Income Tax Return Filing 2024: ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2023-24కు ‍(అసెస్‌మెంట్‌ ఇయర్‌ 2024-25) ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే సీజన్‌ ఏప్రిల్‌ 01 నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని లక్షల మంది ITR 2024 సబ్మిట్‌ చేశారు. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన అన్ని ఫారాలు ఆదాయ పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్‌లో (https://www.incometax.gov.in/iec/foportal/) అందుబాటులో ఉన్నాయి. పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు, ముఖ్యంగా ఉద్యోగులు, ఐటీఆర్‌ దాఖలు చేయడానికి అవసరమైన అన్ని రకాల పత్రాలు సేకరించే పనిలో ఉన్నారు. 


జీతం రూపంలో ఆదాయం పొందే పన్ను చెల్లింపుదార్లకు ఫామ్‌-16 అత్యంత కీలకమైన డాక్యుమెంట్‌. ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌ కోసం అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఫామ్‌-16 జారీ చేస్తాయి. 


2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి సంబంధించి, TDS వివరాలను ఐటీ విభాగం SMSల రూపంలో టాక్స్‌పేయర్లకు పంపుతోంది. ఈ సందేశాలు అందుకున్న వ్యక్తులు ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఉన్న వివరాలు సరిపోవని... ఆదాయం, టీడీఎస్‌, మినహాయింపుల్లాంటి పూర్తి వివరాలు లేకుండా ITR ఫైల్‌ చేయడం మంచిది కాదని టాక్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.


ఆదాయ పన్ను చట్టం ప్రకారం, కంపెనీ యాజమాన్యాలు తమ ఉద్యోగులకు ఏటా జూన్‌ 15వ తేదీ లోగా ఫామ్‌-16 ఇవ్వాలి. ఈ తేదీలోగా ఫామ్-26ASతో పాటు, యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (AIS) కూడా పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ అవుతుంది. ఇవన్నీ పూర్తిగా అందుబాటులోకి వచ్చాకే పన్ను బాధ్యతను ప్రకటించడం మంచిదని ఎక్స్‌పర్ట్స్‌ సూచిస్తున్నారు.


ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైటులో ప్రి-ఫిల్డ్‌ ITR-1 కనిపిస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఇది సమగ్రంగా లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ త్రైమాసికం వరకు ఉన్న ఆదాయ వివరాలు మాత్రమే ఈ ఫామ్‌లో ఇప్పటివరకు నమోదయ్యాయి. మార్చి త్రైమాసికం (జనవరి-మార్చి కాలం) వివరాలు ఇంకా యాడ్‌ కాలేదు. ఈ వివరాలు పూర్తి స్థాయిలో అప్‌డేట్‌ కాకముందే ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తే కొన్ని క్లెయిముల విషయంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఐటీ విభాగానికి కావాలని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుంది. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే తొందరపడొద్దని, అన్ని వివరాలు అప్‌డేట్‌ అయిన తర్వాతే రిటర్న్‌ ఫైల్‌ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. 


కొత్త పన్ను విధానంలో టాక్స్‌ స్లాబ్స్‌ (New Income Tax Regime Slabs):


కొత్త పన్ను విధానంలో ఇప్పుడు 5 టాక్స్‌ స్లాబ్స్‌ ఉన్నాయి: 
రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మొదటి శ్లాబ్‌, దీనిపై 5 శాతం పన్ను 
రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు రెండో శ్లాబ్‌, దీనిపై 10 శాతం పన్ను 
రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు మూడో శ్లాబ్‌, దీనిపై 15 శాతం పన్ను 
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు నాలుగో శ్లాబ్‌, దీనిపై  20 శాతం పన్ను 
రూ.15 లక్షల పైన ఎంతున్నా ఐదో శ్లాబ్‌, దీనిపై 30 శాతం పన్ను చెల్లించాలి.


కొత్త పన్ను విధానంలో రాయితీల పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. రూ.7 లక్షల లోపు వార్షిక ఆదాయం (annual income) ఉన్న వ్యక్తులు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు, కొత్త పన్ను విధానానికి కూడా రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ వర్తిస్తుంది.


2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ను 2024 జులై 31లోగా సమర్పించాలి.


మరో ఆసక్తికర కథనం: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!