Income Tax Rules on Gifts: పండుగలు, ఉత్సవాలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజులు ఇలా ప్రతి సంతోషకరమైన సందర్భంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. పేదవాడి నుంచి పెద్దవాడి వరకు, ఎవరి స్థోమతకు తగ్గట్లు వాళ్లు బహుమతులను ఇస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఖరీదైన బహుమతులు తీసుకున్నప్పుడు, వాటిపై ఆదాయ పన్ను కట్టాలా అనే ప్రశ్న ప్రజల మనస్సుల్లో ఉంటుంది. భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చున్నప్పుడు లేదా. కుటుంబ సభ్యులకు బహుమతులు ఇచ్చినప్పుడు ఈ సంశయం మెదడును గందరగోళ పరుస్తుంది. 


ఒక వ్యక్తి (Indivual) లేదా హిందు అవిభాజ్య కుటుంబం (HUF) స్వీకరించే బహుమతులపై వర్తించే పన్ను విషయంలో ఆదాయ పన్ను విభాగం కొన్ని నిబంధనలు (IT Rules on Gifts) రూపొందించింది. ఐటీ డిపార్ట్‌మెంట్ సర్క్యులర్ ప్రకారం, వేడుకల సందర్భంగా ఒక వ్యక్తి స్వీకరించిన నగదు లేదా చరాస్తి లేదా స్థిరాస్తిని బహుమతిగా పరిగణిస్తారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బహుమతుల రూపంలో పొందే చరాస్తులు, స్థిరాస్తులు ఈ వర్గంలోకి వస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 దాటిన బహుమతి మొత్తం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. 


అయితే, ఒక కుటుంబంలోని సభ్యుడు లేదా సమీప బంధువు చర లేదా స్థిరాస్తిని బహుమతిగా ఇస్తే, దాని విలువ రూ. 50,000 కంటే ఎక్కువ ఉన్నా దానిపై ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.


ఆదాయ పన్ను విభాగం ప్రకారం, కుటుంబ సభ్యుడు లేదా సమీప బంధువు అంటే ఎవరు?                      


బహుమతి అందుకున్న వ్యక్తి జీవిత భాగస్వామి. అంటే, భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటే దానిపై పన్ను విధించరు.
బహుమతి అందుకున్న వ్యక్తి సోదరుడు లేదా సోదరి. అంటే, తోడబుట్టినవాళ్లు బహుమతులు ఇస్తే దానిపై ఆదాయ పన్ను కట్టక్కర్లేదు.
బహుమతి అందుకున్న వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరికైనా సోదరుడు సేజా సోదరి. అంటే, మేనత్త లేదా మేనమామ నుంచి వచ్చే బహుమతులపై పన్ను ఉండదు.
బహుమతి అందుకున్న వ్యక్తి జీవిత భాగస్వామికి సోదరుడు లేదా సోదరి. అంటే, భార్య లేదా భర్తకు తోడబుట్టినవాళ్లు. వీళ్లు ఇచ్చే బహుమతిలపైనా పన్ను కట్టక్కర్లేదు.
భార్యాభర్తల వారసులు కూడా ఏదైనా బహుమతి ఇస్తే, దానిపై పన్ను విధించరు.


సందర్భాన్ని బట్టి పన్ను తీరు మారుతుంది               
ఒక వ్యక్తికి. తన వివాహం సందర్భంగా వచ్చే బహుమతులపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆదాయ పన్ను విభాగం స్పష్టంగా చెబుతోంది. అయితే, పెళ్లి సందర్భం కాకుండా వేరే సందర్భంలో బహుమతులు తీసుకుంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో అలాంటి బహుమతుల విలువ రూ. 50,000 దాటితే పన్ను చెల్లించాలి. అంటే, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం, ఇతర పండుగ సమయాల్లో అందుకున్న బహుమతులపై పన్ను కట్టాల్సి ఉంటుందని ఆదాయ పన్ను విభాగం తన సర్క్యులర్‌లో పేర్కొంది.


ఇది కూడా చదవండి: పడిపోయిన పసిడి రేటు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలివి