Sovereign Gold Bond Scheme: సురక్షితమైన పెట్టుబడి సాధనాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త! సార్వభౌమ పసిడి బాండ్ల (Sovereign Gold Bonds) విక్రయం మళ్లీ మొదలవుతోంది. 2022-23 రెండో సిరీసు బాండ్ల సబ్‌స్క్రిప్షన్‌ సోమవారం మొదలై శుక్రవారం ముగుస్తుంది. ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు ఐదు రోజుల వ్యవధి ఉంటుంది. ఒక గ్రాము బంగారం ధర రూ.5,197గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి ఒక్కో గ్రాముపై రూ.50 వరకు రాయితీ లభిస్తుంది. రూ.5147కే వారు పసిడి బాండ్లు సొంతం చేసుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది.


పెట్టుబడి సురక్షితం


డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు బంగారంపై పెట్టుబడి అనువైందిగా ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. ఈక్విటీ మార్కెట్లు పడుతున్నప్పుడూ ఈ విలువైన లోహాన్ని హెడ్జింగ్‌కు ఉపయోగిస్తారు. చాలామంది ఇన్వెస్టర్లు మంచి రాబడి ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి సాధనాలు వెతుకుతుంటారు. ఇక ప్రజలను ఫిజికల్‌ నుంచి డిజిటల్‌ గోల్డు వైపు మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015, నవంబర్లో సార్వభౌమ పసిడి బాండ్ల పథకం తీసుకొచ్చింది. 999 స్వచ్ఛత గల బంగారాన్ని ఇందుకు ప్రామాణికంగా తీసుకొని ధర నిర్ణయిస్తుంది.  మెచ్యూరిటీ తర్వాత అప్పటికి పెరిగిన ధరతో పాటు రెండున్నర శాతం వడ్డీ చెల్లిస్తుంది.


ఎవరు అర్హులు?


కేంద్ర ప్రభుత్వం తరఫున భారతీయ రిజర్వు బ్యాంకు సార్వభౌమ పసిడి బాండ్లను విక్రయిస్తుంది. ఎనిమిదేళ్ల కాల పరిమితితో విడతల వారీగా వీటిని అమ్ముతుంది. మెచ్యూరిటీ తీరాక అప్పటి మార్కెట్‌ ధర చెల్లిస్తుంది. అంతేకాకుండా దానిపై వార్షిక ప్రాతిపదికన 2.5 శాతం వడ్డీని ఇస్తుంది. ప్రతి ఆరు నెలలకు వడ్డీ జమ చేస్తుంది. ఫెమా చట్టం పరిధిలో దేశంలో నివసిస్తున్న భారతీయులంతా సార్వభౌమ పసిడి బాండ్లను కొనుగోలు చేయొచ్చు.


ఎన్ని కిలోలు కొనొచ్చు?


సార్వభౌమ పసిడి బాండ్లలో గ్రాము చొప్పున పెట్టుబడి పెట్టొచ్చు. కనీసం ఒక గ్రాము విలువైన బాండు కొనుగోలు చేయాలి. వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు (HUF) గరిష్ఠంగా నాలుగు కిలోల వరకు ఇన్వెస్టు చేయొచ్చు. ట్రస్టులు, సంస్థలు ఏడాది 20 కేజీల వరకు తీసుకోవచ్చు. ఈ బాండ్ల లాకిన్‌ పిరియడ్‌ ఎనిమిదేళ్లు. అత్యవసరం అనుకుంటే ఐదేళ్ల తర్వాత బయటకు రావొచ్చు. అయితే మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.


కొనుగోలు ఎలా?


పసిడి బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్బీఐ వెబ్‌సైట్‌, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SHCIL) ద్వారా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. ప్రతి కేంద్రంలో బాండ్ల అమ్మకం తేదీ, మెచ్యూరిటీ, ఇతర వివరాలు ఉంటాయి.