Income Tax Return Filing 2024: మనం కష్టపడి సంపాదించే ప్రతి ఆదాయంపైనా ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లించాలని కొందరు భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. పన్ను విధించే ఆదాయాల్లాగానే, పన్ను పరిధిలోకి రాని ఆదాయాల వనరులు (Tax-Free Income Sources) కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఇన్‌కమ్‌ సోర్సెస్‌, రూల్స్‌ గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే మీరు పన్ను ఆదా (Income Tax Saving) చేయగలరు. 


ఎలాంటి ఆదాయాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు?


వారసత్వ ఆస్తులు
మీ తల్లిదండ్రుల నుంచి మీకు ఏదైనా ఆస్తి, నగలు లేదా నగదు వంటివి వారసత్వంగా వస్తే, వాటి మీద మీరు రూపాయి కూడా ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మీ పేరు మీద వీలునామా ఉంటే, దాని ద్వారా వచ్చిన మొత్తంపై టాక్స్‌ కట్టక్కర్లేదు. అయితే, మీ దగ్గర ఉన్న ఆస్తి ద్వారా సంపాదించే ఆదాయంపై పన్ను చెల్లించాలి.


వివాహాల సమయంలో వచ్చే బహుమతులు
మీ పెళ్లిలో స్నేహితులు లేదా బంధువుల నుంచి మీరు స్వీకరించే బహుమతులపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, మీ పెళ్లి సమయంలోనే మీరు ఆ బహుమతిని పొంది ఉండాలి. ఒకవేళ, మీ వివాహం అయిపోయిన కొన్ని నెలల తర్వాత ఎవరైనా మీకు పెళ్లి బహుమతి పంపితే, అది కూడా టాక్స్‌ పరిధిలోకి రాదు. బహుమతి విలువ రూ.50,000 దాటితే మాత్రం పన్ను చెల్లించాల్సి వస్తుంది.


భాగస్వామ్య సంస్థ నుంచి వచ్చిన లాభం
మీరు ఒక కంపెనీలో భాగస్వామిగా ఉండి & కంపెనీ లాభాల్లో మీ వాటాను తీసుకుంటే, అలాంటి ఆదాయంపైనా టాక్స్‌ కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, మీ కంపెనీ ఆ డబ్బుపై అప్పటికే పన్ను చెల్లించి ఉంటుంది. ఈ మినహాయింపు సంస్థ నుంచి తీసుకున్న లాభానికి మాత్రమే వర్తిస్తుంది. మీరు ఆ సంస్థ నుంచి జీతం పొందుతుంటే పన్ను చెల్లించాలి.


జీవిత బీమా క్లెయిమ్ లేదా మెచ్యూరిటీ మొత్తం
మీరు జీవిత బీమా పాలసీని కొనుగోలు చేస్తే, క్లెయిమ్ లేదా మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం. అయితే, ఇక్కడో షరతు ఉంది.  క్లెయిమ్ లేదా మెచ్యూరిటీ మొత్తం టాక్స్‌-ఫ్రీ కావాలంటే... ఆ పాలసీ వార్షిక ప్రీమియం దాని హామీ మొత్తంలో 10 శాతానికి మించకూడదు. ఈ పరిమితి దాటితే, అదనపు మొత్తంపై పన్ను చెల్లించాలి. కొన్ని కేసుల్లో ఈ డిస్కౌంట్‌ 15 శాతం వరకు ఉంటుంది.


షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లపై రాబడి
షేర్లు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. వాటిని విక్రయించిన తర్వాత వచ్చే లాభంలో లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. లక్ష రూపాయలు దాటిన లాభంపై పన్ను వర్తిస్తుంది.


ఇంకా... ట్యాక్స్ సేవర్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ‍‌(Tax Saver FDs), ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ELSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ (NSC), పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌ (PPF), సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (SGBs) వంటి పథకాల మెచ్యూరిటీ మొత్తాలు టాక్స్‌-ఫ్రీ. 


మరో ఆసక్తికర కథనం: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!