SBI We Care Special Scheme Details In Telugu: మీరు సీనియర్ సిటిజన్ అయి ఉండి, పెట్టుబడి పెట్టడానికి మంచి మార్గం కోసం చూస్తున్నట్లయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ కోసం ఒక ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని (SBI Special FD Scheme) రన్‌ చేస్తోంది. ఆ పథకం గడువును ఇటీవలే పొడిగించింది. 


సీనియర్‌ సిటిజన్ల కోసం స్టేట్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం పేరు ఎస్‌బీఐ వికేర్‌ స్కీమ్‌. వాస్తవానికి, ఇందులో ఇన్వెస్ట్ చేసే గడువు ఈ ఏడాది మార్చి 31తోనే ముగిసింది. అయితే, బ్యాంక్‌ ఆ గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పెంచింది. తద్వారా, ఎస్‌బీఐ వికేర్‌ ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి బ్యాంక్‌ మరో ఛాన్స్‌ ఇచ్చింది. ఇప్పుడు, ఈ ఎఫ్‌డీ పథకంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది.


ఆకర్షణీయమైన వడ్డీ రేటు
SBI వీకేర్ స్కీమ్‌లో అత్యంత ముఖ్యమైన విషయం.. ఇందులో లభించే ఆకర్షణీయమైన వడ్డీ రేటు. ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కింద అకౌంట్‌ ప్రారంభించిన సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఆదాయం (SBI WeCare Scheme Interest Rate) లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో కనీసం 5 సంవత్సరాలు - గరిష్టంగా 10 సంవత్సరాల వరకు డబ్బు డిపాజిట్‌ చేయొచ్చు. ఇతర ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లతో పోలిస్తే, ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లో మంచి వడ్డీ లభిస్తుంది. అందుకే ఈ FD స్కీమ్ చాలా పాపులర్‌ అయింది.


మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్ ఆప్షన్‌
SBI వీకేర్ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసిన డబ్బు 10 సంవత్సరాల్లో మెచ్యూరిటీ పూర్తి చేసుకుంటుంది. కావాలనుకుంటే, మెచ్యూరిటీ సమయంలో ఆ డబ్బును తీసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ తర్వాత కూడా ఆ ఖాతాను రెన్యువల్‌ చేసుకోవచ్చు. ఈ ఎఫ్‌డీ అకౌంట్‌లో మంచి మొత్తాన్ని 10 సంవత్సరాల కాలం కోసం డిపాజిట్ చేస్తే, కేవలం వడ్డీ రూపంలోనే లక్షల రూపాయలు తిరిగి వస్తాయి. మీ ఖర్చుల కోసం వడ్డీ డబ్బు వరకు విత్‌డ్రా చేసి, అసలు మొత్తంతో అదే ఖాతాను రెన్యువల్‌ చేయొచ్చు. ఈ విధంగా, మీరు ఒకసారి డిపాజిట్‌ చేసిన డబ్బే మీకు మళ్లీ మళ్లీ డబ్బును సంపాదించి పెడుతుంది.


SBI అమృత్‌ కలశ్‌ పథకం
సీనియర్‌ సిటిజన్ల కోసమే కాకుండా, సాధారణ ప్రజల కోసం కూడా స్టేట్‌ బ్యాంక్‌ మంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను నిర్వహిస్తోంది. ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ స్కీమ్‌ (SBI Amrit Kalash Scheme) వాటిలో ఒకటి. ఇది కూడా ఒక స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం, మంచి జనాదరణ పొందింది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే తుది గడువు ఎప్పటికప్పుడు ఎక్స్‌టెండ్‌ అవుతోంది. ప్రస్తుతం, ఈ స్కీమ్‌ కింద ఖాతా ప్రారంభించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఉంది. 


SBI అమృత్‌ కలశ్‌ పథకం మెచ్యూరిటీ పిరియడ్‌ 400 రోజులు. ఈ FD స్కీమ్‌లో డబ్బు డిపాజిట్‌ చేసిన సీనియర్‌ సిటిజన్లకు 7.60 శాతం వార్షిక వడ్డీ రేటు (SBI Amrit Kalash Scheme Interest Rate) లభిస్తుంది. సాధారణ పౌరులకు ఏడాదికి 7.10 శాతం వడ్డీ రేటును బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. ఈ డిపాజిట్‌ను మీద లోన్‌ కూడా తీసుకోవచ్చు.


SBI అమృత్‌ కలశ్‌ పథకాన్ని మధ్యలోనే ఆపేసి డబ్బు వెనక్కు తీసుకోవాలనుకుంటే, ఆ అవకాశం కూడా ఉంది. మెచ్యూరిటీ పిరియడ్‌ అయిన 400 రోజుల కంటే ముందే అమృత్‌ కలశ్‌ ఖాతాను రద్దు చేసుకోవచ్చు. 


ఎస్‌బీఐ వికేర్‌ స్కీమ్‌ లేదా అమృత్‌ కలశ్‌ పథకాన్ని ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్‌లో ఓపెన్‌ చేయవచ్చు. ఆన్‌లైన్‌పై అవగాహన లేకుండా మీ దగ్గరలోనే SBI బ్రాంచ్‌కు వెళ్లి ఖాతా ప్రారంభించొచ్చు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి