Atal Pension Yojana Details In Telugu: దేశంలోని ప్రతి వర్గం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక పథకాన్ని ప్రారంభిస్తూనే ఉంటుంది. అలాంటి ఒక పథకం పేరు 'అటల్ పెన్షన్ యోజన' (APY). 60 ఏళ్ల వయస్సు దాటిన సీనియర్ సిటిజన్ వర్గం కోసం ప్రారంభించిన స్కీమ్ ఇది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా వృద్ధాప్యానికి ఆర్థిక భద్రత కల్పించొచ్చు, ప్రతి నెలా రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. మీ వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటే, మీ రిటైర్మెంట్ లేదా 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకుంటే, ప్రభుత్వం నిర్వహించే ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడిని ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ ఆదాయం పొందే వీలుంది.
ప్రతి నెలా రూ. 5,000 వరకు పింఛను
అటల్ పెన్షన్ యోజన ఒక సామాజిక భద్రత పథకం. భారతీయ పౌరులు 60 సంవత్సరాల వయస్సు తర్వాత రెగ్యులర్ ఇన్‌కమ్ పొందేందుకు దీనిని ప్రారంభించారు. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ పథకంలో పెట్టే పెట్టుబడిని బట్టి నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ పొందొచ్చు. APY కింద పెన్షన్ ప్రయోజనం పొందడానికి కనీసం 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలి.
రూ.5,000 వరకు పెన్షన్ పొందాలంటే ఎంత పెట్టుబడి కావాలి?
ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులోనే అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాని భావిద్దాం. అతను రోజుకు 7 రూపాయలు, అంటే నెలకు రూ. 210 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అతను రిటైర్ అయిన తర్వాత నెలనెలా రూ. 5,000 పెన్షన్ వస్తుంది. నెలకు రూ. 1,000 పెన్షన్ పొందడానికి 18 సంవత్సరాల వయస్సులో నెలకు రూ. 42 పెట్టుబడి సరిపోతుంది.
మరో ఆసక్తికర కథనం: సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు - ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు!
భార్యాభర్తలిద్దరికీ పథకం ప్రయోజనం
అటల్ పెన్షన్ యోజన ప్రత్యేకత ఏంటంటే, భార్యాభర్తలిద్దరూ ఈ పథకం ప్రయోజనాలను పొందొచ్చు. ఇద్దరి పెట్టుబడులను కలపడం ద్వారా ప్రతి నెలా రూ. 10,000 పెన్షన్ ప్రయోజనం అందుకోవచ్చు. భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే మరొకరికి పింఛను డబ్బు అందుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత నామినీకి మొత్తం డబ్బు వస్తుంది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించింది.
అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను పొందాలంటే తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండాలి. దీంతో పాటు, బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్ కూడా ఉండాలి. మీ దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అటల్ పెన్షన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రస్తుతం, అటల్ పెన్షన్ యోజనకు దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.
మరో ఆసక్తికర కథనం: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్