Multibagger stocks: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద లాగే ఆయన కంపెనీల్లో షేర్లు కొన్నవారూ అమాంతం కోటీశ్వరులు అవుతున్నారు. కొవిడ్ మహమ్మారితో ఢమాల్ అని పడిపోయిన స్టాక్ మార్కెట్లు రెండేళ్లుగా ఆకాశమే హద్దుగా ఎగిశాయి. ఇదే సమయంలో అదానీకి చెందిన ఆరు కంపెనీల్లో తలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రూ.66.50 లక్షలు చేతికందేవి. ఎందుకంటే అదానీ పవర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్నులు అందించాయి.
అదానీ పవర్: 2020, ఆగస్టు 21న అదానీ పవర్ షేరు ధర రూ.39.15 స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఒక్కో షేరు ధర రూ.410కి చేరుకుంది. అంటే రెండేళ్లలో 10.50 రెట్లు పెరిగింది. అప్పట్లో ఇందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.10.50 లక్షలు వచ్చేవి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: 2020, ఆగస్టు 21న అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ధర రూ.233. ఇప్పుడు ఏకంగా రూ.3,127కు ఎగబాకింది. ఏకంగా 13.40 రెట్లు పెరిగింది. రెండేళ్ల క్రితం ఇందులో రూ.లక్ష పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రూ.13.40 లక్షలు అందుకొనేవాళ్లు.
అదానీ గ్రీన్ ఎనర్జీ: 2020, ఆగస్టు 21న అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో రూ.376 వద్ద ఉంది. ఇప్పుడు రూ.2,422కు చేరుకుంది. రెండేళ్లలో 6.46 రెట్లు పెరిగింది. ఇందులో లక్ష పెట్టుబడికి ఇప్పుడు రూ.6.45 లక్షలు అందేవి.
అదానీ ట్రాన్స్‌మిషన్: 2020, ఆగస్టు 21న అదానీ ట్రాన్స్‌మిషన్ షేరు ధర రూ.272 స్థాయిలో ఉండేది. రెండేళ్లలో ఇది రూ.3,612కు పెరిగింది. ఏకంగా 13.25 రెట్లు వృద్ధి చెందింది. ఇందులో లక్ష పెట్టుబడికి ఇప్పుడు ఏకంగా రూ.13.25 లక్షలు చేతికొచ్చేవి.
అదానీ టోటల్ గ్యాస్: 2020, ఆగస్టు 21న అదానీ టోటల్ గ్యాస్ బీఎస్‌ఈలో రూ.165గా ఉండేది. ఇప్పుడు రూ.3,380కి పెరిగింది. రెండేళ్లలో 20.40 రెట్లు వృద్ధి నమోదు చేసింది. ఇందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రూ.20.40 లక్షలు అందుకొనేవాళ్లు.
అదానీ పోర్ట్స్: 2020, ఆగస్టు 21న అదానీ పోర్ట్స్ షేరు రూ.354గా ఉండేది. రెండేళ్లలో 2.50 రెట్లు పెరిగి రూ.870కి చేరుకుంది. అప్పట్లో ఇందులో రూ.లక్ష పెడితే ఇప్పుడు రూ.2.50 లక్షలు వచ్చేవి.