Date Of Birth Correction In PF Account: భారతదేశంలోని ఉద్యోగస్తులందరికీ పీఎఫ్ ఖాతాలు (Provident Fund Account) ఉన్నాయి. ఈ ఖాతాలను ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. ప్రతి నెలా, ఉద్యోగుల జీతం నుంచి 12 శాతం మొత్తం పీఎఫ్‌ ఖాతాలో జమ అవుతుంది. అంతే మొత్తాన్ని కంపెనీ యాజమాన్యం కూడా ఉద్యోగి ఖాతాలో డిపాజిట్‌ చేస్తుంది. పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ ఇస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, పీఎఫ్‌ ఖాతాలపై 8.25% వడ్డీని (Interest rate for EPF for 2023-24) ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వడ్డీ రేటు ప్రతి సంవత్సరం మారుతుంది. 


పీఎఫ్‌ ఖాతాలో జమ అయిన డబ్బును రిటైర్మెంట్‌ తర్వాత తీసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో, EPFO నిబంధనలను అనుసరించి, పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బును రిటైర్మెంట్‌కు ముందే కూడా పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. 


ఒక వ్యక్తి ఉద్యోగ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి అతని పేరిట పీఎఫ్‌ ఖాతా కూడా స్టార్ట్‌ అవుతుంది. కొన్నిసార్లు పీఎఫ్ ఖాతాలో పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేస్తుంటారు. పుట్టిన తేదీలో ఒక్క అంకె మారినా అది చాలా పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. ఖాతా నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ విరమణ సమయంలోనో, అత్యవసర సమయాల్లోనో ఖాతా నుంచి డబ్బు ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు మీ క్లెయిమ్‌కు అనుమతి లభించకపోవచ్చు. డేట్‌ ఆఫ్‌ బర్త్‌ తప్పుగా నమోదైన చందాదార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు కోకొల్లలు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కాబట్టి, పుట్టిన తేదీలో తప్పును ముందుగానే సరిదిద్దుకోవడం మంచిది.


మూడేళ్ల గ్యాప్‌ రూల్‌
పీఎఫ్‌ ఖాతా వివరాల్లో పుట్టిన తేదీని మార్చుకోవడానికి, EPFO కొన్ని రూల్స్‌ను నిర్ణయించింది. నిబంధనల ప్రకారం... మీ పుట్టిన తేదీ తప్పుగా నమోదైతే, దానిని సరిదిద్దుకోవాలనుకుంటే, సరైన పుట్టిన తేదీకి - ఇప్పటికే నమోదైన పుట్టిన తేదీకి మధ్య 3 సంవత్సరాల కంటే తక్కువ గ్యాప్ ఉండాలి. ఇలాంటి కేస్‌లో డేట్‌ ఆఫ్‌ బర్త్‌ కరెక్షన్‌ ఈజీగా పూర్తవుతుంది.


సపోర్టింగ్‌ డాక్యుమెంట్‌
సరైన పుట్టిన తేదీకి - ఇప్పటికే నమోదైన పుట్టిన తేదీకి మధ్య 3 సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ వస్తే, పుట్టిన తేదీని సరిదిద్దుకోవడానికి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా జత చేయాలి. మీ ఆధార్ కార్డ్, స్కూల్‌ లేదా కాలేజీ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మెడికల్ సర్టిఫికేట్, కేంద్రం/రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌ రికార్డ్‌లో దేన్నయినా సపోర్టింగ్‌ డాక్యుమెంట్‌గా మీరు సబ్మిట్‌ చేయొచ్చు. 


పుట్టిన తేదీని మార్చుకోవడం ఎలా? ‍‌(How to correct the wrong date of birth in the PF account?)
పుట్టిన తేదీని మార్చడానికి unifiedportal-mem.epfindia.gov.in/memberinterface లింక్‌ ద్వారా EPFO అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. 
ఇప్పుడు, 'మేనేజ్' విభాగంలోకి వెళ్లి 'బేసిక్ డిటైల్స్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
పాత పుట్టిన తేదీ స్థానంలో కొత్త పుట్టిన తేదీని ఎంటర్‌ చేసే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇక్కడ, మీరు సరైన పుట్టిన తేదీని నమోదు చేయాలి. మీరు ఎంటర్‌ చేసిన కొత్త పుట్టిన తేదీని మరోమారు చెక్‌ చేసుకోండి.
ఆ తర్వాత, కింద కనిపించే చెక్ బాక్స్‌పై క్లిక్ చేయాలి. 
ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని ఎంటర్‌ చేయండి. 
ఈ ప్రాసెస్‌ ఇక్కడితో పూర్తవుతుంది, మీ పీఎఫ్‌ అకౌంట్‌లో కొత్త పుట్టిన తేదీ అప్‌డేట్ అవుతుంది.


మరో ఆసక్తికర కథనం: సేవింగ్స్‌ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు, ఎంత టాక్స్‌ కట్టాలి?