Understanding The 50:30:20 Rule: ప్రతి కుటుంబ ఆదాయంలో ఖచ్చితంగా పొదుపులు ఉండాలి. ఖర్చు పెట్టగా మిలిగిన దానిని పొదుపు చేయడం కాదు, పొదుపు చేయగా మిగిలిన దానిని ఖర్చు పెట్టుకోవాలన్నది ఆర్థికవేత్తలు చెప్పే విలువైన మాట. ఆర్థిక నిర్ణయాలు కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేసే ఈ ప్రపంచంలో, తెలివైన వారి ఆలోచనలు & ఆచరణల నుంచి 50:30:20 నియమం ఉద్భవించింది. అవసరాలు - కోరికలు మధ్య తేడాను విడమరిచి చెబుతూ, ఆర్థిక నిర్వహణ విషయంలో ఇదొక సమర్థవంతమైన ఫ్రేమ్‌వర్క్‌గా మారింది. ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఇది మరింత స్పష్టతను, సమతుల్యతను అందిస్తుంది.


ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 50:30:20 రూల్‌, వ్యక్తి/కుటుంబ ఆదాయాన్ని మూడు విభిన్న వర్గాలుగా విభజిస్తుంది. అవి - 1. అవసరాలు, 2. కోరికలు, 3. పొదుపులు లేదా రుణ చెల్లింపులు.


ఆదాయం కేటాయింపు: బిగ్‌ 50 రూల్‌
ఈ బడ్జెట్ వ్యూహంలో మొదటి అడుగు.. వ్యక్తి లేదా కుటుంబ ఆదాయంలో 50 శాతాన్ని కుటుంబ అవసరాలకు (Needs) కేటాయించడం. ఇందులో... హౌసింగ్, యుటిలిటీస్, కిరాణా సామగ్రి, బైక్‌/కార్‌ నిర్వహణ వంటి కీలకమైన ఖర్చులు ఉంటాయి. సంపాదనలో సగం మొత్తాన్ని ఈ అవసరాలకు కేటాయించడం ద్వారా ఆ కుటుంబం తమ ప్రాథమిక జీవన అవసరాలను తీర్చుకోవాలి. ఆదాయంలో 50 శాతం మొత్తానికి తగ్గట్లుగా ఖర్చులను ప్లాన్‌ చేసుకోవాలి, ఈ గీతను దాటకూడదు. 50 శాతం డబ్బుతో స్వేచ్ఛగా రోజువారీ అవసరాలు తీర్చుకోవచ్చు. ఇంకా సగం డబ్బు మిగులుతుంది కాబట్టి ఆ కుటుంబంపై ఆర్థిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇది మొత్తం ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 


జీవితంలో సమతౌల్యం: మిడ్‌ 30 రూల్‌
50:30:20 నియమంలో రెండో భాగం.. వ్యక్తులు తమ ఆదాయంలో 30 శాతాన్ని విచక్షణతో కూడిన ఖర్చుల కోసం కేటాయించడం. దీనిని కోరికలు (Wants)గా వర్గీకరించారు. జీవనశైలిని మెరుగుపరుచుకునే ఖర్చుల కోసం ఈ భాగాన్ని ఉద్దేశించారు. భోజనాలు, వినోదం, ప్రయాణం, హాబీలు వంటివి ఇందులోకి వస్తాయి. సంపాదనలో 30 శాతం డబ్బును దీనికి కేటాయించడం వల్ల వ్యక్తులు/కుటుంబం తమ కోర్కెలను ఆస్వాదించవచ్చు & జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు. అయితే, ఇది విచక్షణతో కూడిన ఖర్చు. అవసరం అయితేనే ఖర్చు చేయాలి లేదంటే ఆ డబ్బు మిగుల్చుకోవాలి.


భవిష్యత్తు కోసం సిద్ధం: స్మాల్‌ 20 రూల్‌
ఆదాయంలో అవసరాల కోసం 50 శాతం, కోర్కెల కోసం 30 శాతం పోగా, మిగిలిన 20 శాతం డబ్బును పొదుపు కోసం లేదా రుణ చెల్లింపులకు కేటాయించాలి. అత్యవసర మొత్తాన్ని (emergency fund) కూడబెట్టడంలో, పదవి విరమణ కోసం పొదుపు చేయడంలో (saving for retirement), భవిష్యత్తు లక్ష్యాల కోసం పెట్టుబడి పెట్టడంలో (investing in future goals) ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు, బ్యాంక్‌ రుణాలు సహా ఇప్పటికే ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునే అవకాశాన్ని కూడా ఇది అందిస్తుంది. పొదుపు, రుణ తగ్గింపుపై దృష్టి పెట్టడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, స్థిరత్వానికి మార్గం సుగమం అవుతుంది.


50:30:20 రూల్‌కు కట్టుబడి ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరగడమే కాదు... కుటుంబ తక్షణ అవసరాలు, సరదాలు కూడా తరతాయి. భవిష్యత్ ఆర్థిక సవాళ్లకు సదా సిద్ధంగా ఉండేలా ఇది మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది.


మరో ఆసక్తికర కథనం: బ్లూ కలర్‌ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్‌ చేసుకోండి