EPF Withdraw: ఉద్యోగులు, కార్మికుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అమలు చేస్తున్న ప్రసిద్ధ పొదుపు పథకం EPF. భారత ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ సంస్థ పని చేస్తుంది. ఈ పథకం కింద, ఒక ఉద్యోగి తన జీతంలోని బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ (DA) మొత్తంలో 12% వాటాను EPFకి జమ చేస్తాడు. ఆ సంస్థ యజమాన్యం కూడా అంతే మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తుంది. ప్రస్తుతం, EPF డిపాజిట్లపై 8.1% వార్షిక వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ రేటు మారుతుంది.
ఏదైనా కారణం వల్ల ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణిస్తే, EPF ఖాతాలోని మొత్తం అతని కుటుంబానికి ఉపయోగపడుతుంది. EPF అకౌంట్‌లో నామినీగా నమోదైన వ్యక్తి, ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని ఉపసంహరించుకుంటారు.
నామినీ లేకపోతే ఏం చేయాలి?
ఒకవేళ EPF ఖాతాలో నామిని పేరు జత చేయకుండానే సదరు ఉద్యోగి మరణిస్తే, ఆ డబ్బును కుటుంబ సభ్యుడు లేదా చట్టబద్ధమైన వారసుడు ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం ఫారం-20 ఉపయోగపడుతుంది.
EPF సభ్యుడు మరణిస్తే, ఖాతాలో ఉన్న డబ్బును ఎలా తీసుకోవాలి?
EPF సభ్యుడు, అతని వారసుడికి సంబంధించిన అన్ని అవసరమైన వివరాలతో ఫారం-20ని పూరించండి.
EPF సభ్యుడు/ సభ్యురాలు చివరిగా ఉద్యోగం చేసిన యజమాని ద్వారా ఈ ఫారం సమర్పించాలి.
EPFIndia వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫారం ద్వారా క్లెయిమ్ చేస్తే, అన్ని పేజీలపై చట్టబద్ధమైన వారసుడు, కంపెనీ యజమాని సంతకం చేయాలి.
అన్ని వివరాలను నింపిన ఫారాన్ని EPFOకు సమర్పించాలి.
ఫారం సమర్పించిన తర్వాత, అప్లికేషన్ స్టేటస్ గురించి SMS అలెర్ట్ ద్వారా సమాచారం అందుతుంది. EPFO వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు.
మొత్తం ప్రక్రియ సజావుగా పూర్తయిన తర్వాత, డబ్బు నేరుగా చట్టపరమైన వారసుడి బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది.
ఇది కూడా చదవండి: ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు సరిగ్గా సంవత్సరం - ₹2.5 లక్షల కోట్ల షాక్, బలిపశువులు రిటైల్ ఇన్వెస్టర్లు
ఫారం-20 నింపడానికి అవసరమైన పత్రాలు:
EPF సభ్యుడి మరణ ధృవీకరణ పత్రం
చట్టబద్ధమైన వారసుడి ధృవీకరణ పత్రం
ఖాళీ లేదా రద్దు చేసిన బ్యాంక్ చెక్
ఫారం 5(IF)ని పూరించడం ద్వారా డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. EPF సభ్యుడు సర్వీసులో ఉండగా మరణిస్తేనే ఇలా చేయాలి.
ఇది కాకుండా, సభ్యుడు పనిచేస్తున్న సంస్థ EDLI పథకం పరిధిలో ఉండాలి.
సభ్యుడు 58 సంవత్సరాల తర్వాత మరణించి, అప్పటి వరకు అతను 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయనట్లయితే, ఇలాంటి సందర్భంలో నగదు ఉపసంహరణ కోసం ఫారం 10C నింపాలి.
ఇది కూడా చదవండి: సొంత కుటుంబ సభ్యుల నుంచి బహుమతి తీసుకున్నా పన్ను కట్టాలా, రూల్స్ ఏం చెబుతున్నాయి?