LIC New Policy: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC), 'ఎల్‌ఐసీ జీవన్ కిరణ్' పేరిట ఈ ఏడాది జులై 27న కొత్త పాలసీని ప్రారంభించింది. ఇది ఒక టర్మ్‌ ప్లాన్‌. అయితే, సంప్రదాయ టర్మ్‌ పాలసీలను మించి ఇది పని చేస్తుంది.


సాధారణ టర్మ్‌ పాలసీల్లో.... పాలసీ నడుస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు పాలసీహోల్డర్‌ మరణిస్తే, ఆ కుటుంబానికి కవరేజ్‌ డబ్బు అందుతుంది. అదృష్టవశాత్తు ఏమీ జరక్కపోతే, కట్టిన డబ్బు తిరిగి రాదు. 


మెచ్యూరిటీ బెనిఫిట్స్‌
ఎల్‌ఐసీ జీవన్ కిరణ్‌లో... పాలసీహోల్డర్‌ మరణిస్తే డెత్‌ బెనిఫిట్స్‌ ఇస్తారు. పాలసీహోల్డర్‌కు ఏమీ కాకపోతే, అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. పాలసీ అమల్లో ఉన్నప్పుడు LICకి అందిన ప్రీమియం మొత్తాల నుంచి అదనపు ప్రీమియం, రైడర్ ప్రీమియం, పన్నులు వంటివి తీసేసి మిగిలిన డబ్బును "మెచ్యూరిటీపై లభించే హామీ మొత్తం"గా (Sum Assured on Maturity) పాలసీహోల్డర్‌కు తిరిగి ఇస్తారు.


ఈ స్కీమ్‌లో.. పొగ తాగే అలవాటున్న, పొగ తాగని వాళ్ల కోసం వేర్వేరు ప్రీమియం రేట్లు ఉన్నాయి. పొగ తాగే అలవాటు లేని వాళ్లు చాలా తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ప్రీమియం మొత్తాన్ని సింగిల్‌ పేమెంట్‌ లేదా రెగ్యులర్‌ పేమెంట్స్‌లో ఎలాగైనా చెల్లించవచ్చు.


రెగ్యులర్‌ పద్ధతి/ఇన్‌స్టాల్‌మెంట్స్‌ రూపంలో ప్రీమియం చెల్లిస్తూ, పాలసీ సమయంలో పాలసీహోల్డర్‌ మరణిస్తే... ప్రాథమిక హమీ మొత్తం (Basic Sum Assured) లేదా వార్షిక ప్రీమియానికి ఏడు రెట్ల మొత్తం లేదా అప్పటి వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం, ఏది ఎక్కువైతే దానిని పాలసీహోల్డర్‌ కుటుంబానికి చెల్లిస్తారు. దీనిని "మరణంపై హామీ మొత్తం"గా (Sum Assured on Death) పిలుస్తారు.


సింగిల్ ప్రీమియం చెల్లించి, పాలసీ సమయంలో పాలసీ హోల్డర్‌ మరణిస్తే... సింగిల్ ప్రీమియంలో 125% లేదా ప్రాథమిక హామీ మొత్తంలో ఏది ఎక్కువైతే దానిని చెల్లిస్తారు. ఈ ప్లాన్‌ ప్రారంభమైన మొదటి సంవత్సరంలో ఆత్మహత్య మినహా అన్ని రకాల మరణాలు పాలసీ కవరేజ్‌లోకి వస్తాయి. రెండో సంవత్సరం నుంచి ఆత్మహత్య కూడా కవరేజ్‌లోకి వస్తుంది.


డెత్ బెనిఫిట్స్ ఆప్షన్స్‌
డెత్‌ బెనిఫిట్‌ కింద లభించే మొత్తం డబ్బును ఏకమొత్తంగా నామినీకి చెల్లిస్తారు. లేదా, ఇన్‌స్టాల్‌మెంట్స్‌ పద్ధతిలోనూ తీసుకోవచ్చు. యాక్టివ్ ఇన్సూరెన్స్ కింద, డెత్ బెనిఫిట్‌ను ఒకేసారి కాకుండా ఐదు సమాన వాయిదాల్లో పొందే ఆప్షన్‌ కూడా ఉంది. ఏడాదికి, ఆరు నెలలకు, మూడు నెలలకు, ప్రతి నెలా వంటి ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.


ఈ పాలసీలో కనీస ప్రాథమిక హామీ మొత్తంగా 15 లక్షల రూపాయలు లభిస్తాయి. గరిష్ట ప్రాథమిక హామీ మొత్తానికి పరిమితి లేదు. గృహిణులు, గర్భిణులకు ఈ ప్లాన్ తీసుకోవడానికి అనుమతి లేదు. ఉద్యోగం చేస్తున్న మహిళలు, డెలివెరీ అయిన ఆరు నెలల తర్వాత ఈ ప్లాన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. కొవిడ్-19 టీకాలను పూర్తి స్థాయిలో తీసుకోకపోతే పాలసీ షరతులు పెరుగుతాయి. ఈ పాలసీ కనిష్ట వ్యవధి 10 సంవత్సరాలు, గరిష్ట వ్యవధి 40 సంవత్సరాలు.


ప్రీమియం పేమెంట్స్‌
ప్రీమియంలను సంవత్సరానికి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా సింగిల్ ప్రీమియంలో చెల్లించవచ్చు. నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అమెక్స్ కార్డ్, UPI, IMPS, ఈ-వాలెట్‌ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: 75 పైసలకు కక్కుర్తి పడి లక్ష రూపాయలు వదిలించుకున్న ITC, ఇది 'ఒక బిస్కట్‌' కథ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial