Form 12BAA Will Reduce TDS Cutting: టీడీఎస్ (Tax Deduction at Source) అనేది ప్రతి ఉద్యోగికి బాగా తెలిసిన బాధాకరమైన పదం. దీనిని తలుచుకున్నప్పుడల్లా వేతనరాయుళ్ల గుండె కలుక్కుమంటుంది. ప్రతి నెలా, జీతం చేతికి రాకముందే అందులో కొంత మొత్తాన్ని టీడీఎస్ తినేస్తుంది. ఫలితంగా.. నెలనెలా తక్కువ జీతాన్ని ఉద్యోగులు డ్రా చేస్తున్నారు. ఇప్పుడు, టీడీఎస్ ఇబ్బందులను నుంచి ఉద్యోగులను తప్పించి, వారి కళ్లలో ఆనందం చూడడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. TDSకు సంబంధించిన నిబంధనలను సవరించింది.
నూతన సవరణల తర్వాత, TDS కోతలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీ కంపెనీ, మీ జీతం నుంచి ముందస్తు పన్ను కోతను గణనీయంగా తగ్గిస్తుంది. అంటే.. మీ జీతం నుంచి టీడీఎస్ కటింగ్ తగ్గుతుంది, గతం కంటే ఎక్కువ జీతం చేతికి వస్తుంది. ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) ప్రకారం, మీరు ఇంకెక్కడైనా TDS లేదా TCS (Tax Collected at Source) చెల్లిస్తుంటే, మీ కంపెనీ మీ జీతం నుంచి పన్ను కోత పెట్టదు.
ఫారం 12BAA జారీ చేసిన CBDT
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT), TDS కటింగ్‌ను తగ్గించేందుకు కొత్త ఫారం "12BAA"ను (Form 12BAA) జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmal Sitharaman), బడ్జెట్‌లో చేసిన ప్రకటన ప్రకారం CBDT ఈ కొత్త ఫామ్‌ను విడుదల చేసింది. ఈ ఫారంలో, మీరు ఇప్పటికే చెల్లించిన TDS & TCS కు సంబంధించిన సమాచారాన్ని మీ కంపెనీకి అందించొచ్చు. ఆ ఫారంలో ఎఫ్‌డీ (Fixed Deposit), ఇన్సూరెన్స్ కమీషన్, ఈక్విటీ షేర్ డివిడెండ్, ఏదైనా వాహనం కొన్నప్పుడు చెల్లించిన పన్ను వంటి వాటి గురించి సమాచారం ఇవ్వొచ్చు.
ఇప్పటి వరకు, ఉద్యోగి ప్రకటించిన పెట్టుబడుల ప్రకారం కంపెనీలు టీడీఎస్‌ను మినహాయించేవి. ఇతర చోట్ల చెల్లించే పన్నులు ఇందులో ఉండవు. ఇప్పుడు ఈ విధానంలో మార్పు వచ్చింది. ఒక ఉద్యోగి ఎక్కడ TCS & TDS చెల్లించినా, వాటి సమాచారం ఇవ్వడం వల్ల జీతంలో తగ్గింపులను అడ్డుకోవచ్చు. దీనివల్ల ఉద్యోగులకు నెలవారీ ఆదాయం పెరుగుతుంది. CBDT అక్టోబర్ 15న ఈ ఫారాన్ని విడుదల చేసినప్పటికీ, ఇది అక్టోబర్ 01 నుంచే అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తారు.
ఫారం 12BBతో పోలిక
ఫారం 12BAA ఫారం 12BB మాదిరిగానే ఉంటుంది. ఫామ్ 12BBలోనూ ఉద్యోగి తన పెట్టుబడుల గురించి వెల్లడిస్తాడు. ఫామ్ 12BBలోని వివరాల ఆధారంగా కంపెనీ అతని జీతం నుంచి TDSను తీసివేస్తుంది. ఫారం 12BAA ప్రయోజనాన్ని పొందడానికి, ఉద్యోగి మొదట పాత పన్ను విధానం (Old Tax Regime) లేదా కొత్త పన్ను విధానంలో (New Tax Regime) ఏదోక దానిని ఎంచుకున్నట్లు కంపెనీకి చెప్పాలి. ఆ తర్వాత, ఫారం 12BAA ద్వారా తన పెట్టుబడుల గురించి సమాచారం ఇవ్వాలి.
మరో ఆసక్తికర కథనం: త్వరలో కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ 3.0 - ఐటీ రిటర్న్ ఫైలింగ్ ఇంకా ఈజీ