ITR E-Verification: ఆదాయపు పన్నుకు సంబంధించిన ఒక అప్‌డేట్‌ తెరపైకి వచ్చింది. ఈ-వెరిఫికేషన్ కోసం వేలాది కేసులను ఆదాయపు పన్ను విభాగం ఎంపిక చేసింది. దీనిపై ఆయా పన్ను చెల్లింపుదార్లకు నోటీసులు పంపి, సమాధానం చెప్పాలని కోరింది. ఇది పన్ను చెల్లింపుదార్లలో ఆందోళనను పెంచింది. ఈ నేపథ్యంలో, ఈ-వెరిఫికేషన్ అంటే ఏంటి, ఈ విషయంలో వచ్చిన నోటీసు గురించి ఏం చేయాలో తెలుసుకోవడం ముఖ్యం.


2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ-వెరిఫికేషన్ కోసం 68,000 కేసులను ఆదాయపు పన్ను విభాగం ఎంపిక చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్‌లో (ITR) ఆదాయాన్ని దాచిపెట్టడం లేదా తక్కువ చేసి చూపించారని కనుగొంది. వార్షిక సమాచార నివేదికకు (Annual Information Statement - AIS), సమర్పించిన ఐటీఆర్‌కు పొంతన కుదరలేదని నిర్ధరించింది. వ్యక్తిగత, కార్పొరేట్ రెండు విభాగాల్లోనూ ఈ కేసులు తేలాయి. పన్ను చెల్లింపుదారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని ఖాతాలు AISలో ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లు, షేర్ల కొనుగోలు, అమ్మకం వంటి అంశాలన్నీ ఇందులో కనిపిస్తాయి.


స్పందించకుంటే చర్య తీసుకునే అవకాశం
ఈ-వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసిన 68,000 కేసులలో దాదాపు 56 శాతం అంటే 35,000 కేసుల్లో, పన్ను చెల్లింపుదార్లు ఆదాయ పన్ను విభాగం నోటీసులకు ప్రతిస్పందించారు లేదా నవీకరించిన రిటర్న్‌లను (Updated ITR) దాఖలు చేశారు. మిగిలిన 33,000 కేసుల్లో స్పందన లేదు. FY2019-20 నోటీసులకు సంబంధించి, పన్ను చెల్లింపుదార్లు మార్చి 31, 2023లోపు అప్‌డేటెడ్‌ రిటర్న్ ఫైల్ చేయకున్నా, లేదా నోటీసుకు స్పందించకపోయినా ఆదాయపు పన్ను విభాగం చర్య తీసుకోవచ్చు. ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది అప్‌డేటెడ్‌ రిటర్న్‌లు దాఖలు చేయగా, వారి నుంచి రూ. 1,250 కోట్ల పన్ను అందింది.


ఈ-వెరిఫికేషన్ స్కీమ్‌ 2021 ఉద్దేశ్యం ఆర్థిక సంస్థల నుంచి స్వీకరించిన సమాచారంతో పన్ను చెల్లింపుదార్లు ITR ద్వారా అందించిన సమాచారాన్ని సరిపోల్చడం. ఆర్థిక లావాదేవీల్లో అసమతౌల్యం కనుగొంటే, కంప్లైయన్స్‌ పోర్టల్ (compliance portal) ద్వారా ఎలక్ట్రానిక్‌ రూపంలో పన్ను చెల్లింపుదార్లకు సెక్షన్ 133(6) కింద నోటీసు పంపుతారు. ఫైల్‌ చేసిన రిటర్న్‌లో సంబంధిత లావాదేవీ లేదా లావాదేవీలను చూపనందుకు వివరణ లేదా రుజువు కోరతారు. పన్ను చెల్లింపుదారు కంప్లైయెన్స్ పోర్టల్‌లోనే సమాధానం చెప్పాలి. దీనికి డిపార్ట్‌మెంట్ సంతృప్తి చెందుతుంది లేదా రిటర్న్‌ను అప్‌డేట్ చేయమని అడుగుతుంది.


నోటీసు అందుకున్న తర్వాత ఏమి చేయాలి?
ఈ-వెరిఫికేషన్ స్కీమ్‌ కింద పంపిన నోటీసు కంప్లైయెన్స్ పోర్టల్‌లో కనిపిస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రెస్‌కు కూడా హెచ్చరిక వస్తుంది. నోటీసు అందుకున్న తర్వాత, ఆదాయపు పన్ను పోర్టల్ https://eportal.incometax.gov.in/ కి లాగిన్ అవ్వాలి. 'పెండింగ్ యాక్షన్స్‌' ట్యాబ్‌కు వెళ్లి, 'కంప్లయన్స్ పోర్టల్'పై క్లిక్ చేసి, 'eVerification'ని ఎంచుకోండి. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్‌పై క్లిక్ చేయండి. నోటీసును డౌన్‌లోడ్ చేయడానికి, డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్‌పై (DIN) క్లిక్ చేయండి. సమాధానం ఇవ్వడానికి 'సబ్మిట్‌' లింక్‌పై క్లిక్ చేసి, సంబంధిత పత్రాలను జోడించి, సబ్మిట్‌ బటన్‌పై క్లిక్ చేయండి.


ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ-వెరిఫికేషన్ నోటీసు మీకు రాకూడదు అనుకుంటే, ITRను ఫైల్‌ చేసే ముందే AISను చూడండి. రెండిటినీ పోల్చి వివరాలు సరిచేసుకోవాలి. ఒకవేళ ITR ఫైల్‌ చేసిన తర్వాత వ్యత్యాసాన్ని మీరు గుర్తిస్తే, నవీకరించిన రిటర్న్‌ను ఫైల్ చేయండి. ఒక ఆర్థిక సంవత్సరానికి ఒక అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను మాత్రమే ఫైల్ చేయవచ్చు, మళ్లీ మళ్లీ పైల్‌ చేయడం కుదరదు. మీకు సందేహాలు ఉంటే పన్ను సలహాదారు లేదా CA సహాయం తీసుకోండి. వాలి. ఆదాయపు పన్ను రిటర్న్ యొక్క ఈ-వెరిఫికేషన్ మరియు ఈ-వెరిఫికేషన్ మధ్య గందరగోళం చెందకండి. ఈ రెండూ వేర్వేరు విషయాలు. రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ముందు, AISని తనిఖీ చేయండి, తద్వారా ITR ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి పొరపాటు జరగదు మరియు నవీకరించబడిన రిటర్న్‌ను ఫైల్ చేయవలసిన అవసరం లేదు.