LIC New Jeevan Shanti Policy Details in Telugu: ప్రతి తెలివైన వ్యక్తి, తాను డబ్బు సంపాదించే కాలంతో పాటు సంపాదించలేని కాలం (Retirement/Old Age) కోసం కూడా మొదట్నుంచే ప్లాన్ చేస్తాడు. సాధారణంగా, మన దేశంలో ఎక్కువ మంది ప్రజల ఆదాయం వాళ్లకు 60 ఏళ్లు వచ్చే సరికి ఆగిపోతోంది. ఆదాయం రాకపోయినా, నెలనెలా కుటుంబ ఖర్చులు మాత్రం వచ్చి పడుతూనే ఉంటాయి. ముందస్తు వ్యూహం లేకపోతే, అటువంటి పరిస్థితిలో చాలా గడ్డు సమస్యలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇప్పట్నుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, వృద్ధాప్యంలో ఆర్థిక పరిస్థితి గురించి బెంగ ఉండదు.
దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వివిధ రకాల బీమా పాలసీలను (Insurance policy) తీసుకొస్తోంది. వాటిలో ఒకటి ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీ (LIC New Jeevan Shanti Policy). ఈ పాలసీ తీసుకుంటే... జీవితాంతం నెలనెలా పింఛను అందుకోవచ్చు.
ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీ పూర్తి వివరాలు:
LIC తీసుకొచ్చిన న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సింగిల్ ప్రీమియం, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ కాబట్టి, ప్రీమియం మొత్తాన్ని ఒకే దఫాలో చెల్లించాలి.
ఈ పాలసీలో రెండు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ (Investment Options) ఉన్నాయి. మొదటిది.. ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్. రెండోది... డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్.
ఇంటర్మీడియట్ పెన్షన్ (Immediate Pension) ఆప్షన్‌లో... పాలసీదారు ప్రీమియం చెల్లించిన వెంటనే పింఛను రావడం స్టార్ట్ అవుతుంది. తాను ఎంచుకున్న పెన్షన్ మోడ్ ఆధారంగా నెలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు.
డిఫర్డ్ పెన్షన్ (Deferred Pension) ఆప్షన్‌లో... పెన్షన్ ప్లాన్ కొన్న కొంతకాలం తర్వాత నుంచి పెన్షన్ తీసుకుంటారు. పాలసీ తీసుకున్న తర్వాత 2, 4, 8, 12 సంవత్సరాల తర్వాతి నుంచి పింఛను సౌకర్యం ప్రారంభం అవుతుంది. ఈ ఆప్షన్‌లోనూ నెలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు.
- న్యూ జీవన్ శాంతి ప్లాన్ కొనుగోలుకు కనీస మొత్తం - 1.50 లక్షలు
- గరిష్ట మొత్తం - పరిమితి లేదు
- కనీస వయస్సు - 30 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు - 79 సంవత్సరాలు
- రూ.1.5 లక్షల పెట్టుబడిపై ఏటా రూ. 1,000 పింఛను
ఈ పాలసీని తీసుకున్న తర్వాత, పాలసీదారుకు అవసరం లేదనుకుంటే సరెండర్ (Policy Surrender) చేయవచ్చు. న్యూ జీవన్ శాంతి పాలసీ మీద రుణ సౌకర్యం (Loan facility on New Jeevan Shanti Policy) అందుబాటులో ఉంది.
న్యూ జీవన్ శాంతి ప్లాన్‌లో సింగిల్ & జాయింట్ లైఫ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సింగిల్ లైఫ్ ప్లాన్ తీసుకుంటే, పాలసీదారు మాత్రమే పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతాడు. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే, డిపాజిట్ మొత్తాన్ని నామినీకి ఇస్తారు.
న్యూ జీవన్ శాంతి పాలసీ జాయింట్ లైఫ్ ఆప్షన్ తీసుకుంటే, దురదృష్టవశాత్తు మొదటి పాలసీదారు మరణిస్తే, రెండో వ్యక్తి జీవితాంతం పింఛను వస్తుంది. ఇద్దరూ చనిపోతే, డిపాజిట్ చేసిన మొత్తాన్ని నామినీకి ఎల్‌ఐసీ అందిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: పర్సనల్ లోన్ మీద తక్కువ వడ్డీ తీసుకుంటున్న టాప్-10 బ్యాంకులు ఇవి