Mutual Fund Nomination Date Extension: మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదార్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఊరట ప్రకటించింది. మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాల్లో నామినేషన్ గడువును పొడిగించింది. ఈ గడువును ఇప్పుడు 30 సెప్టెంబర్ 2023 వరకు ఎక్స్‌టెండ్‌ చేసింది. అంటే, తమ ఖాతాల్లో నామినీ పేరును చేర్చడానికి పెట్టుబడిదార్లకు మరో 6 నెలలు సమయం దొరికింది. 


ఇప్పటి వరకు ఈ గడువు ఈ నెలాఖరుతో (31 మార్చి 2023) ముగియాల్సి ఉంది. 2023 మార్చి 31లోగా నామినేషన్‌ను పూర్తి చేయని పక్షంలో పెట్టుబడిదార్లు నష్టాలను చవిచూడవచ్చని జులై 2022లోనే సెబీ ఒక సర్క్యులర్ జారీ చేసింది.


సెప్టెంబర్ 30, 2023 లోపు నామినేషన్ పూర్తి చేయాలి
నామినేషన్ గడువును 30 సెప్టెంబర్ 2023 వరకు పొడిగిస్తూ, మంగళవారం (మార్చి 28, 2023) నాడు సెబీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అన్ని సింగిల్ & జాయింట్ మ్యూచువల్ ఫండ్‌లలో నామినేషన్‌ను పూర్తి చేయడానికి ఇది వర్తిస్తుంది. కొత్త గడువు పూర్తయ్యేలోగా నామినీ పేరును ఖాతాల్లో చేర్చకపోతే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో స్తంభించిపోతుందని (mutual fund investor's portfolio freezes) సెబీ తెలిపింది. 


మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాలతో పాటు, డీమ్యాట్ & ట్రేడింగ్ ఖాతాల నామినేషన్ గడువును కూడా 2023 సెప్టెంబర్ 30 వరకు సెబీ పొడిగించింది.


మ్యూచువల్ ఫండ్‌ ఖాతాలో నామినీ పేరును ఎందుకు చేర్చాలి?
వాస్తవానికి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల మంచి కోసమే సెబీ ఈ రూల్‌ తీసుకొచ్చింది. ఒక వ్యక్తి మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టి, పథకం మెచ్యూరిటీకి ముందే దురదృష్టవశాత్తు మరణిస్తే, నామినేషన్‌ లేని పక్షంలో అతని డబ్బును కుటుంబ సభ్యులకు బదిలీ చేయడం కష్టం అవుతుంది. అదే, నామినేషన్‌ ప్రక్రియ పూర్తయి ఉంటే ఎలాంటి సమస్య లేకుండా ఆ డబ్బు సులభంగా నామినీకి అందుతుంది, ఆ పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థికంగా రక్షణ లభిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, పెట్టుబడిదార్ల ప్రయోజనం కోసం మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో నామినేషన్‌ను SEBI తప్పనిసరి చేసింది.


ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు
మ్యూచువల్ ఫండ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం... మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదార్లు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ నామినేషన్ పనిని పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా నామినీ పేరును మీ ఖాతాకు జత చేయడానికి, మీరు మీ మ్యూచువల్ ఫండ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అకౌంట్‌లో లాగిన్‌ అయిన తర్వాత, అకౌంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో నామినీ డిటెయిల్స్‌ ఆప్షన్‌ను ఎంచుకుని, మిగిలిన పనిని పూర్తి చేయవచ్చు. లేదా, అధికారిక హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి సాయం తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఈ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం కూడా హెల్ప్‌లైన్‌ నంబర్‌ నుంచి సాయం కోరవచ్చు. ఆఫ్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ పనిని పూర్తి చేయడానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పడుతుంది.


పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపు
మంగళవారం, CBDT కూడా పాన్‌-ఆధార్‌తో అనుసంధానం గడువును పొడిగించింది. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేయడానికి జూన్ 30, 2023 వరకు గడువు ఉంది. పన్ను చెల్లింపుదార్లకు మరికొంత సమయం ఇవ్వడానికి, పాన్-ఆధార్‌ అనుసంధాన గడువును 2023 మార్చి 31 నుంచి 2023 జూన్ 3 వరకు పొడిగించినట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ ప్రకటించింది.