Effects of Loan Settlement: నిర్దేశిత కాలపరిమితి లోపే రుణాలు తీర్చేయాలని అందరూ అనుకుంటారు! ఎడతెగని ఇబ్బందులతో కొన్నిసార్లు అలా కట్టలేకపోవచ్చు. కరోనా, ఉద్యోగం పోవడం, ప్రమాదానికి గురవ్వడం వంటి విపత్తులతో గడువు తీరినా అప్పు తీర్చే స్తోమత ఉండదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చాలామంది ఎంచుకొనే ఆప్షన్‌ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌. కానీ దీనివల్ల అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడే!!


సెటిల్‌మెంట్‌కు వెళ్లిన విశ్వ


ఉదాహరణకు ఐదేళ్ల కాల పరిమితితో విశ్వ రూ.5 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం! మూడేళ్ల పాటు క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించారు. హఠాత్తుగా కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఆరు నెలల వరకు ఉద్యోగానికి వెళ్లే పరిస్థితి లేదు. ఈ సమయంలో ఆదా చేసుకున్న డబ్బులన్నీ ఇంటి ఖర్చులకే సరిపోయాయి. ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆమె బ్యాంకు అధికారుల్ని సంప్రదించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ను (Loan Settlement) ఆఫర్‌ చేశారు. తక్కువ డబ్బుతోనే రుణం తీరిపోతుందని విశ్వ సంతోషించారు. రోజులు గడిచాయి. జీవితం సాధారణ స్థితికి చేరుకోవడంతో లోన్‌ తీసుకొని కారు కొందామని అనుకున్నారు. బ్యాంకుకు వెళ్లాక లోన్‌ నిరాకరించడంతో షాకవ్వడం ఆమె వంతైంది.


ఏడేళ్ల వరకు రికార్డు


వన్‌టైమ్‌ సెటిల్‌మెంటు మరో కొత్త రుణానికి నడుమ చాలా ప్రాసెస్‌ జరుగుతుంది. కస్టమర్ పరిస్థితిని అర్థం చేసుకొని ఎంతో కొంత కట్టించుకున్న బ్యాంకు ఆ రుణాన్ని పుస్తకాల నుంచి తొలగిస్తుంది. అంటే రైటాఫ్‌ చేస్తుంది. ఆ తర్వాత లోన్‌ క్లోజ్‌ (Loan Close) అవ్వలేదని సెటిల్‌ చేసుకున్నారని బ్యాంకు అధికారులు సిబిల్‌కు (Cibil) తెలియజేస్తారు. ఆ సంస్థ దీనిని లావాదేవీగా గుర్తించదు. ఫలితంగా కస్టమర్‌ సిబిల్‌ స్కోరు (Cibil Score) 75-100 పాయింట్ల మేర పడిపోతుంది. ఏడేళ్ల వరకు సిబిల్‌ ఈ రికార్డును భద్రపరుస్తుంది. ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వాలంటే చూసేది సిబిల్‌ స్కోరు, కస్టమర్‌ క్రెడిట్‌ బిహేవియర్‌. సెటిల్‌మెంట్‌ సమయంలో ఈ రెండు అంశాల్లో నెగెటివ్‌ రిమార్క్‌ పడుతుంది. అందుకే బ్యాంకులు రుణాల్ని నిరాకరిస్తాయి. 


ఏం చేయాలి?


ఇలాంటి పరిస్థితుల్లో లోన్‌ సెటిల్‌మెంట్‌ను చివరి అవకాశంగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రుణం తీర్చలేని పరిస్థితే ఎదురైతే మీ పోర్టుపోలియోలోని ఆస్తుల్లో కొంత భాగం అమ్మి డబ్బు కట్టడం మంచిది. లేదంటే మిత్రులు లేదా బంధువుల సాయం కోరవచ్చు. అదీ కుదరని పక్షంలో లోన్‌ గడువును పెంచాలని బ్యాంకు అధికారులను కోరాలని నిపుణులు అంటున్నారు. వడ్డీ మినహాయించి అసలు తీర్చేందుకు అవకాశమివ్వాలని కోరినా ఫర్వాలేదు. ఇందులో ఏవీ జరగకపోతేనే వన్‌టైమ్‌ సెటిల్‌మెంటుకు వెళ్లాలని విశ్లేషకులు చెబుతున్నారు. సెటిల్‌మెంటు పూర్తవ్వగానే సిబిల్‌ స్కోరు ఎలా ఉందో తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ స్కోరు తగ్గితే పెంచుకొనేందుకు 12-24 నెలల పాటు కష్టపడాల్సి ఉంటుందని చెప్తున్నారు.