Interest Rate Cut: గత ఐదు రోజుల్లో, మన దేశంలో ఏప్రిల్‌ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం (CPI inflation), టోకు ద్రవ్యోల్బణం (WPI inflation) గణాంకాలు వచ్చాయి. చిల్లర ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయికి, 4.70 శాతానికి తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో నమోదైన 7.79 శాతం నుంచి భారీగా దిగి వచ్చింది. దేశంలో ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో చిల్లర ద్రవ్యోల్బణం తగ్గింది. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యిత స్థాయికి (6 శాతం) దిగువనే నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం రేటు కూడా 34 నెలల కనిష్ట స్థాయికి (-)0.92 శాతానికి తగ్గింది. ఆహారం, ఇంధనం, తయారీ వస్తువుల రేట్లు తగ్గడం దీనికి కారణం. గత 11 నెలలుగా టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూనే ఉంది.


భారంగా మారిన EMIల నుంచి ఉపశమనం లభిస్తుందా?
దేశంలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడానికి, గత ఆర్థిక సంవత్సరంలో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తన రెపో రేటును పెంచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో 4 శాతం నుంచి 6.50 శాతానికి, మొత్తం 250 బేసిస్‌ పాయింట్లు వడ్డీ రేట్లను పెంచింది. దీంతో హోమ్‌ లోన్‌ సహా చాలా రుణ రేట్లు పెరిగాయి. EMIలు పెను భారంగా మారాయి. ఇప్పుడు, ద్రవ్యోల్బణం రేటు సాధారణ స్థాయికి తగ్గడంతో, రెపో రేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఇక పెంచదన్న అంచనాలు ఉన్నాయి. తద్వారా, 
EMIలు మరింత భారంగా మారకుండా ఉపశమనం లభిస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC) సమావేశం వచ్చే నెల (2023 జూన్) 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. జూన్ 8న, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), MPC నిర్ణయాలను ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణం రేటు బాగా తగ్గింది కాబట్టి, పాలసీ రేట్లను ఈసారి కూడా యథాతథంగా ఉంచవచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోంది. ఇంతకుముందు, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన  MPC భేటీలోనూ రెపో రేటును RBI పెంచలేదు, 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.


రెపో రేటు 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గవచ్చు!
రిటైల్ ద్రవ్యోల్బణంలో ఇకపై కూడా తగ్గుదల కొనసాగితే, ఈ ఏడాది ఆగస్టు నెలలో జరిగే భేటీలో పాలసీ రేట్లను తగ్గిస్తూ RBI MPC నిర్ణయం తీసుకోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తే, ఆగస్టు నెల నుంచి 2023 చివరి వరకు రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించవచ్చని నోమురా హోల్డింగ్స్ తెలిపింది. ఈ బ్రోకరేజ్‌ అంచనా ప్రకారం, రెపో రేటు 6.50 శాతం నుంచి 5.75 శాతానికి తగ్గివచ్చు.


రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలపై ఇటీవల మాట్లాడిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ద్రవ్య విధానం సరైన దిశలోనే ఉన్నట్లు అర్ధం అవుతోందని అన్నారు. అయితే, ద్రవ్య విధానంపై ఆర్‌బీఐ వైఖరిని చెప్పడానికి ఆయన నిరాకరించారు. అయితే, RBI రెపో రేటును తగ్గిస్తుందని, ఖరీదైన EMI నుంచి ఊరట లభిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు.


ఇది కూడా చదవండి: సొంత కుటుంబ సభ్యుల నుంచి బహుమతి తీసుకున్నా పన్ను కట్టాలా, రూల్స్‌ ఏం చెబుతున్నాయి?