Small Saving Schemes Interest Rates: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ 3.0 ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల విషయంలో గుడ్‌న్యూస్‌ చెప్పే అవకాశం ఉంది. పీపీఎఫ్‌ (Public Provident Fund), సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) సహా అన్ని స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ వడ్డీ రేట్లను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. 


ఈ నెల 28న (శుక్రవారం), చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్షిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి (2024 జులై-సెప్టెంబర్ కాలం) ప్రభుత్వ పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లను ఆర్థిక శాఖ ప్రకటిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వడ్డీ రేటును పెంచొచ్చని మార్కెట్‌ అంచనా వేస్తోంది.


వడ్డీ రేట్లు పెంచనున్న ప్రభుత్వం!
ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (2024 ఏప్రిల్-జూన్ కాలం) స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి-మార్చి కాలం) ఉన్న వడ్డీ శాతాలనే కొనసాగించింది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆ సమయంలో దేశంలో ఎలక్షన్ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఇప్పుడు, వరుసగా మూడోసారి ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో NDA ప్రభుత్వం ఏర్పాటైంది. మన దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న పేద & మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాల విషయంలో మంచి వార్తను ప్రకటించొచ్చు.


పీపీఎఫ్ ఇన్వెస్టర్ల నిరాశ
కొత్త సంవత్సరం సందర్భంగా, సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడిదార్లకు కేంద్ర సర్కారు పెద్ద కానుక అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఈ పథకం వడ్డీ రేటును 8.0 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది. మూడు సంవత్సరాల కాల పరిమితి కలిగిన పోస్టాఫీస్‌ డిపాజిట్లపై వడ్డీని 7.0 శాతం నుంచి 7.1 శాతానికి పెంచింది. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు మార్పులు చేసింది తప్పితే, ఇతర పథకాల జోలికి వెళ్లలేదు. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడిదార్లను మరోమారు నిరాశకు గురి చేసింది.


2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి పీపీఎఫ్‌ రేటులో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం, పీపీఎఫ్‌ ఇన్వెస్టర్లకు 7.10 శాతం వడ్డీ దక్కుతోంది. ఇది తప్ప, మిగిలిన అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచుతూ వచ్చింది. ఇప్పుడు... సేవింగ్స్ డిపాజిట్‌పై 4 శాతం వడ్డీ, 1 సంవత్సరం టైమ్ డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ, 2 సంవత్సరాల టైమ్ డిపాజిట్‌పై 7 శాతం వడ్డీ, 5 సంవత్సరాల డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ, 5 సంవత్సరాల రికరింగ్‌ డిపాజిట్‌పై 6.7 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణం అడ్డంకిగా ఉన్నందున, ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో RBI పాలసీ రేట్లలో మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, PPF వడ్డీ రేటు ఈసారి పెరిగే అవకాశం ఉంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి