Sovereign Gold Bonds Subscription: బంగారంలో పెట్టుబడి పెట్టే మంచి ఛాన్స్‌ చివరి దశలో ఉంది. గత సోమవారం (18 డిసెంబర్‌ 2023) ప్రారంభమైన సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడానికి ఈ రోజు (శుక్రవారం, 22 డిసెంబర్‌ 2023) లాస్ట్‌ డేట్‌.


2023-24 సిరీస్‌లో థర్డ్‌ ఇష్యూ (Sovereign Gold Bonds 2023-24 Series III) ఇది. ప్రస్తుతం, బంగారం ధర పెరిగే మూడ్‌లో ఉంది కాబట్టి, ఈ ఆఫర్‌ను మిస్‌ చేసుకుంటే బంగారు గుడ్లు పెట్టే బాతును చేతులారా వదిలేసిట్లే అవుతుందన్నది మార్కెట్‌ నిపుణుల మాట.


సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు. సావరిన్ గోల్డ్ బాండ్‌ అనేది డిజిటల్‌ బంగారం. భౌతికంగా కనిపించదు. కేంద్ర ప్రభుత్వం తరపున RBI వీటిని జారీ చేస్తుంది. 


సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ వివరాలు (Sovereign Gold Bonds Details):


ఒక్కో సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధరను రూ. 6199 ‍‌(SGB Issue Price) గా రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయించింది. ఈ గోల్డ్ బాండ్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. డిజిటల్‌ పేమెంట్ చేసే వారికి, రూ.50 తగ్గింపుతో ఒక్కో బాండ్ రూ.6,149 కే లభిస్తుంది. 


ఒక సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ ఒక గ్రాము బంగారానికి సమానం. మీరు ఎన్ని బాండ్లు తీసుకుంటే అన్ని గ్రాముల బంగారం కొన్నట్లు లెక్క. 


కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న పథకం కాబట్టి, సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడి పెట్టే డబ్బు ఫుల్‌ సేఫ్‌గా ఉంటుంది. పెట్టుబడిపై లభించే రాబడికి కూడా గ్యారెంటీ ఉంటుంది. బంగారం ధర పెరుగుతున్న కొద్దీ పెట్టుబడి విలువ పెరుగుతుంది. దీంతోపాటు, SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో ‍‌(SGB Coupon Rate) వడ్డీ చెల్లిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ చేయవచ్చు, బ్యాంక్‌ తనఖా పెట్టి అప్పు కూడా తీసుకోవచ్చు. భౌతిక బంగారం కొనుగోలులో వర్తించే మేకింగ్‌, జీఎస్టీ వంటి అదనపు భారం గోల్డ్‌ బాండ్లకు ఉండవు. 


SGBలను షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SHCIL)‍, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCIL), గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా కొనొచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్‌ ఉండదు. భారతదేశ పౌరులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక గార్డియన్‌ వీటిని కొనొచ్చు.


ఈ స్కీమ్‌ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని (1 బాండ్‌) కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో.. వ్యక్తులు (individuals), HUFలు (Hindu Undivided Family) గరిష్టంగా 4 కిలోల బంగారం కోసం పెట్టుబడి పెట్టొచ్చు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలు గరిష్టంగా 20 కిలోల వరకు కొనుగోలు చేయవచ్చు.


బాండ్ మెచ్యూరిటీ టైమ్‌ ఎనిమిదేళ్లు ఉంటుంది. ఈ 8 సంవత్సరాల వరకు బాండ్లను కదల్చకుండా కంటిన్యూ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో వచ్చే వడ్డీ ఆదాయంపై టాక్స్‌ కట్టక్కర్లేదు. బాండ్ హోల్డర్‌ కోరుకుంటే, 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్‌ చేసుకోవచ్చు. ఆ రోజున ఉన్న బంగారం రేటుతో పాటు, 2.5% చొప్పున అప్పటి వరకు జమ అయిన వడ్డీ మొత్తం పెట్టుబడిదారుకు లభిస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: సీనియర్‌ సిటిజన్లకు నమ్మకంగా 9 శాతం పైగా వడ్డీ ఆదాయం, వేరే చోట రిస్క్‌ చేయడం ఎందుకు?