Special Fixed Deposits End On 31 March: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, కీలక వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) దఫదఫాలుగా పెంచుతూ రావడంతో దేశంలోని అన్ని బ్యాంకులు కూడా డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను పెంచాయి. ముఖ్యంగా, కొన్ని ప్రత్యేక కాలావధి పథకాలను ప్రకటించి డిపాజిట్లను ఆకర్షిస్తున్నాయి. అలాంటి కొన్ని 'ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల' (Special Fixed Deposit Schemes) గడువు ఈ నెలాఖారుతో, అంటే 2023 మార్చి 31తో ముగుస్తుంది. ఈ ప్రత్యేక పథకాల ద్వారా ప్రత్యేక లబ్ధి పొందాలంటే కేవలం అతి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. 2023 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ పథకాలు కనిపించవు.


మార్చి 31 వరకే కనిపించే "స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌"లు, వాటి వడ్డీ రేట్లు:


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‍‌(SBI): దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌, రెండు ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను ప్రకటించింది. వాటిలో 1. ఎస్‌బీఐ వియ్‌ కేర్‌ పథకం 2. అమృత్‌ కలశ్‌ పథకం. ఈ రెండు స్కీమ్‌లను 2020లో ప్రారంభించారు.  


ఎస్‌బీఐ వియ్‌ కేర్‌ ‍‌(SBI WeCare FD) పథకం కింద, సాధారణ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే 30 bps నుంచి 50 bps వరకు అదనపు వడ్డీ చెల్లిస్తారు. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుతం ఈ పథకంలో 7.50 శాతం వడ్డీ లభిస్తోంది.


ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌ స్కీమ్‌, 400 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం. ఈ పథకం పెట్టుబడి పెట్టే సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.60 శాతం చొప్పున వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తుంది. అంతేకాదు, ఇదే పథకం కింద SBI ఉద్యోగులకు, పింఛనుదార్లకు మరొక శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది.


HDFC బ్యాంక్ స్పెషల్ FD
ఈ బ్యాంక్, సీనియర్ సిటిజన్ల కోసం 2020 మే నెలలో ప్రత్యేక FDని ప్రారంభించింది. ఆ పథకం పేరు ‘సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’. ఈ ప్రత్యేక పథకం కింద 0.25 శాతం అదనపు వడ్డీ ఇస్తారు. దీని కాలపరిమితి 10 సంవత్సరాలు & వడ్డీ 7.75 శాతం.


IDBI బ్యాంక్ స్పెషల్‌ FD
ఈ బ్యాంక్ 400 రోజులు & 700 రోజుల కాల వ్యవధి గల ప్రత్యేక FDలపై సాధారణ ప్రజలకు 0.25% వడ్డీని & సీనియర్ సిటిజన్‌లకు 0.50% వడ్డీని అదనంగా అందిస్తోంది. దీని పేరు ‘నమాన్‌ సీనియర్‌ సిటిజన్‌ డిపాజిట్‌’. ఈ FDపై సీనియర్ సిటిజన్లకు 7.50% వడ్డీ చెల్లిస్తారు. 10 సంవత్సరాల కాల గడువు FD మీద 7 శాతం వడ్డీని ఆఫర్‌ చేస్తోంది.


ఇండియన్ బ్యాంక్ స్పెషల్ FD
555 రోజుల ప్రత్యేక FD పథకాన్ని ఈ బ్యాంక్‌ ప్రవేశపెట్టింది. ఈ పథకం పేరు ‘ఇండ్‌ శక్తి 555 డేస్‌. దీని కింద, సాధారణ ప్రజలకు 7% వడ్డీని & సీనియర్ సిటిజన్లకు 7.50% వడ్డీని ఈ బ్యాంక్‌ చెల్లిస్తోంది. ఈ స్కీమ్‌లో కనిష్టంగా రూ. 5,000 నుంచి గరిష్టంగా రూ. 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.


పంజాబ్ అండ్ సింథ్‌ బ్యాంక్
ఈ బ్యాంక్ మూడు రకాల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లను అమలు చేస్తోంది. మొదటిది 222 రోజుల ప్రత్యేక FD. ఈ స్కీమ్‌ పేరు 'ఉత్కర్ష్‌ 222 డేస్‌'. ఈ పథకం కింద 8.85 శాతం వరకు వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది. రెండో స్కీమ్‌ 601 రోజుల FD. ఈ పథకం పేరు ‘పీఎస్‌బీ ఫ్యాబ్యులస్‌ 601 డేస్‌’. ఈ స్కీమ్‌ కింద 7.85 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. మూడో స్కీమ్‌ 300 రోజుల FD. దీని పేరు ‘పీఎస్‌బీ ఫ్యాబ్యులస్‌ 300 డేస్‌’. ఈ కాల గడువు డిపాజిట్ల మీద 8.35 శాతం వరకు వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది.