెట్టుబడికి రక్షణ ఉండడంతో పాటు ఏటా మీ ఆదాయం కూడా పెరుగుతుంది.


అదేవిధంగా, సంవత్సరానికి 4% పెరుగుదలతో నెలకు రూ.50,000 ఆదాయాన్ని లేదా  5% వార్షిక పెరుగుదలతో నెలకు రూ.లక్ష రూపాయలను లక్ష్యంగా పెట్టుకుంటే, రాబడి రేటును బట్టి కార్పస్ మారుతుంది. నెలకు లక్ష రూపాయలు చొప్పున 25 సంవత్సరాల పాటు తీసుకోవాలంటే, దీంతోపాటు ఏటా మంత్లీ ఇన్‌కమ్‌ పెరగాలంటే, మీ ఫండ్స్‌ మీకు అధిక రాబడిని ఇవ్వాలి. అప్పుడు, మీకు తక్కువ కార్పస్‌ అవసరమవుతుంది.


SWP ఎందుకు బెస్ట్‌?
ఇతర రిటైర్మెంట్‌ ప్లాన్స్‌తో పోలిస్తే... ఫ్లెక్సిబిలిటీ, తక్కువ ఆదాయ పన్ను వంటివి SWPలు ప్రత్యేకంగా నిలుస్తాయి. యాన్యుటీ ప్లాన్‌ల తరహాలో స్థిరమైన & తక్కువ రాబడిని SWPలు ఇవ్వవు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌ తరహాలో అధిక పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?