Cash Deposit Limit In Savings Account: ప్రజల అవసరాల్లో బ్యాంక్‌ ఖాతా కూడా ఒకటి. డబ్బును దాచుకోవడం నుంచి ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రయోజనాలు పొందే వరకు, చాలా పనులకు బ్యాంక్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ తప్పనిసరి. అయితే, పొదుపు ఖాతా వల్ల ప్రయోజనాలే కాదు, దానిని సరిగా నిర్వహించకపోతే కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు. ఎలాంటి చిక్కులు రాకుండా చూసుకోవాలంటే ఆదాయ పన్ను విషయాలపైన మీకు కాస్త అవగాహన ఉండాలి. కొద్ది మొత్తంలో డబ్బు ఉన్న సేవింగ్స్‌ ఖాతాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉన్నా, పెద్ద మొత్తంలో వడ్డీ ఆదాయం వస్తున్నా ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ రాడార్‌లోకి వస్తారు. ఇలాంట్‌ కేస్‌లో, మీ సేవింగ్స్‌ అకౌంట్స్‌లో డిపాజిట్లు, ఇంట్రస్ట్‌ ఇన్‌కమ్‌ గురించి ఆదాయ పన్ను అధికార్లకు కచ్చితంగా రిపోర్ట్‌ చేయాలి. 


గరిష్ట పరిమితి లేదు 
పొదుపు ఖాతాలో డిపాజిట్‌ మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. ఒకేసారి లేదా విడతల వారీగా మీరు ఎంత డబ్బయినా జమ చేయొచ్చు. సేవింగ్స్‌ ఖాతాలో మీ డిపాజిట్లపై బ్యాంక్‌ కొంత వడ్డీని చెల్లిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు జమ చేసిన మొత్తం డబ్బు, ఆ డిపాజిట్లపై మీరు సంపాదించిన వడ్డీ ఆదాయం ఆధారంగా టాక్స్‌ రూల్స్‌ వర్తిస్తాయి.


సంపాదించిన వడ్డీపై పన్ను
సేవింగ్స్‌ అకౌంట్‌లో డిపాజిట్లపై వచ్చిన వడ్డీ మీ ఆదాయం అవుతుంది. ఇది ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ వడ్డీ గురించి ప్రతి సంవత్సరం మీ ఇన్‌కమ్‌ టాక్స్‌ పన్ను రిటర్న్‌లో (ITR) కచ్చితంగా రిపోర్ట్‌ చేయాలి.


వడ్డీ ఆదాయంపై మినహాయింపు
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో, సేవింగ్స్‌ అకౌంట్‌ వడ్డీ రూపంలో సాధారణ ఖాతాదార్లకు (60 ఏళ్ల వయస్సు లోపు వ్యక్తులు) రూ.10,000 వరకు వడ్డీ ఆదాయం పన్ను రహితం. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు) రూ.50,000 వడ్డీ ఆదాయంపై టాక్స్‌ కట్టక్కర్లేదు. వడ్డీ ఆదాయం ఈ పరిమితికి మించితే, అది మీ ఆదాయంలో కలుస్తుంది, స్లాబ్ రేట్‌ ప్రకారం పన్ను చెల్లించాలి.


మొత్తం డిపాజిట్లు రూ.10 లక్షలు దాటితే
మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉండి, ఒక ఫైనాన్షియల్‌ ఇయర్‌లో అన్ని ఖాతాల్లో కలిపి డిపాజిట్ల మొత్తం 10 లక్షల రూపాయలు దాటితే, దాని గురించి ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు తప్పనిసరిగా రిపోర్ట్‌ చేయాలి. అంటే, మీ ITR ఫైలింగ్‌లో దీని గురించి వెల్లడించాలి. ఒకవేళ, మరిచిపోయి/కావాలని ఈ డిపాజిట్ల గురించి చెప్పకపోతే మీరు పన్ను ఎగవేతకు ప్రయత్నించినట్లు ఐటీ విభాగం భావిస్తుంది. దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. 


ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయంలో...
మీ అన్ని పొదుపు ఖాతాల్లో కలిపి డిపాజిట్ల మొత్తం రూ.10 లక్షలకు మించి ఉంటే, ఆ డిపాజిట్ల వివరాలు మిస్‌ కాకుండా మీ ITRలో ఉండేలా చూసుకోండి.
ఆయా డిపాజిట్లరపై మీరు సంపాదించిన వడ్డీ వివరాలు కూడా ITR ఉండేలా ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోండి.
ఒకవేళ మీరు సంపాదించిన వడ్డీ ఆదాయం మినహాయింపు పరిమితి లోపు ఉన్నప్పటికీ దాని గురించి ITRలో వెల్లడించండి.
ఐటీఆర్‌ను సబ్మిట్‌ చేయడానికి ముందు AIS (Annual Information Statement), TIS ‍‌(Taxpayer Information Summary)ను కూడా చెక్‌ చేయండి. మీరు సంపాదించిన అన్ని ఆదాయాల వివరాలు ఈ రెండు డాక్యుమెంట్లలో ఉంటాయి. 


మీరు చేసిన పెద్ద డిపాజిట్లు & వడ్డీ ఆదాయం గురించి మీ ITRలో పద్ధతిగా రిపోర్ట్‌ చేస్తే, ఆదాయ పన్ను విభాగంతో ఏ గొడవా ఉండదు. లేదంటే, పన్ను ఎగవేతకు ప్రయత్నించారన్న అపవాదును భరించాలి. ఇది ఇక్కడితో ఆగిపోదు. ఆదాయ పన్ను విభాగం విధించే భారీ జరిమానాను చెల్లించాల్సి వస్తుంది. కేసు తీవ్రతను బట్టి, కొన్ని ఇంతకంటే వరస్ట్‌ సిట్యుయేషన్‌ ఎదుర్కోవాల్సి రావచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఈ ఒక్క ఫారం నింపండి చాలు - టీడీఎస్‌ కటింగ్‌ తగ్గుతుంది, మీ జీతం పెరుగుతుంది