Kotak Mahindra Bank Interest Rates: ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన కోటక్ మహీంద్ర బ్యాంక్, తాను మంజూరు చేసే చాలా రకాల రుణాలపై MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్‌) పెంచింది. దీంతో, కోటక్ మహీంద్ర బ్యాంక్ నుంచి రుణాలు తీసుకునే ఖాతాదార్లకు రుణ ఖర్చు పెరుగుతుంది, అప్పులు మరింత ఖరీదుగా మారతాయి. వివిధ కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్‌ పాయింట్లు (bps) లేదా 0.10 శాతం పెంచింది.


కోటక్ మహీంద్ర బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు:
కోటక్ మహీంద్ర బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, వడ్డీ రేట్ల పెంపు తర్వాత, వివిధ కాల పరిమితి కలిగిన రుణాల రేట్లు 8.35 శాతం నుంచి 9.35 శాతం వరకు ఉంటాయి. పెరిగిన రేట్లు నిన్నటి (16 మే 2023) నుంచి అమల్లోకి వచ్చాయి. 


MCLR అంటే ఏంటి?
బ్యాంక్‌ వ్యయాల ఆధారంగా నిర్ణయించే రుణ వడ్డీ రేటును MCLR అని పిలుస్తారు. ఇప్పుడు అన్ని బ్యాంక్‌లు MCLR రూట్‌లోనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. MCLR రేటును ఫిక్స్‌ చేసిన తర్వాత, అదే కనీస రేటుగా బ్యాంక్‌ భావిస్తుంది, అంతకంటే తక్కువ వడ్డీకి రుణాన్ని మంజూరు చేయదు. వాణిజ్య బ్యాంకులకు రుణ రేట్లను నిర్ణయించడానికి గతంలో బేస్ రేట్‌ విధానాన్ని ఫాలో అయ్యేవి. ఆ బేస్‌ రేట్‌ పద్ధతిని MCLR భర్తీ చేసింది. రుణాల వడ్డీ రేట్లను నిర్ణయించడానికి 1 ఏప్రిల్ 2016న MCLRని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) అమల్లోకి తీసుకువచ్చింది.


కోటక్ మహీంద్ర బ్యాంక్‌తో పాటు, ఇటీవల మరికొన్ని బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను మార్చాయి.


ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda Interest Rates), ఫిబ్రవరిలో తన రుణ రేట్లను 5 బేసిస్ పాయింట్లు లేదా 0.05 శాతం పెంచింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank Interest Rates) కూడా తన MCLR ఆధారిత లోన్ రేటును 15 బేసిస్‌ పాయింట్లు లేదా 0.15 శాతం పెంచింది. ఏప్రిల్‌లో, సౌత్ ఇండియన్ బ్యాంక్ (South Indian Bank Interest Rates) తన రుణ రేట్లను 5-10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.


రిజర్వ్‌ బ్యాంక్‌, గత ఆర్థిక సంవత్సరంలో 2022 మే నెల నుంచి స్టార్‌ చేసిన రెపో రేటు పెంపు చక్రం ఆ ఆర్థిక సంవత్సరం మొత్తం తిరుగుతూనే ఉంది. మొత్తంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెపో రేటను 250 బేసిస్‌ పాయింట్లు లేదా 2.5 శాతం పెంచింది. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 6.50 శాతంగా కొనసాగుతోంది. రెపో రేటు పెరుగుదల ప్రారంభమైనప్పటి నుంచి, దేశంలోని అన్ని బ్యాంకులు కూడా ఆ ప్రభావాన్ని ఖాతాదారులపైకి నెట్టడం ప్రారంభించాయి.


జూన్ 6-8 తేదీల్లో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం 
వచ్చే నెల (జూన్) 6-8 తేదీల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC) సమావేశం ఉంది. జూన్ 8న, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), MPC నిర్ణయాలను ప్రకటిస్తారు. దేశంలో ద్రవ్యోల్బణం రేటు బాగా తగ్గింది కాబట్టి, పాలసీ రేట్లను ఈసారి కూడా యథాతథంగా ఉంచవచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోంది. ఇంతకుముందు, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన  MPC భేటీలోనూ రెపో రేటును RBI పెంచలేదు, 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.


రెపో రేటు 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గవచ్చు!
రిటైల్ ద్రవ్యోల్బణంలో ఇకపై కూడా తగ్గుదల కొనసాగితే, ఈ ఏడాది ఆగస్టు నెలలో జరిగే భేటీలో పాలసీ రేట్లను తగ్గిస్తూ RBI MPC నిర్ణయం తీసుకోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తే, ఆగస్టు నెల నుంచి 2023 చివరి వరకు రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించవచ్చని నోమురా హోల్డింగ్స్ తెలిపింది. ఈ బ్రోకరేజ్‌ అంచనా ప్రకారం, రెపో రేటు 6.50 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గివచ్చు.