Income Tax Return Filing 2024: ఆదాయ పన్ను పత్రాల దాఖలు విషయంలో సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు కొన్ని సౌలభ్యాలు, ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి ముందే వాటిని అర్థం చేసుకోవాలి. సీనియర్లు, తమ ఆదాయం ఆధారంగా నిర్దిష్ట ఐటీ ఫారాన్ని ఎంచుకోవాలి. 


ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల కంటే తక్కువ సంపాదించే పెన్షనర్లు సహజ్ (ఐటీఆర్ 1) ఉపయోగించవచ్చు. ఆస్తి, ఇతర వనరులు లేదా మూలధన లాభాల ద్వారా ఆదాయం ఉన్నవారు తప్పనిసరిగా ITR-2ని ఎంచుకోవాలి. వ్యాపారాలు లేదా వృత్తుల నుంచి సంపాదించే పెన్షనర్లు ITR-3 లేదా ITR-4 ద్వారా టాక్స్‌ చెల్లించాలి.


మినహాయింపు పరిమితి
ఆదాయ పన్ను చట్టం ప్రకారం, సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి (basic exemption limit) ఉంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల మినహాయింపు పరిమితి ఉంది. కొత్త పన్ను విధానం పరిధిలోకి వచ్చే వారికి కూడా రూ.3 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. ఇది కాకుండా... ఆదాయాన్ని బట్టి 0 నుంచి 30% వరకు టాక్స్‌ చెల్లించాలి.


ఫామ్‌-16
సీనియర్ సిటిజన్లు, పెన్షన్ రూపంలో ఆదాయం పొందేవాళ్లు ఫారం 16 తీసుకోవాలి. ఫామ్ 26AS స్టేట్‌మెంట్ ద్వారా మొత్తం TDS సంబంధిత సమాచారం తెలుస్తుంది. 


తగ్గింపులు
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ (SCSS) పెట్టుబడిదార్లు సెక్షన్ 80C కింద మినహాయింపును ఉపయోగించుకోవచ్చు. సెక్షన్ 80TTB కింద, బ్యాంక్ ఖాతాల నుంచి పొందే వడ్డీ ఆదాయంపై రూ. 50,000 వరకు తగ్గింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వ్యక్తులు ఈ తగ్గింపుల ప్రయోజనాలు పొందలేరు.


ఫారం 15H
సీనియర్ సిటిజన్ సంపాదించిన వడ్డీ డబ్బు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 దాటితే, సాధారణంగా, బ్యాంకులు TDS కట్‌ చేస్తాయి. సీనియర్ పౌరుడి ఆదాయం పన్ను విధించదగిన పరిమితి కంటే తక్కువగా ఉంటే, TDS తీసివేయకుండా బ్యాంక్‌ను అభ్యర్థించవచ్చు. దీనికోసం, ఏడాది మొదట్లోనే బ్యాంక్‌కు ఫామ్ 15H సమర్పించాలి. ITR ఫైల్ చేస్తున్నప్పుడు ఫారం 15Hని దగ్గర పెట్టుకోవాలి.


పన్ను ప్రయోజనాలు
రివర్స్ మార్టిగేజ్‌ పథకం కింద మూలధన లాభాలపై మినహాయింపు పొందొచ్చు. రూ. 50,000 వరకు ఆరోగ్య బీమా ప్రీమియంలపై మినహాయింపు తీసుకోవచ్చు. కొన్ని వ్యాధులకు సంబంధించిన వైద్య ఖర్చులపై రూ. 1 లక్ష వరకు క్లెయిమ్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో సీనియర్‌ సిటిజన్‌ మొత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉంటే... సేవింగ్స్‌ & ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి వచ్చే రూ. 50,000 వడ్డీ ఆదాయంపై TDS కట్‌ కాకుండా మినహాయింపు లభిస్తుంది.  సీనియర్ సిటిజన్‌కు వ్యాపార ఆదాయం లేకుంటే ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.


సెక్షన్ 87A
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద కూడా మినహాయింపులు ఉన్నాయి. చాప్టర్ VI-A కింద తగ్గింపుల తర్వాత సీనియర్‌ సిటిజన్‌ ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉంటే పన్ను రాయితీ (రిబేట్‌) లభిస్తుంది. చెల్లించాల్సిన మొత్తం పన్ను లేదా రూ.12,500లో (కొత్త పన్ను విధానంలో రూ.25,000) ఏది తక్కువైతే రిబేట్‌ దానికి పరిమితం అవుతుంది. వయస్సు, ఆదాయ వర్గంతో సంబంధం లేకుండా అందరు టాక్స్‌పేయర్లకు ఈ ప్రయోజనం చెల్లుబాటు అవుతుంది.


సెక్షన్ 194P
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 194P ప్రకారం.... 75 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, కేవలం పెన్షన్ ఆదాయం & మినహాయింపు ఉన్న బ్యాంక్ ఖాతాల వడ్డీ ఆదాయాన్ని పొందుతున్న వాళ్లు ITR ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం, సదరు సీనియర్‌ సిటిజన్‌ తప్పనిసరిగా ఫామ్ 12BBAలో డిక్లరేషన్‌ పూరించాలి. పెన్షన్, వడ్డీ ఆదాయాన్ని పొందుతున్న బ్యాంకుకు ఆ ఫారాన్ని సమర్పించాలి.


మరో ఆసక్తికర కథనం: జులై నెలలో మొహర్రం సెలవు - మొత్తం 12 బ్యాంక్‌ హాలిడేస్‌