ITR E-Verification: ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేస్తారు. అయితే, ప్రతి ఒక్క రిటర్న్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌ క్షుణ్నంగా పరిశీలించదు, పరిశీలించలేదు కూడా. కాబట్టి, ర్యాండమ్‌గా కొన్ని అప్లికేషన్స్‌ సెలెక్ట్‌ చేసి తనిఖీ చేస్తుంది. దానినే ఈ-వెరిఫికేషన్ అంటారు. ఈ-వెరిఫికేషన్‌ కోసం ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని వేల కేసులను మాత్రమే ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఎంపిక చేస్తుంది. ఇలా సెలెక్ట్‌ చేసినవాటిని పూర్తిగా పరిశీలిస్తుంది, కొందరు టాక్స్‌ పేయర్లకు నోటీసులు పంపుతుంది. 


ఈ-వెరిఫికేషన్ ఎందుకు?
ఈ-వెరిఫికేషన్‌ స్కీమ్‌ ఉద్దేశం పన్ను ఎగవేతలు లేకుండా, టాక్స్‌ పేయర్లు ఏ సమాచారాన్ని దాచకుండా, నిజాయితీగా ఐటీఆర్‌ ఫైల్‌ చేసేలా చూడడం. ఒక టాక్స్‌ పేయర్‌కు సంబంధించి బ్యాంక్‌లు/ఆర్థిక సంస్థలు నుంచి వచ్చిన డేటాను.. పన్ను చెల్లింపుదారు ITR ద్వారా అందించిన సమాచారాన్ని ఐటీ డిపార్ట్‌మెంట్‌ పోల్చి చూస్తుంది. రెండు డేటాల్లో తేడా ఉండకూడదు. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే రియాక్ట్‌ అవుతుంది. ఐటీ డిపార్ట్‌మెంట్‌, కంప్లైయన్స్‌ పోర్టల్ (compliance portal) ద్వారా సదరు టాక్స్‌ పేయర్‌కు సెక్షన్ 133(6) కింద నోటీసు పంపుతుంది. ఫైల్‌ చేసిన రిటర్న్‌లో సంబంధిత లావాదేవీ లేదా లావాదేవీలను చూపనందుకు వివరణ లేదా రుజువు కోరతుంది. పన్ను చెల్లింపుదారు కంప్లైయెన్స్ పోర్టల్‌లోనే సమాధానం చెప్పాలి. దీనికి డిపార్ట్‌మెంట్ సంతృప్తి చెందితే అక్కడితో ఆ సమస్య ముగిసినట్లే. సంతృప్తి చెందకపోతే రిటర్న్‌ను అప్‌డేట్ చేయమని అడుగుతుంది.


నోటీసు అందుకున్న తర్వాత ఏమి చేయాలి?
ఈ-వెరిఫికేషన్ స్కీమ్‌ కింద ఐటీ డిపార్ట్‌మెంట్‌ పంపిన నోటీసు కంప్లైయెన్స్ పోర్టల్‌లో కనిపిస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రెస్‌కు కూడా అరెల్ట్‌ కూడా వస్తుంది. ఒకవేళ ఈ-వెరిఫికేషన్‌ నోటీసు అందుకుంటే.. ముందుగా ఆదాయపు పన్ను పోర్టల్ https://eportal.incometax.gov.in/ కి లాగిన్ అవ్వాలి. 'పెండింగ్ యాక్షన్స్‌' ట్యాబ్‌కు వెళ్లి, 'కంప్లయన్స్ పోర్టల్'పై క్లిక్ చేసి, 'eVerification'ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్‌పై క్లిక్ చేయాలి. నోటీసును డౌన్‌లోడ్ చేయడానికి, డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్‌పై (DIN) క్లిక్ చేయాలి. సమాధానం ఇవ్వడానికి 'సబ్మిట్‌' లింక్‌పై క్లిక్ చేసి, సంబంధిత పత్రాలను జోడించి, సబ్మిట్‌ బటన్‌పై క్లిక్ చేయాలి.


ఈ విషయాలను గుర్తుంచుకోండి
ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ-వెరిఫికేషన్ నోటీసు మీకు రాకూడదు అనుకుంటే, ITRను ఫైల్‌ చేసే ముందే AISను (Annual Information Statement) చూడండి. పన్ను చెల్లింపుదారు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని ఖాతాలు AISలో ఉంటాయి. బ్యాంకు డిపాజిట్లు, షేర్ల కొనుగోలు, అమ్మకం వంటివాటిపై వడ్డీ ఆదాయాలు, లాభనష్టాలన్నీ అందులో కనిపిస్తాయి. AISలో ఉన్న లెక్కలు, మీ ITRలో ఉన్న లెక్కలు సరిపోయాయో లేదో చెక్‌ చేసుకోండి, తేడా ఉంటే తదనుగుణంగా మార్పులు చేయండి. ఒకవేళ ITR ఫైల్‌ చేసిన తర్వాత వ్యత్యాసాన్ని మీరు గుర్తిస్తే, అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను ఫైల్ చేయండి. ఒక ఆర్థిక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు, మళ్లీ మళ్లీ ఫైల్‌ చేయడం కుదరదు. మీకు సందేహాలు ఉంటే టాక్స్‌ అడ్వైజర్‌ లేదా CA సాయం తీసుకోండి. ఇన్‌కం టాక్స్‌ రిటర్న్ ఈ-వెరిఫికేషన్‌కు, ఈ-వెరిఫికేషన్ మధ్య కన్‌ఫ్యూజ్‌ కావద్దు. ఆ రెండూ వేర్వేరు విషయాలు. రిటర్న్‌ను ఫైల్ చేయడానికి ముందే AIS తనిఖీ చేయండం చాలా ముఖ్యం. తద్వారా ITR ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి పొరపాటు జరగదు, అప్‌డేటెడ్‌ రిటర్న్‌ను ఫైల్ చేయవలసిన అవసరం రాదు.


మరో ఆసక్తికర కథనం: ఇబ్బడిముబ్బడిగా పెరిగిన డబ్బు, అదృష్టవంతులంటే వీళ్లే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial