Best Saving Schemes For Women: పొదుపు లేదా పెట్టుబడి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబం ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. మనిషికి ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో డబ్బు అవసరం పడుతుందో ఊహించలేం. అందువల్ల, సంపాదించే ప్రతి వ్యక్తికి.. అతని/ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు పొదుపు చేయమంటూ సలహా ఇస్తుంటారు. ప్రస్తుత కాలంలో, పొదుపు/ పెట్టుబడి కోసం మార్కెట్‌లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.


పురుషులతో సమానంగా మహిళలు పొదుపు చేసేందుకు లేదా పెట్టుబడి పెట్టేందుకు భారతదేశంలో చాలా పథకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి ద్వారా చాలా డబ్బు సంపాదించొచ్చు.


మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ (MSSC)
2023లో భారత ప్రభుత్వం ప్రారంభించిన మహిళా సమ్మాన్ బచత్‌ పత్ర పథకం పెట్టుబడి విషయంలో మహిళలకు మంచి ఆప్షన్‌ అని చెప్పొచ్చు. ఈ పథకం కింద, 2 సంవత్సరాల కోసం పెట్టుబడి పెట్టాలి. కనీసం రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. డిపాజిట్‌ మీద సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ త్రైమాసిక ప్రాతిపదికన, అంటే మూడు నెలలకు లెక్కిస్తారు. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, అసలు మొత్తం + వడ్డీ మొత్తాన్ని కలిపి చెల్లిస్తారు.


పోస్టాఫీస్‌ టైమ్ డిపాజిట్ స్కీమ్‌ (Post Office Time Deposit)
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా మహిళలకు మంచి పెట్టుబడి మార్గంగా ఉంటుంది. ఈ పథకంలో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. స్కీమ్‌ మెచ్యూరిటీ కాలాన్ని బట్టి ఈ పథకంపై వడ్డీ రేటు మారుతుంది. ఇందులో ఒక సంవత్సరం కోసం ఇన్వెస్ట్ చేస్తే 6.9 శాతం వడ్డీ రేటు, 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెడితే 7.5 శాతం వరకు వడ్డీ ఆదాయం లభిస్తుంది.


సుకన్య సమృద్ధి యోజన (SSY)
ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు సుకన్య సమృద్ధి యోజన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం కింద, కనిష్టంగా 250 రూపాయలతో పోస్టాఫీస్‌ లేదా ఏదైనా బ్యాంకులో ఖాతా తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 2.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. పథకంలో 8.20 శాతం వడ్డీ రేటుతో ఆదాయం పొందుతారు. మహిళలు, తమ ఇద్దరు కుమార్తెల పేరిట ఖాతాలు తెరవొచ్చు. ఆ డబ్బు వారి భవిష్యత్తుకు చక్కగా ఉపయోగపడుతుంది.


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ (NSC)
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కూడా మహిళలు పొదుపు/పెట్టుబడి కోసం మంచి ఎంపిక. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తం అవసరం లేదు. చేతిలో వెయ్యి రూపాయలు ఉన్నా ఈ స్కీమ్ కింద అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కాలవ్యవధి 5 సంవత్సరాలు. ఇందులో 7.7 శాతం వడ్డీ రాబడి వస్తుంది.


పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF)
పెట్టుబడి విషయంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన పథకం ఇది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో ఏడాదికి కనిష్టంగా రూ. 500, గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఇందులో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఏడాదికి 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ మొత్తంపై ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. స్కీమ్‌ మెచ్యూరిటీ పిరియడ్‌ 15 సంవత్సరాలు. పెట్టుబడిని ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు - ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు!